ఎరువుల అంగళ్లపై దాడులు
రైల్వేకోడూరు రూరల్/పులివెందుల రూరల్: ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల అంగళ్లపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రైతుల నుంచి వ స్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వారు దాడులు ముమ్మరం చేశారు. ఇందులో భాగం గా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గల ఎరువుల అంగళ్లపై శనివారం దడులు నిర్వహించారు. అక్రమ నిల్వలను సీజ్ చేశారు. రైల్వేకోడూరులోని ఎరువుల షాపుల కడప విజిలెన్స్ అధికారుల బృందం శనివారం మెరుపు దాడులు నిర్వహించింది. సుమారు రూ.20 లక్ష ల విలువచేసే అక్రమ ఎరువుల నిల్వ ను సీజ్‌చేశారు. విజిలెన్స్ అధికారి ఆర్.శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో విశ్వేశ్వర ఏజన్సీస్‌పై దాడులు నిర్వహించారు.
రికార్డులు పరిశీలించారు. అయితే అమ్మినా ఎరువులకు సంబంధించిన రికార్డులు నమోదు చేయలేదని గుర్తించారు. ఆంధ్ర ఆగ్రో ఏజన్సీస్‌లో నీమ్‌కోటెడ్ యూరియా ఎమ్మార్పీ ధర రూ.298 కాగా, రైతులకు రూ.320కు అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో షాపులోని రూ.20 లక్షలు విలువ చేసే ఎరువులను సీజ్ చేశారు. వెంకట సత్యనారాయణ ఏజన్సీస్‌ను కూడా తనిఖీ చేశారు.
వాటి వివరాలు తరువాత వెల్లడిస్తామన్నారు. కడప విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.నరసింహారెడ్డి, స్థానిక ఏఓ మల్లిక, టెక్నికల్ ఏఓ సుధాకర్ పాల్గొన్నారు. పులివెందులలోని ఎరువుల అంగళ్లపైనా విజిలెన్స్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ఉదయం నుంచి రాత్రి వరకు దాడులు కొనసాగాయి. రెండు షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 562 బస్తాల ఎరువులను సీజ్ చేశారు. వాటి విలువ సుమారు రూ.4.70 లక్షలవుతుందని ప్రాథమిక అంచనా.
అన్నీ వ్యత్యాసాలే
పులివెందులలోని వె ంకటేశ్వర ఫర్టిలైజర్స్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన 525 బస్తాల ఎరువులను సీజ్ చేశారు. వాటి విలువ రూ.4.46 లక్షలు అవుతుందని అధికారులు తెలిపారు. సప్తగిరి ఫర్టిలైజర్స్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 37 బస్తాల ఎరువులను సీజ్ చేశారు. వాటి విలువ సుమారు రూ.23,700 ఉంటుందని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ పుల్లయ్య తెలిపారు.
చెన్నకేశవ షాపునూ తనిఖీ చేశామన్నారు. ఎరువులకు సంబంధించిన స్టాకు వివరాలను పుస్తకంలో కచ్చితంగా రాయాలని ఆయన పేర్కొన్నారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని, నోటీసు బోర్డులో స్టాకుతో పాటు ఎమ్మార్పీ ధరను పొందుపరచాలన్నారు. లేకపోతే డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో స్థానిక ఏఓ సునీల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.