కప్పులు తీశారు.. కౌన్సిలర్‌గా ఎదిగారు
కష్టాలను దాటిన కన్నమనాయుడు
తాడేపల్లిగూడెం : ఈయన పేరు చుక్కా కన్నమనాయుడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చుక్కపేటలో నిరుపేద కుటుంబానికి చెందిన అతని తల్లిదండ్రులు అప్పలనాయుడు, సింహా చలం పొట్టకూటి కోసం తాడేపల్లిగూడెం పట్టణానికి వలస వచ్చారు. కన్నమనాయుడు రెండేళ్ల ప్రాయంలో వారితోపాటే ఇక్కడకు చేరుకున్నారు. జిల్లాలు దాటివచ్చిన కన్నమ నాయుడు బతుకుదెరువు కోసం కష్టాన్ని నమ్ముకున్నారు. కృషే ఫలి అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం 60 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. తాను ఇంత స్థాయికి ఎదగడం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందంటున్న కన్నమనాయుడు విజయగాథ ఆయన మాటల్లోనే...
‘నా తల్లిదండ్రులు అప్పలనాయుడు, సింహాచలం పొట్టచేత పట్టుకుని ఈ ఊరు బయలుదేరగా.. రెండేళ్ల వయసులో వారి చేతులు పట్టుకుని నేనూ బయలుదేరాను. ఆ వయసులో నాకు ఊహ తెలియదు గానీ.. ఎలాంటి ఇబ్బందులు పడ్డామో ఇట్టే ఊహకందుతుంది. ఊరుకాని ఊరు. ఏంచేయూలో తెలీదు. నడిసంద్రంలో చిక్కుకున్న నావ మాదిరిగా ఉంది అప్పట్లో మా కుటుంబ పరిస్థితి. అమ్మానాన్న నాలుగు మెతుకులు సంపాదించడానికి కష్టపడుతున్నారు. పలకా, బలపం పట్టుకుని నేను బళ్లోకి వెళ్లేవాడిని. ఆ సమయంలోనే మా చెల్లి పుట్టింది.
కుటుంబ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది. అమ్మానాన్న రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా కుటుంబం గడిచేది కాదు. ఆ పరిస్థితుల్లో నేను తణుకు రోడ్డులో గల సూర్రావు హోటల్‌లో చాలాకాలం కప్పులు తీశాను. చాలీచాలని ఆదాయంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. 15 ఏళ్ల వయసులో లారీ ఆఫీస్‌లో గుమాస్తాగా చేరాను. తర్వాత లారీ క్లీనర్‌గా.. డ్రైవర్‌గా పనిచేశాను. చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో ఒక లారీ కొన్నాను.
అప్ప ట్లో అక్వా పరిశ్రమ ఉచ్ఛస్థితిలో ఉంది. అదే నాకు కలిసి వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పేడ, కోళ్ల ఫారాల నుంచి పెంట కొనేవాడిని. వాటిని చేపల చెరువుల యజమానులకు అమ్మేవాడిని. ఇదే నా జీవితాన్ని మార్చింది. ఒక్కొక్కటిగా ఇప్పటివరకూ 25 లారీలు కొన్నాను. వీటితోపాటు మరో 35 లారీలను నేనే నిర్వహిస్తున్నాను. ఇప్పుడు నాతోపాటు మరో 60 కుటుంబాలకు ఉపాధి కల్పించగలుగుతున్నాను. నేను నివసిస్తున్న 15వ వార్డులో పరిచయూలు పెరగడంతో ముని సిపల్ ఎన్నికలలో పోటీ చేశాను.
ప్రజలు దీవించారు. కౌన్సిలర్ అయ్యూను. కష్టం అంటే ఏమిటో నాకు తెలుసు. ఆకలి విలువ తెలిసిన వాడిని. భగవంతుడు కరుణించాడు. ఆక్వా పరిశ్రమ ఆదుకుంది. వీటన్నిటికీ మించి వెనుక నా తల్లిదండ్రుల ఆసరా, వారి దీవెనలు ఎంతో ఉన్నాయి. వారు నాకు ఇచ్చిన జన్మను సార్థకం చేసుకుంటాను’ అంటూ తన జీవిత గాథను వినమ్రంగా చెప్పుకొచ్చారు కన్నమనాయుడు.