మిల్లర్ల వద్ద ‘గన్ని’ సంచులా?
- రూ. 203 కోట్ల విలువైన సంచులు వారి వద్దే..
- 2009 నుంచి 2014 దాకా లెక్క తేలని వైనం
- అక్రమాలకు అధికారుల సహకారం
- పౌరసరఫరాల శాఖ కమిషనర్ చొరవతో వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల శాఖలో కొందరు అధికారుల సహకారంతో ఇన్నాళ్లూ ఆడింది ఆట, పాడింది పాటగా చెలాయించుకున్న రైస్ మిల్లర్ల వ్యవహారాలు.. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ప్రభుత్వానికి అప్పగించకుండా బయట వ్యాపారం చేసుకున్న తీరుకు ఇటీవలే అడ్డుకట్ట పడగా.. తాజాగా మిల్లర్ల మరికొన్ని లీలలు బయట పడ్డాయి. రూ.203.80 కోట్ల విలువైన గన్నీ సంచులు మిల్లర్ల వద్దే ఉండిపోయినట్లు గుర్తించారు. రైతులు పండించే వరి పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) దక్కేలా ప్రభుత్వమే గత కొన్నేళ్లుగా ధాన్యం సేకరిస్తోంది. ఐకేపీ మహిళా సంఘాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, రైసు మిల్లుల వద్ద కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అటు మహిళా సంఘాలకు, ఇటు మిల్లర్లకు పౌరసరఫరా సంస్థ గన్నీ సంచులు సరఫరా చేస్తోంది. అయితే, అసలు తతంగమంతా గన్నీ సంచులను అప్పజెప్పడంలోనే చోటు చేసుకుంటోందని సమాచారం.
కొత్త సంచులను మిల్లర్లకు ఇస్తుండగా, ఒకసారి వాడిన పాత సంచులను మాత్రం ఐకేపీ కేంద్రాలకు ఇచ్చేవారని తెలిసింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో కనీసం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. ఆ మేరకు అవసరమైన గన్నీ సంచుల గురించి లెక్క తీయగా మిల్లర్ల బాగోతం బయటపడిందని తెలిసింది. పౌరసరఫరాల శాఖ బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో లెక్కతేలకుండా పోయిన గన్నీ సంచుల సంగతి బయట పడిందని తెలిసింది. ప్రతీ సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం కోట్ల రూపాయలు వెచ్చించి గన్నీ సంచులు కొనడం ఆనవాయితీ. కానీ, గత సీజన్‌లో ఎన్ని సంచులు కొన్నారు..? మిల్లర్లకు, ఐకేపీ కేంద్రాలకు సరఫరా చేసిన సంచులు తిరిగి సంస్థకు చేరాయా..? లేదా అన్న విషయాల్లో కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించిన తీరు విస్తుగొల్పుతోంది. 2009 నుంచి 2014 దాకా మిల్లర్ల నుంచి రావాల్సిన గన్నీ సంచుల లెక్కలు తేల్చడంపై కసరత్తు చేశారు.
కరీంనగర్‌లో అధికంగా అక్రమాలు
మిల్లర్ల వద్ద రూ. 203.80 కోట్ల విలువైన గన్నీ సంచులు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఒక కొత్త గన్నీ సంచి రూ.50, ఒకసారి ఉపయోగించిన గన్నీ సంచికి రూ.30 గా ధర నిర్ణయించారు. ఈ లెక్కన హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో కొత్తవి, పాతవి కలిపి సుమారు 5.45 కోట్ల గన్నీ బ్యాగులు మిల్లర్ల వద్దే ఉండిపోయాయని అధికారులు లెక్క తేల్చారు. మిల్లర్లు వీటిని పౌరసరఫరాల సంస్థకు అప్పజెప్పకుండా సొంతానికి వాడుకున్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. ఈ సారి ధాన్యం సేకరణ సందర్భంగా వీటినే కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆదిలాబాద్ జిల్లాలో రూ.8.51 కోట్లు, నిజామాబాద్ - రూ.14.20 కోట్లు, మెదక్ - రూ.17.27కోట్లు, కరీంనగర్ - రూ.115.99 కోట్లు, వరంగల్ - రూ.19.60 కోట్లు, ఖమ్మం - రూ.5.21 కోట్లు, నల్లగొండ - రూ.18.98 కోట్లు, మహబూబ్‌నగర్ - రూ.2.76 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ..128 కోట్ల విలువైన గన్నీ సంచులు మిల్లర్ల దగ్గర ఉండిపోయాయి. అత్యధికంగా రూ.115.99 కోట్ల విలువైన దాదాపు మూడు కోట్ల గన్నీ బ్యాగులు మిల్లర్ల వద్ద ఉండిపోయిన కరీంనగర్ జిల్లా నుంచే అటు ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుతం కూడా పౌరసరఫరా శాఖ మంత్రులు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.