PRC arrears
-
11వ పీఆర్సీ ఏర్పాటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సిఫార్సుల సమర్పణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిశీలించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో చర్చించి ఏడాదిలోగా వేతన సవరణపై సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించాలని పీఆర్సీని ఆదేశించినట్లు పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కమిషన్ చైర్మన్ ఎవరో అందులో పేర్కొనక పోవడం గమనార్హం. వేతన సవరణ కమిషన్‌కు చైర్మన్ నియామకమే కీలకం. అయితే చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై ప్రభుత్వం సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే ముందుగా మార్గదర్శకాలతో కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి, తర్వాత చైర్మన్‌గా ఎవరిని నియమించాలో నిర్ణయించుకోవాలని సర్కారు భావించినట్టు సమాచారం. కొత్త వేతన సవరణ సిఫారసుల కోసం తక్షణమే 11వ పీఆర్సీని ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (అమరావతి జేఏసీ) సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పదో పీఆర్సీ కింద ఇవ్వాల్సిన రూ.4,600 కోట్ల బకాయిలను ఇప్పటికీ ఇవ్వకుండా నాన్చుతూ, ఇప్పుడు చైర్మన్ పేరు లేకుండా 11వ పీఆర్సీ వేయడం కంటితుడుపు చర్యేనని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఎవరెవరికి వర్తిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది, వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు కమిషన్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలు, యూనివర్సిటీల బోధనా సిబ్బంది వ్యవహారాలు దీని పరిధిలోకి రావు. ఇవీ మార్గదర్శకాలు - ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, జీతభత్యాలు తదితర అంశాలను కమిషన్ పరిశీలించాలి. - ఎంతమేరకు కరువు భత్యం (డీఏ) వేతన స్కేలులో కలిపేయాలి? కొత్త (సవరించిన) వేతన స్కేలు ఎలా ఉండాలో సిఫారసు చేయాలి. - ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ పథకాన్ని ఎప్పటికప్పుడు మార్చడానికి ఏమి చేయాలి? దీనిని ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలా? అనే అంశాలను అధ్యయనం చేయాలి. - ప్రస్తుత పెన్షన్ విధానాన్ని సమీక్షించి ఆచరణయోగ్యమైన సూచనలివ్వాలి. - తాత్కాలిక అవసరాల కోసం నియమించిన కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సహా అన్ని విభాగాల్లో ఉన్న మానవ వనరులను పరిశీలించి ప్రస్తుత పరిస్థితుల్లో (రాష్ట్ర విభజన నేపథ్యంలో) అవసరాలను నివేదికలో పేర్కొనాలి. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కోరే ఇతర అంశాలను కూడా నివేదికలో వివరించాలి. - ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి వినతులు స్వీకరించవచ్చు. సమాచారం, ఆధారాలు సేకరించడానికి కమిషన్ సొంత మార్గాలు అనుసరించవచ్చు. అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు కమిషన్ కోరిన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సి ఉంటుంది. - కమిషన్ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి పనిచేయాల్సి ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి రాష్ట్రంలోనూ, రాష్ట్రం వెలుపల ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేయవచ్చు. - పీఆర్సీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాదిలోగా తన సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలి ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలని అమరావతి జేఏసీ డిమాండ్ చేసింది. ‘11 పీఆర్సీ వేసినందుకు ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ధన్యవాదాలు. వెంటనే కమిషన్‌కు చైర్మన్‌ను నియమించడంతోపాటు ఉద్యోగులకు నష్టం జరగని విధంగా ఈ ఏడాది జూలై నుంచే 11వ పీఆర్సీ సిఫార్సులను వర్తింప జేయాలి. పదో పీఆర్సీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి’ అని జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి పేర్రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఖజానాకు పూడ్చలేని ‘లోటు’!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదంతో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఉద్యోగులకు బకాయి పడ్డ పీఆర్సీ డబ్బులు వారికి చెల్లించేసి ఉంటే కేంద్రం నుంచి రెవెన్యూ లోటు ద్వారా పొందే వీలున్నా ఆ అవకాశాన్ని వదులుకుంది. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై మరో రూ. 5 వేల కోట్లకుపైగా భారం పడింది. ఉద్యోగులకు బకాయిలు చెల్లించి ఉంటే... రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు కావస్తున్నా రెవెన్యూ లోటు భర్తీ విషయంలో చిక్కులు వీడటం లేదు. పాత పథకాల ద్వారా ఏర్పడిన రెవెన్యూ లోటును మాత్రమే భర్తీ చేస్తామని, కొత్త పథకాల వల్ల తలెత్తిన లోటును భర్తీ చేయలేమని కేంద్ర ఆర్థికశాఖతో పాటు నీతి ఆయోగ్ కూడా స్పష్టం చేయటం తెలిసిందే. ఉద్యోగుల పీఆర్సీ పాత పథకం కిందకే వస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.5,325 కోట్ల పీఆర్సీ బకాయిలను అందచేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటుగా పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు భర్తీ చేసేదని అధికార యంత్రాంగం చెబుతోంది. వ్యయం చేయకుండా లోటు అంటే ఎలా? ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలను రెవెన్యూ లోటుగా పరిగణించాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్ర ఆర్థికశాఖ తిరస్కరించింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో పది నెలల వ్యవధి రెవెన్యూ లోటునే మాత్రమే భర్తీ చేయనున్నట్లు చెప్పామని, పీఆర్సీ బకాయిలు చెల్లించనందున రెవెన్యూ లోటుగా ఎలా భర్తీ చేస్తామని కేంద్రం ప్రశ్నించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వ్యయం చేస్తేనే దాన్ని రెవెన్యూ లోటుగా పరిగణిస్తారని, అలా కాకుండా బకాయిల కింద చూపిస్తూ రెవెన్యూ లోటుగా పరిగణించటం కుదరదని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు చెల్లించేసి ఉంటే రాష్ట్రానికి రూ.5,325 కోట్ల మేరకు రెవెన్యూ లోటు భర్తీ రూపంలో ప్రయోజనం చేకూరేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇక ఇచ్చేది రూ. 138.39 కోట్లే రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రపతి పాలన సమయంలో రెవెన్యూ లోటును గవర్నర్ రూ.16,078.76 కోట్లుగా లెక్క కట్టారు. అయితే పది నెలల కాలంలో ఏర్పడిన రెవెన్యూ లోటునే పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో రెవెన్యూ లోటు రూ.15,691 కోట్లుగా పేర్కొన్నారు. అనంతరం అకౌంటెంట్ జనరల్ కార్యాలయం రెవెన్యూ లోటు రూ.13,775.76 కోట్లు అని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,979.50 కోట్లు ఇచ్చింది. రుణమాఫీ, పింఛన్లు, డిస్కమ్స్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన వ్యయాన్ని రెవెన్యూ లోటుగా పరిగణించబోమని తెలిపింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో పది నెలల సమయానికి రూ.4,117.89 కోట్ల మేర మాత్రమే రెవెన్యూ లోటు ఏర్పడిందని కేంద్ర ఆర్థికశాఖ తేల్చింది. ఇందులో ఇప్పటికే రూ.3979.50 కోట్లు విడుదల చేసినందున ఇక లోటు భర్తీ కింద కేవలం రూ. 138.39 కోట్లు మాత్రమే వస్తాయని, వీటిని త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లేఖ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు. -
నగదు రూపంలో పీఆర్సీ బకాయిలు
► ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిల ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సంతకం చేశారు. దీంతో రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాదాపు 3.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందినట్లయింది. నగదు రూపంలోనే బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రెండు విడతల్లో ఈ చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా 50 శాతం నగదు.. ఉద్యోగులకు అందేలా చూడాలని సూచించారు. దీంతో నేడో రేపో బకాయిల చెల్లింపులకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ జారీ చేయనుంది. రెండేళ్లుగా పెండింగ్‌లో.. పదో పీఆర్సీ సిఫారసుల ప్రకారం రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్తో ప్రభుత్వ వేతన సవరణ చేసింది. 2014 జూన్ నుంచి వేతన సవరణ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించి, 2015 మార్చి నుంచి నగదు రూపంలో చెల్లింపులు చేసింది. అప్పటి వరకు ఉన్న 9 నెలల వ్యవధిలోని వేతన సవరణ వ్యత్యాసాన్ని బకాయిలుగా పరిగణించి, తదుపరి చెల్లిస్తామని ప్రకటించింది. ఈ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ముందుగా భావించింది. ఆర్థికంగా ఖజానాపై భారం పడకుండా బాండ్లు జారీ చేయాలని కూడా ఒక దశలో యోచించింది. ఈలోగా పీఆర్సీ బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో రెండేళ్లపాటు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం చివరకు నగదు రూపంలో చెల్లించేందుకు మొగ్గు చూపింది. బకాయిలు చెల్లించేందుకు దాదాపు రూ.2,800 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ ఇప్పటికే లెక్కతేల్చింది. అంత మొత్తం ఒకేసారి చెల్లించటం ఆర్థికంగా భారమవుతుందని, అందుకే రెండు విడతల్లో నగదు చెల్లించాలని ఆర్థిక శాఖ పంపిన ప్రతిపాదనలకు సీఎం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. -
పీఆర్సీ బకాయిలు వచ్చునా.. రాకపోవునా?
-
దేవ రహస్యం!
- పీఆర్సీ బకాయిలు వచ్చునా.. రాకపోవునా? - పెండింగ్‌లోనే రెండు విడతల డీఏ.. మోక్షం లేని గ్రాట్యుటీ బకాయిలు - ఉద్యోగులు, పెన్షన్‌దారుల బకాయిలకే రూ.5 వేల కోట్లు - నిర్వహణ పద్దులో సర్దుబాటు చేసినట్టా.. లేనట్టా? - అయిదు లక్షల మందికిపైగా ఉద్యోగుల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్ రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలను పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఈ సంవత్సరం అయినా చెల్లిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మారిన బడ్జెట్ తయారీ మార్గదర్శకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈసారి నిర్వహణ పద్దు దాదాపు రూ.10 వేల కోట్లు పెరిగింది. కానీ వివిధ శాఖల పరిధిలో ఉద్యోగులకు పెంచిన జీతాలు, కొత్తగా చేపట్టిన ఉద్యోగ నియామకాలకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ నిధులు వెచ్చించాల్సి ఉంది. వీటితో పాటు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఏటేటా పెరగటం తప్ప తగ్గే ప్రసక్తి లేదు. గత ఏడాది రూ.60,900 కోట్ల ప్రణాళికేతర వ్యయాన్ని చూపించిన ప్రభుత్వం 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.61,607 కోట్ల నిర్వహణ పద్దును అంచనా వేసింది. గతంతో పోలిస్తే రూ.700 కోట్ల మేర మాత్రమే ఈ పద్దు పెరిగింది. కానీ గతంలో ప్రణాళికేతర పద్దులో ఉన్న రుణమాఫీ, బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీకి చెల్లించే నిధులు ఈసారి ప్రగతి పద్దుకు బదిలీ అయ్యాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, విదేశీయానాలు, కార్యాలయ, వాహనాలు ఇతరత్రా ఖర్చులకు వచ్చే ఏడాది రూ.50,954 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రస్తావించింది. మిగతావన్నీ అప్పుల కిస్తులు, వడ్డీలు, రుణాలకు, పెట్టుబడి వ్యయాలకు సంబంధించిన నిధులు నిర్వహణ పద్దులో ఉన్నాయి. నిరుటితో పోలిస్తే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల పద్దు ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెండింగ్‌లో పెట్టిన పీఆర్సీ బకాయిలు, డీఏ చెల్లింపులు, గ్రాట్యుటీ బకాయిలకు దాదాపు రూ.5 వేల కోట్లు కావాలి. రాష్ట్రంలో ఉన్న 3.50 లక్షల మంది ఉద్యోగులు, 2.20 లక్షల మంది పెన్షన్‌దారులు ఈ బకాయిలు ఎప్పుడొస్తాయా.. అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం అందుకు సరిపడే నిధులను సర్దుబాటు చేసిందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. నిధులు విడుదలయ్యేనా? ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిలకు రూ. 2,800 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. 2014 జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేసిన ప్రభుత్వం 2015 మార్చి నుంచి నగదు చెల్లింపులు చేసింది. అప్పటివరకున్న తొమ్మిది నెలల వేతన సవరణ వ్యత్యాస బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను రెండు లేదా నాలుగు విడతలుగా చెల్లించే ప్రతిపాదనలపై రెండు నెలల కిందట ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈలోగా ఆర్థిక సంవత్సరం ముగిసి పోనుండటంతో కొత్త బడ్జెట్లో పీఆర్సీ బకాయిలకు నిధులు విడుదలవుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. రెండు డీఏలు పెండింగ్ గతేడాది జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) పెంపు నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండుసార్లు కరువు భత్యం పెంచాల్సి ఉంటుంది. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ఈ పెంపు అమల్లోకి రావాలి. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన తర్వాత అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపి.. ఎంత మేరకు డీఏ పెరిగిందో ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. 2016 జనవరిలో పెరిగిన డీఏను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత 2016 జూలైలో 3.66 శాతం, 2017 జనవరిలో మరో 3.66 శాతం డీఏ పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతోపాటు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. డీఏ పెంపుతో ప్రభుత్వంపై దాదాపు రూ. 2 వేల కోట్ల భారం పడనుంది. గ్రాట్యుటీ బకాయిలు.. రూ.191 కోట్లు పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ బకాయిలకు సైతం ఇప్పటికీ మోక్షం లేదు. దాదాపు రూ.191 కోట్ల బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. పీఆర్సీ సిఫారసుల ప్రకారం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 నెలల వ్యవధిలో రిటైరైన ఉద్యోగులు సైతం పెరిగిన గ్రాట్యుటీని పొందేందుకు అర్హులయ్యారు. 2015 ఫిబ్రవరి తర్వాత రిటైరైన ఉద్యోగులందరికీ పెరిగిన గ్రాట్యుటీ మొత్తాన్ని చెల్లించిన ఆర్థిక శాఖ.. అంతకుముందు తొమ్మిది నెలల్లో రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన వ్యత్యాస బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. -
బ్యాంకు ఉద్యోగులకు దీపావళి కానుక
రూ.3 కోట్ల పీఆర్సీ నిధులు విడుదల డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి నెల్లూరు రూరల్ : జిల్లా కేంద్ర సహకార ఉద్యోగులకు దీపావళి కానుకగా దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్న రూ.3 కోట్ల పీఆర్సీ నిధులను విడుదల చేసినట్లు డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి తెలిపారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్లోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ గురువారం పీఆర్సీ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 179 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. బ్యాంకు అభివృద్ధి కోసం ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆయన వెంట డీసీసీబీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్రెడ్డి, డైరెక్టర్ బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్, సీఈఓ రాజారెడ్డి, బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు ప్రసాద్, దయాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
జీపీఎఫ్ ఖాతాల్లో పీఆర్సీ బకాయిలు
హైదరాబాద్: పీఆర్సీ బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది నెలలుగా ఈ బకాయిల ఊసెత్తకుండా పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఈ ఫైలును సిద్ధం చేయాలని తాజాగా ఆర్థిక శాఖను పురమాయించింది. దీంతో బకాయిల చెల్లింపులపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారా..? జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారా..? అనే తర్జన భర్జనలతో ఏడాదికి పైగా ప్రభుత్వం ఈ చెల్లింపులను ఆపేసింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా బకాయిలను బాండ్ల రూపంలో చెల్లించాలనే ప్రత్యామ్నాయాన్ని సైతం పరిశీలించింది. అదే సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గత ఏడాది మార్చి నుంచి పీఆర్సీ వేతన సవరణను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు తొమ్మిది నెలలకు సంబంధించిన బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. వీటిని ఒకేసారి చెల్లించాలంటే దాదాపు రూ.2800 కోట్లు అవుతుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. వీటిలో జీపీఎఫ్ ఖాతాలున్న ఉద్యోగులకు రూ.1300 కోట్లు జమ చేయాల్సి ఉంటుంది. జీపీఎఫ్ ఖాతాల్లేని కొత్త ఉద్యోగులు, పెన్షన్‌దారులు, పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ బకాయిలకు రూ.1500 కోట్లు కావాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అంచనా వేసింది. బకాయిల చెల్లింపులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలిసిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దీంతో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ముందుగా జీపీఎఫ్ ఖాతాలున్న వారికి బకాయిలు జమ చేసి.. తర్వాత పెన్షన్‌దారులు, సీపీఎస్ ఖాతాలున్న కొత్త ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాలనే ప్రతిపాదన సైతం ఈ సందర్భంగా అధికారుల పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. కానీ కొందరికి చెల్లించి.. కొందరికి ఆపేయడం సరైంది కాదని, ఆలస్యమైనప్పటికీ అందరికీ బకాయిలను ఒకేసారి చెల్లింపులు చేయాలనే తుది నిర్ణయానికి వచ్చారు. మరోవైపు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వచ్చే అంశం కావటంతో ఫైలును పంపించిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి తుది నిర్ణయం వచ్చేంత వరకు తొందరపడవద్దని నిర్ణయించుకున్నారు. -
ట్రెజరీ హంట్!
- పీఆర్సీ బిల్లుల పేరిట దోపిడీ - అసంతృప్తిలో ఉపాధ్యాయులు - ఖజానా అధికారుల చేతివాటం - దాదాపు రూ.60 లక్షలు గిట్టుబాటు ఏలూరు సిటీ : ఉపాధ్యాయులకు పేరివిజన్ కమిషన్ (పీఆర్సీ) కష్టాలు వచ్చాయి. ఎట్టకేల కు పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేయటంతో ఆనందంగా బిల్లులు చేసుకుంటున్న ఉపాధ్యాయులకు వాటి మంజూరులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచి ట్రెజరీ వరకూ సొమ్ములు చెల్లించాల్సి రావటం గురువులను అసంతృప్తికి గురిచేస్తోంది. ట్రెజరీ అధికారులు చెప్పినట్టు సొమ్ములు ముట్టజెబితే గానీ బిల్లులు మంజూరు కాని పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయ సంఘాల నాయకుల పరిస్థితి ఫరవాలేకున్నా సాధారణ ఉపాధ్యాయులకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. ఖజానా అధికారులు, సిబ్బంది చెప్పిన మేరకు సొమ్ములు ఇవ్వకుంటే కొర్రీలు వేస్తూ తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఈ విధంగా చూస్తే ఉపాధ్యాయుల నుంచి ఏకంగా ఖజానా అధికారుల జేబుల్లోకి రూ.60 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విసుగెత్తిన ఉపాధ్యాయులు ఇటీవలే పెనుగొండలో ఖజానా అధికారిని ఏసీబీకి సైతం పట్టించారు. అయినా తీరు మారలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొమ్ములు ఇవ్వాల్సిందే పీఆర్సీ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఉపాధ్యాయుల బిల్లుల మంజూరుకు ఒక్కో ఉపాధ్యాయుడు రూ.500ల నుంచి రూ.వెయ్యి వరకూ సమర్పించుకోవాల్సి వస్తోంది. జిల్లాలో సుమారు 15 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందులో మూడువేల మంది చెల్లించకపోయినా 12వేల మంది ఉపాధ్యాయులు ఒక్కొక్కరూ రూ.500ల చొప్పున ఇస్తే రూ.60లక్షలు అవుతుందని అంచనా. ఇంత పెద్దమొత్తంలో ఖజానా అధికారులు, సిబ్బంది ఉపాధ్యాయుల నుంచి సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఉపాధ్యాయులను బెదిరిస్తున్నట్టు చెబుతున్నారు. ‘ఫిర్యాదులు చేస్తే జాగ్రత్త.. ప్రతి నెలా మాతో పనులు ఉంటాయి, ఎక్కడో ఒకచోట కొర్రీ వేసి బిల్లులు మంజూరు కాకుండా ఆపేస్తామ’ని ట్రెజరీ అధికారులు అంటున్నారని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్కూళ్లలోనూ ఇదే తీరు పీఆర్సీ బిల్లులు చేసేందుకు ట్రెజరీ అధికారులే కాదు ఆయా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు సైతం టీచర్ల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని కొన్ని మండల ప్రాంతాల్లో ఉపాధ్యాయుల నుంచి హెచ్ఎంలు డబ్బులు వసూలు చేస్తున్నట్టు టీచర్లు చెబుతున్నారు. ఇదేమిటని అడిగితే బిల్లులు త్వరగా మంజూరు చేయించాలంటే సొమ్ములు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. కొన్ని పాఠశాలల్లో అయితే రూ.వెయ్యి వరకూ తీసుకుంటున్నారని అంటున్నారు. దీంతో కొంతమంది ఉపాధ్యాయులు ట్రెజరీ కంటే స్కూళ్లలో దారుణంగా ఉందని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని, అలాచేస్తే తమను వేధిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొమ్ములు తీసుకోవటం వాస్తవమే ఉపాధ్యాయుల నుంచి ఖజానా అధికారులు సొమ్ములు డిమాండ్ చేయటం వాస్తవమేనని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సాబ్జీ, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డీవీఏవీ ప్రసాదరాజు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కొందరు అధికారులు భారీగా సొమ్ములు డిమాండ్ చేస్తున్నారని అటువంటివి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరుతున్నారు. -
రూ. కోటి హాంఫట్ !
సాక్షి, గుంటూరు : వైద్య ఆరోగ్య శాఖలో పీఆర్సీ ఎరియర్స్‌ను కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం అప్పణంగా ఇచ్చి రూ. కోటి వరకు నిధులు దుర్వినియోగం చేసినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. 2008లో జరిగిన ఈ పంపిణీపై విజిలెన్స్ అధికారులు ఇప్పటికీ విచారణ నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ ఏడాది పర్మనెంట్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ఎరియర్స్ అందడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్టు గుర్తించారు. దీనిపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలంటూ అప్పట్లో ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. అనేక మందిని విచారించిన విజిలెన్స్ అధికారులు 40 పీహెచ్‌సీల పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ. 60వేల చొప్పున అందించినట్లు గుర్తించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగుల ఆదేశాల మేరకే ఆయా పీహెచ్‌సీల్లోని వైద్యులు సంతకాలు చేసి మరీ కాంట్రాక్టు ఉద్యోగులకు ఎరియర్స్ అందించారు. దీంట్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. అయితే ఈ ఎరియర్స్‌ను కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించేందుకు కొందరు సబ్ ట్రెజరీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసి ఆపివేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా అనేక మందికి డబ్బు ఇవ్వకుండా నిలిపివేస్తే 15 సబ్ ట్రెజరీ కార్యాలయాల అధికారులు మాత్రం వారికి ఎరియర్స్ అందించారు. దీనిపై విచారణ పూర్తి చేసిన విజిలెన్స్ అధికారులు 2011లో ప్రభుత్వానికి నివేదిక పంపారు. నివేదికలో బాధ్యులను గుర్తించి చర్యలకు సిఫార్సు చేయకపోవడంతో నాలుగు నెలల క్రితం ప్రభుత్వం తిరిగి విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ ఎస్పీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి విచారణ ప్రారంభించిన విజిలెన్స్ అధికారులు అనేక మంది వైద్యులు, సీనియర్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయంలోని ఉద్యోగులను విచారించి బాధ్యులను గుర్తించారు. దీంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఎరియర్స్ ఏ నిబంధనల ప్రకారం చెల్లించారో తమకు తెలియజేయాలంటూ సబ్ ట్రెజరీ ఉద్యోగులను అడిగిన విజిలెన్స్ అధికారులు, దీనికి సంబంధించిన రికార్డులతో సోమవారం విజిలెన్స్ ఎస్పీ కార్యాలయానికి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వారిని విచారించిన అనంతరం అసలు బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తూ విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.