aqua industries
-
భారత్‌లో ఆక్వా రంగాన్ని దెబ్బతీయాలని చైనా కుట్ర
-
తీరంలో ‘భూ’చోళ్లు
సముద్ర తీర భూములు కబ్జా అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్వా పరిశ్రమలు అప్పనంగా కలుపుకుంటున్నాయి. రికార్డుల్లో సర్కార్ భూమిగా ఉంటుంది. స్వరూపం చూస్తే అక్కడ పెద్ద పెద్ద కంపెనీల భవనాలు కనిపిస్తుంటాయి. ఐదెకరాల ప్రైవేట్ భూమిని కొని దాని చుట్టు పక్కల పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రహరీలు నిర్మించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులను మామూళ్లతో లోబర్చుకుని అందిన కాడికి భూమిని కలుపుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట తీరం భూ కబ్జాలకు నిలయంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని ఇందుకూరుపేట పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. మైపాడు తీరంలో బీచ్, రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడి తీరం అనువుగా ఉండడంతో ఆక్వా హేచరీలు సైతం సీడ్ ఉత్పత్తిని ప్రారంభించాయి. పదిహేనేళ్ల క్రితం నుంచి ఇక్కడ హేచరీలు ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయి. మైపాడు, కొరుటూరు ప్రాంతాల్లోనే హేచరీలు అధికంగా ఉన్నాయి. ఒక్క మైపాడు పరిసర ప్రాంతంలోనే సుమారు 30 వరకు హేచరీలు ఉన్నాయి. హేచరీలు అధికంగా రావడం, మైపాడు బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతానికి డిమాండ్ ఏర్పడింది. ♦హేచరీల ఏర్పాటు ముందు వరకు ఎకరా రూ.5 లక్షలు పలికిన భూమి ప్రస్తుతం రూ.50 లక్షలకు చేరింది. ♦జిల్లాలోని వివిధ రంగాల వ్యాపారులు, రాజకీయ పార్టీల నేతలు, కొందరు డాక్టర్లు అందరూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంతో బహిరంగ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ♦ఈ క్రమంలో రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూముల స్వాహా పర్వానికి మొదట్లోనే ఒకటి..రెండు హేచరీల నిర్వాహకులు తెర తీశారు. ♦అలా ప్రారంభమైన భూ ఆక్రమణ పర్వం నేటికి అప్రతిహతంగా కొనసాగుతోంది. 12 సర్వే నంబర్లలో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొందరు తమ ప్రైవేట్ భూముల్లో కలుపుకుని హేచరీలు నిర్మించారు. ♦తాజాగా ప్రభుత్వం జిల్లాలో పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అనువైన స్థలాలను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలించారు. దీంతో మైపాడు, కొరుటూరులో 150 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రైవేట్ భూమి మాటున.. ఇందుకూరుపేట మండలం మైపాడు, కొరుటూరు గ్రామాలు సముద్ర తీర ప్రాంతం కావడంతో ప్రభుత్వ భూమికి కొదవ లేదు. ఈ భూముల మధ్య మధ్యలో ప్రైవేట్ భూమి కూడా ఉంది. ఇదే హేచరీల నిర్వాహకులకు వరంగా మారుతోంది. ♦కొంత ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి దానికి రెట్టింపులో ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశారు. ♦ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నంబర్లకు ఆనుకుని అనేక ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. ♦హేచరీల యాజమాన్యం ప్రైవేట్ భూములను అధికారికంగా కొనుగోలు చేసి వాటిలో ప్రభుత్వ భూములు కలుపుకుని ప్రహరీ నిర్మించడం సముద్రం వరకు పైపులైన్లు ఏర్పాటు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ♦ఒక్క కొరుటూరులోనే 10 సర్వే నంబర్లలో 70 ఎకరాలకు పైగా భూమి హేచరీల్లో కలిసి ఉంది. ♦కొందరు హేచరీ నిర్వాహకులు గతంలో అధికారులను లోబర్చుకుని రికార్డులను కూడా తారుమారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ♦గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన హేచరీలు కాల్వ పోరంబోకు, ప్రభుత్వ డొంక, శ్మశాన డొంక, చెరువు పోరంబోకు ఇలా ఏ ఒక్క దాన్ని వదలకుండా అందిన మేరకు కలుపుకున్నాయి. ♦దీనిపై గతంలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి విచారణతో సరి పెట్టారు. ♦కొరుటూరులో 544, 545, 546, 543, 547, 526, 527, 557, 559, 560 తదితర సర్వే నంబర్లలో 10 హేచరీ నిర్వాహకులు ప్రభుత్వ భూమిని కలుపుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. ♦పది సర్వే నంబర్లలో ప్రధానమైన పది కంపెనీలు కలుపుకున్న 70 ఎకరాల భూమి విలువ సుమారు రూ.35 కోట్లు పైమాటే. ♦ఇక మండలం మొత్తంలోనూ ఇదే పరిస్థితి. మండలంలో సుమారు 400 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉన్నట్లు నిర్ధారించారు. వీటి విలువ మొత్తం సుమారుగా రూ.200 కోట్లపై మాటేనని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ♦ఆక్వా పరిశ్రమల భూ ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. -
కప్పులు తీశారు.. కౌన్సిలర్‌గా ఎదిగారు
కష్టాలను దాటిన కన్నమనాయుడు తాడేపల్లిగూడెం : ఈయన పేరు చుక్కా కన్నమనాయుడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చుక్కపేటలో నిరుపేద కుటుంబానికి చెందిన అతని తల్లిదండ్రులు అప్పలనాయుడు, సింహా చలం పొట్టకూటి కోసం తాడేపల్లిగూడెం పట్టణానికి వలస వచ్చారు. కన్నమనాయుడు రెండేళ్ల ప్రాయంలో వారితోపాటే ఇక్కడకు చేరుకున్నారు. జిల్లాలు దాటివచ్చిన కన్నమ నాయుడు బతుకుదెరువు కోసం కష్టాన్ని నమ్ముకున్నారు. కృషే ఫలి అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం 60 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. తాను ఇంత స్థాయికి ఎదగడం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందంటున్న కన్నమనాయుడు విజయగాథ ఆయన మాటల్లోనే... ‘నా తల్లిదండ్రులు అప్పలనాయుడు, సింహాచలం పొట్టచేత పట్టుకుని ఈ ఊరు బయలుదేరగా.. రెండేళ్ల వయసులో వారి చేతులు పట్టుకుని నేనూ బయలుదేరాను. ఆ వయసులో నాకు ఊహ తెలియదు గానీ.. ఎలాంటి ఇబ్బందులు పడ్డామో ఇట్టే ఊహకందుతుంది. ఊరుకాని ఊరు. ఏంచేయూలో తెలీదు. నడిసంద్రంలో చిక్కుకున్న నావ మాదిరిగా ఉంది అప్పట్లో మా కుటుంబ పరిస్థితి. అమ్మానాన్న నాలుగు మెతుకులు సంపాదించడానికి కష్టపడుతున్నారు. పలకా, బలపం పట్టుకుని నేను బళ్లోకి వెళ్లేవాడిని. ఆ సమయంలోనే మా చెల్లి పుట్టింది. కుటుంబ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది. అమ్మానాన్న రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా కుటుంబం గడిచేది కాదు. ఆ పరిస్థితుల్లో నేను తణుకు రోడ్డులో గల సూర్రావు హోటల్లో చాలాకాలం కప్పులు తీశాను. చాలీచాలని ఆదాయంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. 15 ఏళ్ల వయసులో లారీ ఆఫీస్‌లో గుమాస్తాగా చేరాను. తర్వాత లారీ క్లీనర్‌గా.. డ్రైవర్‌గా పనిచేశాను. చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో ఒక లారీ కొన్నాను. అప్ప ట్లో అక్వా పరిశ్రమ ఉచ్ఛస్థితిలో ఉంది. అదే నాకు కలిసి వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పేడ, కోళ్ల ఫారాల నుంచి పెంట కొనేవాడిని. వాటిని చేపల చెరువుల యజమానులకు అమ్మేవాడిని. ఇదే నా జీవితాన్ని మార్చింది. ఒక్కొక్కటిగా ఇప్పటివరకూ 25 లారీలు కొన్నాను. వీటితోపాటు మరో 35 లారీలను నేనే నిర్వహిస్తున్నాను. ఇప్పుడు నాతోపాటు మరో 60 కుటుంబాలకు ఉపాధి కల్పించగలుగుతున్నాను. నేను నివసిస్తున్న 15వ వార్డులో పరిచయూలు పెరగడంతో ముని సిపల్ ఎన్నికలలో పోటీ చేశాను. ప్రజలు దీవించారు. కౌన్సిలర్ అయ్యూను. కష్టం అంటే ఏమిటో నాకు తెలుసు. ఆకలి విలువ తెలిసిన వాడిని. భగవంతుడు కరుణించాడు. ఆక్వా పరిశ్రమ ఆదుకుంది. వీటన్నిటికీ మించి వెనుక నా తల్లిదండ్రుల ఆసరా, వారి దీవెనలు ఎంతో ఉన్నాయి. వారు నాకు ఇచ్చిన జన్మను సార్థకం చేసుకుంటాను’ అంటూ తన జీవిత గాథను వినమ్రంగా చెప్పుకొచ్చారు కన్నమనాయుడు. -
ఆక్వాకు ట్రాన్స్‌కో ‘షాక్’
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని చేపలు, రొయ్యల చెరువులపై ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 32 బృందాలు మూడు రోజులపాటు చెరువులకు సంబంధించి 3,793 సర్వీసులను తనిఖీలు చేశారుు. నిబంధనలకు విరుద్ధంగా 356 సర్వీసులను వినియోగిస్తున్న చెరువుల యజమానులపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ ఎస్ఈ ఎన్.గంగాధర్ శుక్రవారం భీమవరంలో విలేకరులకు వెల్లడించారు. ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, తాడేపల్లిగూడెం డివిజన్లలో 5,200 చేపలు, రొయ్యల చెరువులకు సంబంధించి విద్యుత్ సర్వీసులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఒక్క భీమవరం డివిజన్‌లోనే 4,280 సర్వీసులు ఉన్నాయన్నారు. విద్యుత్ చోరీ, అవకతవకలు, అదనపు లోడు వినియోగం, బ్యాక్ బిల్లింగ్‌లకు పాల్పడుతున్నారన్న సమాచారం అందడంతో ఈపీడీసీఎల్ సీఎండీ ఎంవీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి 13వరకు తనిఖీలు నిర్వహించనట్లు చెప్పారు. 3,593 సర్వీసులను తనిఖీ చేసి, 356 కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో 28 విద్యుత్ చోరీ, 31 అవకతవకలు, 218 అదనపు లోడు కింద కేసులు నమోదు చేశామన్నారు. రీడింగ్ సక్రమంగా తీయకపోవడాన్ని గుర్తించి 79 కేసులు పెట్టామని చెప్పారు. సంబంధిత వ్యక్తుల నుంచి రూ.32 లక్షలు వసూలు చేస్తామన్నారు. సమావేశంలో భీమవరం డీఈ పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.