సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, జిన్నింగ్ మిల్లులతో ఒప్పందం వంటి అంశాల్లో సీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తక్షణమే అన్ని కేంద్రాలను ప్రారంభించి పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 18 శాతం వరకు తేమ కలిగిన పత్తిని సైతం కొనుగోలు చేయాలని కోరారు. కనీస మద్దతు ధరను సైతం రూ.5 వేలకు పెంచాలన్నారు. ఈ అంశంపై మౌఖిక ఆదేశాలు కాకుండా రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బి.వినోద్‌కుమార్‌లతో కలిసి మాట్లాడారు.
కరీంనగర్ జిల్లాలో 11 కేంద్రాలకు రెండు మూడు కేంద్రాల్లోనే పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ఆయా కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన పత్తిని సైతం కొంతే సీసీఐ కొనుగోలు చేస్తుందన్నారు. మిగిలిన పత్తినంతా రూ.3,300 నుంచి రూ.3,500 ధరకు ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో రైతులు కాస్త ఓపిక పట్టాలే తప్ప బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. తెలంగాణలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న తరుణంలో కేంద్రం ముందుకొచ్చి సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించాల్సిన అవసరం ఉందన్నారు.
లేనిపక్షంలో రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పందించకపోతే ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్నలను పూర్తిగా ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించాలని నిర్ణయించామన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నలను, ఐకేపీ కేంద్రాలతోపాటు అవసరమైతే పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.
పత్తి కొనుగోలులో సీసీఐ నిర్లక్ష్యం: ఈటల
Published Sun, Oct 18 2015 1:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement