సాక్షి ప్రతినిధి, విజయనగరం: రైతులు, వినియోగదారులు, ప్రభుత్వానికి చెందిన ఆస్తులు కానీ..మరే ఇతర ఉత్పత్తులు కానీ అడ్డగోలుగా తరలుతున్నా లేదా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి వాటిని సీజ్ చేయాల్సి ఉంటుంది. అధికారులు దృష్టి సారించలేకపోయిన ప్రాంతాల్లో విజిలెన్స్ నిఘా ఉంటుంది.అయితే జిల్లాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు బయటపడుతున్నప్పటికీ విజిలెన్స్ మొద్దు నిద్ర పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.
ప్రతి రోజూ దళారులతో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వ్యాపారులు ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. జిల్లాలో పౌరసరఫరాల శాఖ ద్వారా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ జిల్లా వ్యాప్తంగా మిల్లర్ల మధ్య ఉన్న విభేదాల కారణంగా ధాన్యం కొనుగోళ్లు ఇటీవల కాలం వరకూ ఊపందుకోలేదు. దీంతో పీపీసీ కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి.
అవే సమయంలో ఇతర జిల్లాల నుంచి కొనుగోలు దారులు వచ్చి ధాన్యాన్ని తరలించుకుపోతున్నారు. వాస్తవానికి రైతుకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.1410లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కేవలం రూ.వెయ్యి నుంచి రూ.1200 మాత్రమే చెల్లించి రైతులను మోసం చేస్తూ దీంతో దళారులు, ఇతర జిల్లాల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రైతు మాత్రం ఒక క్వింటా వద్ద రూ.150 నుంచి రూ.200 వరకూ మోసపోతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఈ విధమైన కొనుగోళ్ల వల్ల రైతుల కష్టం దళారుల పాలవుతోంది. దీనిపై కనీసం అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో రైతులు అష్టకష్టాలూ పడుతున్నారు.
ముఖ్యంగా ప్రమాణాలు పాటించని కొనుగోళ్ల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు 82 కిలోల ధాన్యం కొనుగోలు చేసి బస్తాల్లో నింపుతున్నారు. రైతులకు వెంటనే చెల్లింపులు చేయడంతో వీరికే ధాన్యం విక్రయించేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఇక్కడి ధాన్యం ఇతర జిల్లాలకు వెళ్లిపోతోంది. జిల్లానుంచి ప్రతి రోజూ కనీసం 500 లారీలు రాజమండ్రి, అమలాపురం, తదితర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. దీని వల్ల జిల్లాలోని రైతులు కనీస మద్దతు ధర పొందకపోవడంతో పాటు జిల్లాలోని ఇతర రంగాలైన కార్మిక, వర్తక, వినియోగ దారులు కూడా పరోక్షంగా మోసపోతు న్నారు.
ఇంత జరుగుతున్నప్పటికీ విజిలెన్స్ శాఖ ఏం చేస్తోందోనని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విధమైన తరలింపు కలెక్టర్ కార్యా లయం ముందు నుంచి జరుగుతున్నా అధికారులు చొరవ తీసుకోవట్లేదనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క మిల్లర్లు మాత్రం బ్యాంకు గ్యారంటీలను చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. నేరుగా జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తూ అధికారుల డొల్ల తనాన్ని ఎద్దేవా చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ధాన్యం ఇతర జిల్లాలకు తరలడంతో పాటు కనీస మద్దతు ధర కల్పించక పోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్ ఐటీడీఏ పీఓగా కూడా అదనపు బాధ్యతలు చూస్తుండడంతో ధాన్యం కొనుగోళ్లు, ఇతర జిల్లాలకు తరలింపుపై సరైన దృష్టి సారించలేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే విజిలెన్స్ అధికారులు మాత్రం గత నెలన్నర రోజులుగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వంటివాటిపై దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
నిద్దరోతున్న నిఘా
Published Thu, Jan 7 2016 12:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement