జాతీయ రహదారిపై విజిలెన్స్ తనిఖీలు
వెంకటాచలం : వెంకటాచలం సమీపంలో జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు బుధవారం తెల్లవారు జామున నుంచి ముమ్మరంగా తనిఖీలు చేశారు. వెంకటాచలం టోల్‌ప్లాజా నుంచి కృష్ణపట్నంపోర్టు రోడ్డు వరకు రెండు బృందాలుగా ఏర్పడి రాకపోకలు కొనసాగించే వాహనాలను తనిఖీ చేశారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించామన్నారు.14వాహనాలు అధిక లోడుతో వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. వాటిలో 9 బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, రెండు గ్రానైట్, రెండు పార్శిల్, ఒక కంకర లోడు లారీ ఉన్నట్లు చెప్పారు. వీటిపై కేసులు నమోదు చేసి ట్యాక్స్, అధిక లోడుతో వెళ్లినందుకు పన్ను వసూలు చేస్తామని తెలియజేశారు. ఆయన వెంట సీఐలు శ్రీనివాసరావు, ఉప్పల సత్యనారాయణ, బీటీ నాయక్, డీసీటీఓ రవికుమార్, ఎఫ్‌ఆర్‌ఓ ఉమామహేశ్వరరెడ్డి, ఏజీ రాము తదితరులు ఉన్నారు.