సముద్ర తీర భూములు కబ్జా అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్వా పరిశ్రమలు అప్పనంగా కలుపుకుంటున్నాయి. రికార్డుల్లో సర్కార్ భూమిగా ఉంటుంది. స్వరూపం చూస్తే అక్కడ పెద్ద పెద్ద కంపెనీల భవనాలు కనిపిస్తుంటాయి. ఐదెకరాల ప్రైవేట్ భూమిని కొని దాని చుట్టు పక్కల పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రహరీలు నిర్మించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులను మామూళ్లతో లోబర్చుకుని అందిన కాడికి భూమిని కలుపుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట తీరం భూ కబ్జాలకు నిలయంగా మారింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని ఇందుకూరుపేట పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. మైపాడు తీరంలో బీచ్, రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడి తీరం అనువుగా ఉండడంతో ఆక్వా హేచరీలు సైతం సీడ్ ఉత్పత్తిని ప్రారంభించాయి. పదిహేనేళ్ల క్రితం నుంచి ఇక్కడ హేచరీలు ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయి. మైపాడు, కొరుటూరు ప్రాంతాల్లోనే హేచరీలు అధికంగా ఉన్నాయి. ఒక్క మైపాడు పరిసర ప్రాంతంలోనే సుమారు 30 వరకు హేచరీలు ఉన్నాయి. హేచరీలు అధికంగా రావడం, మైపాడు బీచ్ పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతానికి డిమాండ్ ఏర్పడింది.
♦హేచరీల ఏర్పాటు ముందు వరకు ఎకరా రూ.5 లక్షలు పలికిన భూమి ప్రస్తుతం రూ.50 లక్షలకు చేరింది.
♦జిల్లాలోని వివిధ రంగాల వ్యాపారులు, రాజకీయ పార్టీల నేతలు, కొందరు డాక్టర్లు అందరూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంతో బహిరంగ మార్కెట్ విలువ భారీగా పెరిగింది.
♦ఈ క్రమంలో రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూముల స్వాహా పర్వానికి మొదట్లోనే ఒకటి..రెండు హేచరీల నిర్వాహకులు తెర తీశారు.
♦అలా ప్రారంభమైన భూ ఆక్రమణ పర్వం నేటికి అప్రతిహతంగా కొనసాగుతోంది. 12 సర్వే నంబర్లలో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొందరు తమ ప్రైవేట్ భూముల్లో కలుపుకుని హేచరీలు నిర్మించారు.
♦తాజాగా ప్రభుత్వం జిల్లాలో పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అనువైన స్థలాలను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలించారు. దీంతో మైపాడు, కొరుటూరులో 150 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రైవేట్ భూమి మాటున..
ఇందుకూరుపేట మండలం మైపాడు, కొరుటూరు గ్రామాలు సముద్ర తీర ప్రాంతం కావడంతో ప్రభుత్వ భూమికి కొదవ లేదు. ఈ భూముల మధ్య మధ్యలో ప్రైవేట్ భూమి కూడా ఉంది. ఇదే హేచరీల నిర్వాహకులకు వరంగా మారుతోంది.
♦కొంత ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి దానికి రెట్టింపులో ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశారు.
♦ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నంబర్లకు ఆనుకుని అనేక ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి.
♦హేచరీల యాజమాన్యం ప్రైవేట్ భూములను అధికారికంగా కొనుగోలు చేసి వాటిలో ప్రభుత్వ భూములు కలుపుకుని ప్రహరీ నిర్మించడం సముద్రం వరకు పైపులైన్లు ఏర్పాటు చేసుకోవడం వంటివి చేస్తున్నారు.
♦ఒక్క కొరుటూరులోనే 10 సర్వే నంబర్లలో 70 ఎకరాలకు పైగా భూమి హేచరీల్లో కలిసి ఉంది.
♦కొందరు హేచరీ నిర్వాహకులు గతంలో అధికారులను లోబర్చుకుని రికార్డులను కూడా తారుమారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
♦గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన హేచరీలు కాల్వ పోరంబోకు, ప్రభుత్వ డొంక, శ్మశాన డొంక, చెరువు పోరంబోకు ఇలా ఏ ఒక్క దాన్ని వదలకుండా అందిన మేరకు కలుపుకున్నాయి.
♦దీనిపై గతంలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి విచారణతో సరి పెట్టారు.
♦కొరుటూరులో 544, 545, 546, 543, 547, 526, 527, 557, 559, 560 తదితర సర్వే నంబర్లలో 10 హేచరీ నిర్వాహకులు ప్రభుత్వ భూమిని కలుపుకుని దర్జాగా అనుభవిస్తున్నారు.
♦పది సర్వే నంబర్లలో ప్రధానమైన పది కంపెనీలు కలుపుకున్న 70 ఎకరాల భూమి విలువ సుమారు రూ.35 కోట్లు పైమాటే.
♦ఇక మండలం మొత్తంలోనూ ఇదే పరిస్థితి. మండలంలో సుమారు 400 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణలో ఉన్నట్లు నిర్ధారించారు. వీటి విలువ మొత్తం సుమారుగా రూ.200 కోట్లపై మాటేనని అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
♦ఆక్వా పరిశ్రమల భూ ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment