దాల్ మిల్లర్ల టెండ‘రింగ్’
♦ రూ.123కు టెండర్ దాఖలు చేసిన వైనం
♦ ఆమోదించిన పౌరసరఫరాల శాఖ
♦ సీఎంవో, ఓ ఎంపీ ఒత్తిడే కారణం!
♦ ‘సాక్షి’ చెప్పిందే నిజమైంది!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కందులకు మద్దతుధర లేక రైతులు అల్లాడుతున్నారు. క్వింటాలుకు రూ.7 వేలు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ రోడ్డెక్కుతున్నారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు కూడా తగ్గాయి. సాధారణ కందిపప్పు కిలో రూ.వంద పలుకుతోంది. హైక్వాలిటీ పప్పు సైతం రూ.115 మించడం లేదు. కానీ రేషన్ దుకాణాలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేసే కందిపప్పు ధరను మాత్రం దాల్‌మిల్లర్లు అమాంతం పెంచేశారు. కిలో కందిపప్పు రూ.123.50 చొప్పున సరఫరా చేస్తామంటూ టెండర్ దాఖలు చేశారు.
గురువారం సాయంత్రం టెండర్లను తెరిచిన పౌర సరఫరాల శాఖ అధికారులు షరా మామూలుగానే అతి తక్కువధరను (రూ.123.50) పేర్కొన్న టెండర్‌ను ఆమోదించారు. రేషన్ దుకాణాలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేసే కందిపప్పు సరఫరా అంశంపై దాల్‌మిల్లర్లు కుమ్మక్కయ్యారని ‘కందిపప్పుకు టెండరింగ్’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 21న కథనం ప్రచురించింది. ఈ అంశంపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నా దాల్‌మిల్లర్లంతా ఖమ్మంలోని ఓ ప్రేవేటు హోట ల్‌లో సమావేశమై రూ.115 నుంచి 120 వరకు టెండర్ దాఖలు చేయాలని నిర్ణయించిన అంశాన్ని గత మంగళవారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.
ముఖ్యమంత్రి కార్యాలయ పేషీలో పనిచేస్తున్న ఓ వ్యక్తితోపాటు, దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఎంపీ, పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి సహకారంతో మిల్లర్లు టెండర్ దాఖలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టేందుకు ప్లాన్ వేశారు. ఇందుకు అనుకూలంగానే పౌరసరఫరాల శాఖ అధికారులు సైతం సదరు టెండర్‌ను ఆమోదించడం గమనార్హం. ఈసారి వేసిన టెండర్లలో కూడా పాత కాంట్రాక్టర్లే పాల్గొన్నారు. మొత్తం 10 మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేయగా, అందులో 9 మంది పాతవారేనని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతినెలా 5 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరమవుతోంది. లబ్ధిదారునికి కిలో రూ.50 చొప్పున ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. వీటికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. అయితే గత ఏడాది నవంబర్‌లో తుది విడత టెండర్లు ముగిశాక మళ్లీ కొత్త వాటిని పిలవలేదు. అప్పటి నుంచి ప్రభుత్వమే కందిపప్పు సేకరించి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం కంది ధరలు దిగిరావడంతో ఈ నెల 19న కేవలం మార్చి నెల నిమిత్తం కందిపప్పు సరఫరా చేసేందుకు టెండర్లను పిలిచింది.