ట్రెజరీ హంట్! | PRC exploitation in the name of Bills | Sakshi
Sakshi News home page

ట్రెజరీ హంట్!

Published Fri, Jul 31 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

ట్రెజరీ హంట్!

ట్రెజరీ హంట్!

- పీఆర్‌సీ బిల్లుల పేరిట దోపిడీ
- అసంతృప్తిలో ఉపాధ్యాయులు
- ఖజానా అధికారుల చేతివాటం
- దాదాపు రూ.60 లక్షలు గిట్టుబాటు
ఏలూరు సిటీ :
ఉపాధ్యాయులకు పేరివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) కష్టాలు వచ్చాయి. ఎట్టకేల కు పీఆర్‌సీ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేయటంతో ఆనందంగా బిల్లులు చేసుకుంటున్న ఉపాధ్యాయులకు వాటి మంజూరులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచి ట్రెజరీ వరకూ సొమ్ములు చెల్లించాల్సి రావటం గురువులను అసంతృప్తికి గురిచేస్తోంది. ట్రెజరీ అధికారులు చెప్పినట్టు సొమ్ములు ముట్టజెబితే గానీ బిల్లులు మంజూరు కాని పరిస్థితి ఏర్పడింది.

ఉపాధ్యాయ సంఘాల నాయకుల పరిస్థితి ఫరవాలేకున్నా సాధారణ ఉపాధ్యాయులకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. ఖజానా అధికారులు, సిబ్బంది చెప్పిన మేరకు సొమ్ములు ఇవ్వకుంటే కొర్రీలు వేస్తూ తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఈ విధంగా చూస్తే ఉపాధ్యాయుల నుంచి ఏకంగా ఖజానా అధికారుల జేబుల్లోకి రూ.60 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విసుగెత్తిన ఉపాధ్యాయులు ఇటీవలే పెనుగొండలో ఖజానా అధికారిని ఏసీబీకి సైతం పట్టించారు. అయినా తీరు మారలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
సొమ్ములు ఇవ్వాల్సిందే
పీఆర్‌సీ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఉపాధ్యాయుల బిల్లుల మంజూరుకు ఒక్కో ఉపాధ్యాయుడు రూ.500ల నుంచి రూ.వెయ్యి వరకూ సమర్పించుకోవాల్సి వస్తోంది. జిల్లాలో సుమారు 15 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందులో మూడువేల మంది చెల్లించకపోయినా 12వేల మంది ఉపాధ్యాయులు ఒక్కొక్కరూ రూ.500ల చొప్పున ఇస్తే రూ.60లక్షలు అవుతుందని అంచనా. ఇంత పెద్దమొత్తంలో ఖజానా అధికారులు, సిబ్బంది ఉపాధ్యాయుల నుంచి సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఉపాధ్యాయులను బెదిరిస్తున్నట్టు చెబుతున్నారు. ‘ఫిర్యాదులు చేస్తే జాగ్రత్త.. ప్రతి నెలా మాతో పనులు ఉంటాయి, ఎక్కడో ఒకచోట కొర్రీ వేసి బిల్లులు మంజూరు కాకుండా ఆపేస్తామ’ని ట్రెజరీ అధికారులు అంటున్నారని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
 
స్కూళ్లలోనూ ఇదే తీరు
పీఆర్‌సీ బిల్లులు చేసేందుకు ట్రెజరీ అధికారులే కాదు ఆయా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు సైతం టీచర్ల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని కొన్ని మండల ప్రాంతాల్లో ఉపాధ్యాయుల నుంచి హెచ్‌ఎంలు డబ్బులు వసూలు చేస్తున్నట్టు టీచర్లు చెబుతున్నారు. ఇదేమిటని అడిగితే బిల్లులు త్వరగా మంజూరు చేయించాలంటే సొమ్ములు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. కొన్ని పాఠశాలల్లో అయితే రూ.వెయ్యి వరకూ తీసుకుంటున్నారని అంటున్నారు. దీంతో కొంతమంది ఉపాధ్యాయులు ట్రెజరీ కంటే స్కూళ్లలో దారుణంగా ఉందని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని, అలాచేస్తే తమను వేధిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
సొమ్ములు తీసుకోవటం వాస్తవమే
ఉపాధ్యాయుల నుంచి ఖజానా అధికారులు సొమ్ములు డిమాండ్ చేయటం వాస్తవమేనని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సాబ్జీ, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డీవీఏవీ ప్రసాదరాజు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కొందరు అధికారులు భారీగా సొమ్ములు డిమాండ్ చేస్తున్నారని అటువంటివి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement