ఖమ్మం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల పదోన్నతి కౌన్సెలింగ్ రోజుకోతీరుగా మారుతోంది. ఇప్పుడు.. అప్పుడు.. అంటూ అధికారులు పదేపదే వాయిదా వేస్తుండడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా తమకు అనుకూలమైతే ఒక నిబంధన, లేకపోతే మరో నిబంధన అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక విద్యాశాఖాధికారులు అయోమయంలో పడ్డారు. దీంతో గత పది రోజులుగా పదోన్నతుల కౌన్సెలింగ్ వాయిదా పడుతూనే ఉంది.
కొలిక్కిరాని మైదాన ప్రాంత ఎస్సీ, ఎస్టీల సమస్యలు...
మైదాన, ఏజెన్సీ ప్రాంతాలను వేరుచేసి పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమైన విద్యాశాఖకు కొత్త చిక్కు వచ్చి పడింది. విభజన సందర్భంగా మైదాన ప్రాంతంలోని ఎస్సీ ఉపాధ్యాయులు 27 మందికి ప్రమోషన్లు రావాల్సి ఉండగా 22 మాత్రమే ఇచ్చారని, మిగిలిన ఐదు పోస్టులు ఇచ్చాకనే పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆయా సంఘాల నాయకులు పట్టుబట్టారు. దీనిపై వారు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించడంతో ఈనెల 8న ప్రారంభం కావాల్సిన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది.
ఆందోళన బాటలో ఏజెన్సీ ఉపాధ్యాయులు..
మైదాన, ఏజెన్సీ ప్రాంతాలకు వేర్వేరుగా పదోన్నతులు కల్పించాల్సి ఉండగా మైదాన ప్రాంత సమస్యలతో లింకుపెట్టి తమకు పదోన్నతులు కల్పించకపోవడం సరైంది కాదని ఏజెన్సీ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన డీఈవో ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో అన్‌ట్రైన్డ్ ద్వారా నియమితులైన కొందరు ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారని, వారి సర్వీసు ఏ విధంగా పరిగణిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల నియామకం సర్వీసును పరిగణలోకి తీసుకోవాలా..? శిక్షణ పూర్తి చేసిన కాలం నుంచి పరిగణలోకి తీసుకోవాల అనే విషయం గతంలో ప్రస్తావనకు రాగా, శిక్షణ పూర్తి చేసిన సమయాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే విధుల్లో చేరిన మూడేళ్ల తర్వాతే ఉన్నత చదవులకు, శిక్షణకు వెళ్లాల్సి ఉండగా, పలువురు ఉపాధ్యాయులు మూడేళ్లు పూర్తి కాకుండానే వెళుతున్నారని, దీంతో నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న తాము నష్టపోతున్నామని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాల్సి రావడంతో ఆదివారం(11న) జరగాల్సిన ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ వాయిదా వేయాల్సి వచ్చిందని డీఈవో తెలిపారు. దీనికి నిరసనగా ఆదివారం ఇన్‌స్పైర్ కార్యక్రమానికి హాజరైన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిని గిరిజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్డుకున్నారు.
ఇబ్బంది పెడుతున్న జీవో 3..
ఉపాధ్యాయుల నియామకంలో జీవో నంబర్ 3ను అనుసరించి ఏజెన్సీలో ఉపాధ్యాయ పోస్టులను ఆ ప్రాంతం వారితోనే భర్తీ చేయాలి. దీంతోపాటు పదోన్నతులు కూడా అక్కడి వారికే కల్పించాలని ఏజెన్సీ ఉపాధ్యాయులు పట్టుబట్టారు. దీనికి అంగీకరించిన అధికారులు మైదాన, ఏజెన్సీ ప్రాంతాలకు వేర్వేరుగా పదోన్నతులు కల్పించేందుకు సిద ్ధమయ్యారు. అయితే జీవో నంబర్ 3 కేవలం ఉపాధ్యాయుల నియామకానికే వర్తిస్తుందని, పదోన్నతులకు కాదని పలువురు ఉపాధ్యాయలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు తీర్పు వచ్చేవరకు పదోన్నతులు కల్పించవద్దని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించడం తలకు మించిన భారమేనని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రతి నెలా నిర్వహించాల్సిన పదోన్నతుల ప్రక్రియ అధికారుల వైఖరి వల్లే జాప్యం జరుగుతోందని, అన్ని అర్హతలున్నా పలువురు ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందకుండానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోందని మరికొందరు అంటున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను కొలిక్కి తెస్తే తప్ప పదోన్నతుల కౌన్సెలింగ్ జరిగే అవకాశం లేదు.
అయోమయంలో విద్యాశాఖాధికారులు
Published Mon, Aug 12 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement