సాక్షి, ఢిల్లీ: విపక్షాల తీవ్ర అభ్యంతరాల నడుమ.. కేంద్రం ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ నడుమే బిల్లుకు ఆమోదం లభించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు.. కేంద్ర మంత్రిని తీసుకొచ్చింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి బదులు కేబినెట్ మంత్రిని చేరుస్తూ బిల్లు రూపకల్పన చేసింది కేంద్రం. ఆ మంత్రి పేరును కూడా ప్రధానినే నామినేట్ చేస్తారు. తద్వారా 1991 చట్టాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. అయితే ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు.. ‘‘ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐ కలిసి ఈ నియామకాలు చేపట్టాలని’’ తీర్పునిచ్చింది. అయినప్పటికీ కేంద్రం ముందుకే వెళ్లింది.
అయితే, తాజాగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ బిల్లును ప్రవేశపెట్టి.. విపక్షాల అభ్యంతరాలు బదులు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇక మీదటా స్వతంత్రంగానే పని చేస్తుందని అన్నారాయన. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లు అత్యున్నత న్యాయస్థానం తీర్పు దిశకు అనుగుణంగా ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికార విభజనకు తగ్గట్లు ఉంది’’ అని తెలిపారు.
రాజ్యసభ ఆమోదం పొందిన సీఈసీ బిల్లు ప్రకారం.. ఈసీ, ఈసీ సభ్యుల నియామకాల కోసం ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య సంఘం ఏర్పాటవుతుంది. దీనిలో లోక్‌సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ ప్రతిపాదిత కమిటీపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
వాస్తవానికి ఈ బిల్లును ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీనే రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. అప్పుడు దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని భావించినా.. అది సాధ్యపడలేదు. తాజాగా సవరణలతో కూడిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టడం.. చర్చ జరగడం.. విపక్షాల అభ్యంతరాల నడుమే ఆమోదం పొందడం జరిగాయి.
#Centre proposes amendments in #CEC and #ECs Bill, brings CEC and ECs on par with SC Judges, also ‘Search Committee’ will comprise of Law Minister and two Secretaries of #Union Govt. pic.twitter.com/ieag9LVDtF
— Suneel Veer (@sunilveer08) December 12, 2023
Comments
Please login to add a commentAdd a comment