రూ. కోటి హాంఫట్ ! | Rs. 1 Crore Funds Misuse | Sakshi
Sakshi News home page

రూ. కోటి హాంఫట్ !

Published Mon, May 4 2015 4:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

రూ.  కోటి హాంఫట్ !

రూ. కోటి హాంఫట్ !

సాక్షి, గుంటూరు : వైద్య ఆరోగ్య శాఖలో పీఆర్సీ ఎరియర్స్‌ను కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం అప్పణంగా ఇచ్చి రూ. కోటి వరకు నిధులు దుర్వినియోగం చేసినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. 2008లో జరిగిన ఈ పంపిణీపై విజిలెన్స్ అధికారులు ఇప్పటికీ విచారణ నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ ఏడాది పర్మనెంట్ ఉద్యోగులతోపాటు  కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ఎరియర్స్ అందడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్టు గుర్తించారు. దీనిపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలంటూ అప్పట్లో ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది.

అనేక మందిని విచారించిన విజిలెన్స్ అధికారులు 40 పీహెచ్‌సీల పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ. 60వేల చొప్పున అందించినట్లు గుర్తించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగుల ఆదేశాల మేరకే ఆయా పీహెచ్‌సీల్లోని వైద్యులు సంతకాలు చేసి మరీ కాంట్రాక్టు ఉద్యోగులకు ఎరియర్స్ అందించారు. దీంట్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది.

అయితే ఈ  ఎరియర్స్‌ను కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించేందుకు కొందరు సబ్ ట్రెజరీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసి ఆపివేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా అనేక మందికి డబ్బు ఇవ్వకుండా నిలిపివేస్తే 15 సబ్ ట్రెజరీ కార్యాలయాల అధికారులు మాత్రం వారికి  ఎరియర్స్ అందించారు. దీనిపై విచారణ పూర్తి చేసిన విజిలెన్స్ అధికారులు 2011లో ప్రభుత్వానికి నివేదిక పంపారు. నివేదికలో బాధ్యులను గుర్తించి చర్యలకు సిఫార్సు చేయకపోవడంతో నాలుగు నెలల క్రితం ప్రభుత్వం తిరిగి విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
 
విజిలెన్స్ ఎస్పీ కార్యాలయానికి  రావాలని ఆదేశాలు
  ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి విచారణ ప్రారంభించిన విజిలెన్స్ అధికారులు అనేక మంది వైద్యులు, సీనియర్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయంలోని ఉద్యోగులను విచారించి బాధ్యులను గుర్తించారు. దీంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఎరియర్స్ ఏ నిబంధనల ప్రకారం చెల్లించారో తమకు తెలియజేయాలంటూ సబ్ ట్రెజరీ ఉద్యోగులను అడిగిన విజిలెన్స్ అధికారులు, దీనికి సంబంధించిన రికార్డులతో సోమవారం విజిలెన్స్ ఎస్పీ కార్యాలయానికి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వారిని విచారించిన అనంతరం అసలు బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తూ విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement