సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సిఫార్సుల సమర్పణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిశీలించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో చర్చించి ఏడాదిలోగా వేతన సవరణపై సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించాలని పీఆర్సీని ఆదేశించినట్లు పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కమిషన్ చైర్మన్ ఎవరో అందులో పేర్కొనక పోవడం గమనార్హం.
వేతన సవరణ కమిషన్‌కు చైర్మన్ నియామకమే కీలకం. అయితే చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై ప్రభుత్వం సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే ముందుగా మార్గదర్శకాలతో కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి, తర్వాత చైర్మన్‌గా ఎవరిని నియమించాలో నిర్ణయించుకోవాలని సర్కారు భావించినట్టు సమాచారం. కొత్త వేతన సవరణ సిఫారసుల కోసం తక్షణమే 11వ పీఆర్సీని ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (అమరావతి జేఏసీ) సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పదో పీఆర్సీ కింద ఇవ్వాల్సిన రూ.4,600 కోట్ల బకాయిలను ఇప్పటికీ ఇవ్వకుండా నాన్చుతూ, ఇప్పుడు చైర్మన్ పేరు లేకుండా 11వ పీఆర్సీ వేయడం కంటితుడుపు చర్యేనని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
ఎవరెవరికి వర్తిస్తుంది?
రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది, వర్క్ ఛార్జ్‌డ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు కమిషన్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలు, యూనివర్సిటీల బోధనా సిబ్బంది వ్యవహారాలు దీని పరిధిలోకి రావు.
ఇవీ మార్గదర్శకాలు
- ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, జీతభత్యాలు తదితర అంశాలను కమిషన్ పరిశీలించాలి.
- ఎంతమేరకు కరువు భత్యం (డీఏ) వేతన స్కేలులో కలిపేయాలి? కొత్త (సవరించిన) వేతన స్కేలు ఎలా ఉండాలో సిఫారసు చేయాలి.
- ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ పథకాన్ని ఎప్పటికప్పుడు మార్చడానికి ఏమి చేయాలి? దీనిని ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలా? అనే అంశాలను అధ్యయనం చేయాలి.
- ప్రస్తుత పెన్షన్ విధానాన్ని సమీక్షించి ఆచరణయోగ్యమైన సూచనలివ్వాలి.
- తాత్కాలిక అవసరాల కోసం నియమించిన కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు సహా అన్ని విభాగాల్లో ఉన్న మానవ వనరులను పరిశీలించి ప్రస్తుత పరిస్థితుల్లో (రాష్ట్ర విభజన నేపథ్యంలో) అవసరాలను నివేదికలో పేర్కొనాలి. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కోరే ఇతర అంశాలను కూడా నివేదికలో వివరించాలి.
- ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి వినతులు స్వీకరించవచ్చు. సమాచారం, ఆధారాలు సేకరించడానికి కమిషన్ సొంత మార్గాలు అనుసరించవచ్చు. అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు కమిషన్ కోరిన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సి ఉంటుంది.
- కమిషన్ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి పనిచేయాల్సి ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి రాష్ట్రంలోనూ, రాష్ట్రం వెలుపల ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేయవచ్చు.
- పీఆర్సీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాదిలోగా తన సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలి
ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలని అమరావతి జేఏసీ డిమాండ్ చేసింది. ‘11 పీఆర్సీ వేసినందుకు ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ధన్యవాదాలు. వెంటనే కమిషన్‌కు చైర్మన్‌ను నియమించడంతోపాటు ఉద్యోగులకు నష్టం జరగని విధంగా ఈ ఏడాది జూలై నుంచే 11వ పీఆర్సీ సిఫార్సులను వర్తింప జేయాలి. పదో పీఆర్సీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి’ అని జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి పేర్రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment