General Provident Fund
-
15 రోజుల్లోనే క్లియర్
- జీపీఎఫ్ ఉపసంహరణకు గడువు నిర్ధారణ - నిబంధనలు సవరించిన కేంద్రం న్యూఢిల్లీ: సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సాధారణ భవిష్యనిధి(జీపీఎఫ్) ఉపసంహరణ నిబంధనలను సడలిస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై జీపీఎఫ్ చందాదారులు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే చెల్లింపులు చేస్తారు. అంతేకాకుండా... పదేళ్ల సర్వీసు తరువాత ప్రత్యేక అవసరాల కోసం జీపీఎఫ్‌ను ఉపసంహరించుకోవడానికి వీలుకల్పించారు. ఇంతకు ముందు ఈ గడువు 15 ఏళ్లుగా ఉంది. ఇకపై కోర్సులు, విద్యా సంస్థలతో సంబంధం లేకుండా ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్య ఇలా దేనికైనా జీపీఎఫ్‌ను వాడుకోవచ్చు. ఇంతకు ముందు కేవలం హైస్కూల్ స్థాయి ఆపై విద్యకే జీపీఎఫ్ నుంచి నగదు ఉపసంహరణకు అనుమతిచ్చేవారు. నిబంధనల్లో చేసిన మార్పుల ప్రకారం... నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియలు లాంటి కార్యక్రమాలు, తాను లేదా కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైనపుడు చందాదారుడు నగదు ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. టీవీ, వాషింగ్ మెషీన్, కుకర్, కంప్యూటర్ లాంటి వినియోగదారుల వస్తువులతో పాటు కారు, బైకు లాంటి వాహనాల కొనుగోలుకు, ఇప్పటికే తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపునకు కూడా జీపీఎఫ్ నుంచి నగదు తీసుకోవచ్చు. అనారోగ్యం లాంటి అత్యవసర పరిస్థితుల సమయంలో ఉపసంహరణ గడువును ఏడురోజులకు తగ్గించే అవకాశం ఉంది. చందాదారుడి 12 నెలల వేతనం లేదా అతని ఖాతాలో ఉన్న సొమ్ములో నాలుగింట మూడో వంతు ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తం ఉపసంహరణకు అనుమతిస్తారు. ఇకపై చందాదారులు స్వీయ ధృవీకరణ పత్రం మినహా మరెలాంటి ఆధార పత్రాలను సమర్పించనక్కర్లేదు. ఏడాదిలో పదవీ విరమణ పొందే వారికి ఇప్పటి వరకు ఎలాంటి కారణం అడగకుండానే 90 శాతం నగదును తీసుకునే అవకాశం ఉంది. దీన్ని ఇకపై రెండేళ్ల పదవీ కాలం ఉన్న వారికీ వర్తింపచేయనున్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల కొనుగోలుకు, గృహ రుణాల చెల్లింపునకు కూడా జీపీఎఫ్ సొమ్మును వినియోగించుకోవచ్చు. జీపీఎఫ్ నగదుతో ఇల్లు కొన్న తరువాత ఆ మొత్తాన్ని తిరిగి జమచేయాలన్న నిబంధనను తొలగించారు. హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్(హెచ్‌బీఏ) పరిమితులతో జీపీఎఫ్ ఉపసంహరణలను ఇకపై ముడిపెట్టరు. -
జీపీఎఫ్ ఖాతాల్లో పీఆర్సీ బకాయిలు
హైదరాబాద్: పీఆర్సీ బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది నెలలుగా ఈ బకాయిల ఊసెత్తకుండా పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఈ ఫైలును సిద్ధం చేయాలని తాజాగా ఆర్థిక శాఖను పురమాయించింది. దీంతో బకాయిల చెల్లింపులపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారా..? జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారా..? అనే తర్జన భర్జనలతో ఏడాదికి పైగా ప్రభుత్వం ఈ చెల్లింపులను ఆపేసింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా బకాయిలను బాండ్ల రూపంలో చెల్లించాలనే ప్రత్యామ్నాయాన్ని సైతం పరిశీలించింది. అదే సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గత ఏడాది మార్చి నుంచి పీఆర్సీ వేతన సవరణను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు తొమ్మిది నెలలకు సంబంధించిన బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. వీటిని ఒకేసారి చెల్లించాలంటే దాదాపు రూ.2800 కోట్లు అవుతుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. వీటిలో జీపీఎఫ్ ఖాతాలున్న ఉద్యోగులకు రూ.1300 కోట్లు జమ చేయాల్సి ఉంటుంది. జీపీఎఫ్ ఖాతాల్లేని కొత్త ఉద్యోగులు, పెన్షన్‌దారులు, పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ బకాయిలకు రూ.1500 కోట్లు కావాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అంచనా వేసింది. బకాయిల చెల్లింపులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలిసిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దీంతో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ముందుగా జీపీఎఫ్ ఖాతాలున్న వారికి బకాయిలు జమ చేసి.. తర్వాత పెన్షన్‌దారులు, సీపీఎస్ ఖాతాలున్న కొత్త ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాలనే ప్రతిపాదన సైతం ఈ సందర్భంగా అధికారుల పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. కానీ కొందరికి చెల్లించి.. కొందరికి ఆపేయడం సరైంది కాదని, ఆలస్యమైనప్పటికీ అందరికీ బకాయిలను ఒకేసారి చెల్లింపులు చేయాలనే తుది నిర్ణయానికి వచ్చారు. మరోవైపు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వచ్చే అంశం కావటంతో ఫైలును పంపించిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి తుది నిర్ణయం వచ్చేంత వరకు తొందరపడవద్దని నిర్ణయించుకున్నారు.