హైదరాబాద్: పీఆర్‌సీ బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది నెలలుగా ఈ బకాయిల ఊసెత్తకుండా పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఈ ఫైలును సిద్ధం చేయాలని తాజాగా ఆర్థిక శాఖను పురమాయించింది. దీంతో బకాయిల చెల్లింపులపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారా..? జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారా..? అనే తర్జన భర్జనలతో ఏడాదికి పైగా ప్రభుత్వం ఈ చెల్లింపులను ఆపేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా బకాయిలను బాండ్ల రూపంలో చెల్లించాలనే ప్రత్యామ్నాయాన్ని సైతం పరిశీలించింది. అదే సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
గత ఏడాది మార్చి నుంచి పీఆర్‌సీ వేతన సవరణను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు తొమ్మిది నెలలకు సంబంధించిన బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. వీటిని ఒకేసారి చెల్లించాలంటే దాదాపు రూ.2800 కోట్లు అవుతుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. వీటిలో జీపీఎఫ్ ఖాతాలున్న ఉద్యోగులకు రూ.1300 కోట్లు జమ చేయాల్సి ఉంటుంది. జీపీఎఫ్ ఖాతాల్లేని కొత్త ఉద్యోగులు, పెన్షన్‌దారులు, పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ బకాయిలకు రూ.1500 కోట్లు కావాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అంచనా వేసింది. బకాయిల చెల్లింపులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలిసిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
దీంతో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ముందుగా జీపీఎఫ్ ఖాతాలున్న వారికి బకాయిలు జమ చేసి.. తర్వాత పెన్షన్‌దారులు, సీపీఎస్ ఖాతాలున్న కొత్త ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాలనే ప్రతిపాదన సైతం ఈ సందర్భంగా అధికారుల పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. కానీ కొందరికి చెల్లించి.. కొందరికి ఆపేయడం సరైంది కాదని, ఆలస్యమైనప్పటికీ అందరికీ బకాయిలను ఒకేసారి చెల్లింపులు చేయాలనే తుది నిర్ణయానికి వచ్చారు. మరోవైపు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వచ్చే అంశం కావటంతో ఫైలును పంపించిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి తుది నిర్ణయం వచ్చేంత వరకు తొందరపడవద్దని నిర్ణయించుకున్నారు.