15 రోజుల్లోనే క్లియర్
- జీపీఎఫ్ ఉపసంహరణకు గడువు నిర్ధారణ
- నిబంధనలు సవరించిన కేంద్రం
న్యూఢిల్లీ: సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సాధారణ భవిష్యనిధి(జీపీఎఫ్) ఉపసంహరణ నిబంధనలను సడలిస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై జీపీఎఫ్ చందాదారులు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే చెల్లింపులు చేస్తారు. అంతేకాకుండా... పదేళ్ల సర్వీసు తరువాత ప్రత్యేక అవసరాల కోసం జీపీఎఫ్‌ను ఉపసంహరించుకోవడానికి వీలుకల్పించారు. ఇంతకు ముందు ఈ గడువు 15 ఏళ్లుగా ఉంది. ఇకపై కోర్సులు, విద్యా సంస్థలతో సంబంధం లేకుండా ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్య ఇలా దేనికైనా జీపీఎఫ్‌ను వాడుకోవచ్చు. ఇంతకు ముందు కేవలం హైస్కూల్ స్థాయి ఆపై విద్యకే జీపీఎఫ్ నుంచి నగదు ఉపసంహరణకు అనుమతిచ్చేవారు.
నిబంధనల్లో చేసిన మార్పుల ప్రకారం... నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియలు లాంటి కార్యక్రమాలు, తాను లేదా కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైనపుడు చందాదారుడు నగదు ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. టీవీ, వాషింగ్ మెషీన్, కుకర్, కంప్యూటర్ లాంటి వినియోగదారుల వస్తువులతో పాటు కారు, బైకు లాంటి వాహనాల కొనుగోలుకు, ఇప్పటికే తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపునకు కూడా జీపీఎఫ్ నుంచి నగదు తీసుకోవచ్చు. అనారోగ్యం లాంటి అత్యవసర పరిస్థితుల సమయంలో ఉపసంహరణ గడువును ఏడురోజులకు తగ్గించే అవకాశం ఉంది. చందాదారుడి 12 నెలల వేతనం లేదా అతని ఖాతాలో ఉన్న సొమ్ములో నాలుగింట మూడో వంతు ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తం ఉపసంహరణకు అనుమతిస్తారు.
ఇకపై చందాదారులు స్వీయ ధృవీకరణ పత్రం మినహా మరెలాంటి ఆధార పత్రాలను సమర్పించనక్కర్లేదు. ఏడాదిలో పదవీ విరమణ పొందే వారికి ఇప్పటి వరకు ఎలాంటి కారణం అడగకుండానే 90 శాతం నగదును తీసుకునే అవకాశం ఉంది. దీన్ని ఇకపై రెండేళ్ల పదవీ కాలం ఉన్న వారికీ వర్తింపచేయనున్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల కొనుగోలుకు, గృహ రుణాల చెల్లింపునకు కూడా జీపీఎఫ్ సొమ్మును వినియోగించుకోవచ్చు. జీపీఎఫ్ నగదుతో ఇల్లు కొన్న తరువాత ఆ మొత్తాన్ని తిరిగి జమచేయాలన్న నిబంధనను తొలగించారు. హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్(హెచ్‌బీఏ) పరిమితులతో జీపీఎఫ్ ఉపసంహరణలను ఇకపై ముడిపెట్టరు.