నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని పదేపదే గుప్పించిన ప్రకటనలు ఆచరణలో చూపలేకపోయారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర కల్పిస్తామన్న గత ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది.
జిల్లాలో గత నెల 4వ తేదీన ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 27 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 580 మంది రైతులకు రూ.11.34 కోట్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. చాలామంది రైతులకు మద్దతుధర అందలేదు. ధాన్యాన్ని రైసు మిల్లులకు రవాణా చేసి నెల కావస్తున్నా ఇప్పటి వరకు తమ ఖాతాలో నగదు జమ చేయలేదని రైతులు వాపోతున్నారు. జిల్లా పౌర సరఫరాల కార్యాలయానికి వెళితే సమాధానం చెప్పేవారేలేరని రైతులు మండిపడుతున్నారు.
ధాన్యం సేకరణ ఇలా...
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, డీఎం సివిల్ సప్లయీస్ సంయుక్తంగా ధాన్యం సేకరణ చేపట్టింది. కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ సిబ్బంది ద్వారా ధాన్యాన్ని సేకరించారు. రైతుల ధాన్యాన్ని సంబంధిత రైసుమిల్లులకు పంపుతారు. అక్కడ వారు రసీదు ఇస్తారు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్ దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి సంబంధిత రైతుకు మద్దతు ధర క ల్పించేందుకు డీఎం సివిల్ సప్లయీస్‌కు పంపిస్తారు. దీనిని పరిశీలించిన డీఎం రైతుకు 2,3 రోజుల్లో నేరుగా వారి ఖాతాలో మద్దతు ధరకు సంబంధించిన మొత్తాన్ని జమ చేయాలి. కానీ నెలలు గడుస్తున్నా అందాల్సిన మొత్తం అందలేదు.
రైతులకు అందని ‘మద్దతు’
Published Tue, May 27 2014 3:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement