దేవ రహస్యం!
- పీఆర్‌సీ బకాయిలు వచ్చునా.. రాకపోవునా?
- పెండింగ్‌లోనే రెండు విడతల డీఏ.. మోక్షం లేని గ్రాట్యుటీ బకాయిలు
- ఉద్యోగులు, పెన్షన్‌దారుల బకాయిలకే రూ.5 వేల కోట్లు
- నిర్వహణ పద్దులో సర్దుబాటు చేసినట్టా.. లేనట్టా?
- అయిదు లక్షల మందికిపైగా ఉద్యోగుల ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్
రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలను పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఈ సంవత్సరం అయినా చెల్లిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మారిన బడ్జెట్ తయారీ మార్గదర్శకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈసారి నిర్వహణ పద్దు దాదాపు రూ.10 వేల కోట్లు పెరిగింది. కానీ వివిధ శాఖల పరిధిలో ఉద్యోగులకు పెంచిన జీతాలు, కొత్తగా చేపట్టిన ఉద్యోగ నియామకాలకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ నిధులు వెచ్చించాల్సి ఉంది. వీటితో పాటు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఏటేటా పెరగటం తప్ప తగ్గే ప్రసక్తి లేదు. గత ఏడాది రూ.60,900 కోట్ల ప్రణాళికేతర వ్యయాన్ని చూపించిన ప్రభుత్వం 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.61,607 కోట్ల నిర్వహణ పద్దును అంచనా వేసింది.
గతంతో పోలిస్తే రూ.700 కోట్ల మేర మాత్రమే ఈ పద్దు పెరిగింది. కానీ గతంలో ప్రణాళికేతర పద్దులో ఉన్న రుణమాఫీ, బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీకి చెల్లించే నిధులు ఈసారి ప్రగతి పద్దుకు బదిలీ అయ్యాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, విదేశీయానాలు, కార్యాలయ, వాహనాలు ఇతరత్రా ఖర్చులకు వచ్చే ఏడాది రూ.50,954 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించింది. మిగతావన్నీ అప్పుల కిస్తులు, వడ్డీలు, రుణాలకు, పెట్టుబడి వ్యయాలకు సంబంధించిన నిధులు నిర్వహణ పద్దులో ఉన్నాయి. నిరుటితో పోలిస్తే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల పద్దు ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెండింగ్‌లో పెట్టిన పీఆర్‌సీ బకాయిలు, డీఏ చెల్లింపులు, గ్రాట్యుటీ బకాయిలకు దాదాపు రూ.5 వేల కోట్లు కావాలి. రాష్ట్రంలో ఉన్న 3.50 లక్షల మంది ఉద్యోగులు, 2.20 లక్షల మంది పెన్షన్‌దారులు ఈ బకాయిలు ఎప్పుడొస్తాయా.. అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం అందుకు సరిపడే నిధులను సర్దుబాటు చేసిందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది.
నిధులు విడుదలయ్యేనా?
ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన తొమ్మిది నెలల పీఆర్‌సీ బకాయిలకు రూ. 2,800 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. 2014 జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేసిన ప్రభుత్వం 2015 మార్చి నుంచి నగదు చెల్లింపులు చేసింది. అప్పటివరకున్న తొమ్మిది నెలల వేతన సవరణ వ్యత్యాస బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను రెండు లేదా నాలుగు విడతలుగా చెల్లించే ప్రతిపాదనలపై రెండు నెలల కిందట ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈలోగా ఆర్థిక సంవత్సరం ముగిసి పోనుండటంతో కొత్త బడ్జెట్‌లో పీఆర్‌సీ బకాయిలకు నిధులు విడుదలవుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.
రెండు డీఏలు పెండింగ్
గతేడాది జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) పెంపు నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండుసార్లు కరువు భత్యం పెంచాల్సి ఉంటుంది. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ఈ పెంపు అమల్లోకి రావాలి. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన తర్వాత అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపి.. ఎంత మేరకు డీఏ పెరిగిందో ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. 2016 జనవరిలో పెరిగిన డీఏను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత 2016 జూలైలో 3.66 శాతం, 2017 జనవరిలో మరో 3.66 శాతం డీఏ పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతోపాటు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. డీఏ పెంపుతో ప్రభుత్వంపై దాదాపు రూ. 2 వేల కోట్ల భారం పడనుంది.
గ్రాట్యుటీ బకాయిలు.. రూ.191 కోట్లు
పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ బకాయిలకు సైతం ఇప్పటికీ మోక్షం లేదు. దాదాపు రూ.191 కోట్ల బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. పీఆర్సీ సిఫారసుల ప్రకారం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 నెలల వ్యవధిలో రిటైరైన ఉద్యోగులు సైతం పెరిగిన గ్రాట్యుటీని పొందేందుకు అర్హులయ్యారు. 2015 ఫిబ్రవరి తర్వాత రిటైరైన ఉద్యోగులందరికీ పెరిగిన గ్రాట్యుటీ మొత్తాన్ని చెల్లించిన ఆర్థిక శాఖ.. అంతకుముందు తొమ్మిది నెలల్లో రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన వ్యత్యాస బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు.