నగదు రూపంలో పీఆర్సీ బకాయిలు
► ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిల ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సంతకం చేశారు. దీంతో రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాదాపు 3.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందినట్లయింది. నగదు రూపంలోనే బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
రెండు విడతల్లో ఈ చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా 50 శాతం నగదు.. ఉద్యోగులకు అందేలా చూడాలని సూచించారు. దీంతో నేడో రేపో బకాయిల చెల్లింపులకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ జారీ చేయనుంది.
రెండేళ్లుగా పెండింగ్‌లో..
పదో పీఆర్సీ సిఫారసుల ప్రకారం రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రభుత్వ వేతన సవరణ చేసింది. 2014 జూన్ నుంచి వేతన సవరణ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించి, 2015 మార్చి నుంచి నగదు రూపంలో చెల్లింపులు చేసింది. అప్పటి వరకు ఉన్న 9 నెలల వ్యవధిలోని వేతన సవరణ వ్యత్యాసాన్ని బకాయిలుగా పరిగణించి, తదుపరి చెల్లిస్తామని ప్రకటించింది. ఈ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ముందుగా భావించింది. ఆర్థికంగా ఖజానాపై భారం పడకుండా బాండ్లు జారీ చేయాలని కూడా ఒక దశలో యోచించింది.
ఈలోగా పీఆర్సీ బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో రెండేళ్లపాటు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం చివరకు నగదు రూపంలో చెల్లించేందుకు మొగ్గు చూపింది. బకాయిలు చెల్లించేందుకు దాదాపు రూ.2,800 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ ఇప్పటికే లెక్కతేల్చింది. అంత మొత్తం ఒకేసారి చెల్లించటం ఆర్థికంగా భారమవుతుందని, అందుకే రెండు విడతల్లో నగదు చెల్లించాలని ఆర్థిక శాఖ పంపిన ప్రతిపాదనలకు సీఎం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.