పదోన్నతుల్లేవ్
Published Tue, Dec 27 2016 2:36 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
ఏలూరు సిటీ : జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ వాయిదా పడింది. వాస్తవానికి మంగళవారం జిల్లాలోని 33 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇచ్చేందుకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. దీంతో డీఈవో డి.మధుసూదనరావు సోమవారం రాత్రి ఉపాధ్యాయ సంఘాల జిల్లా నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పదోన్నతుల సీనియార్టీ జాబితాపై డీఈఓకు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మధ్య సయోధ్య కుదరకపోవడంతో పదోన్నతుల కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. దీంతో సీనియార్టీ జాబితాలోని తేడాలను సరిచేసి, మార్పులపై పాఠశాల విద్య ఆర్‌జేడీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అనుమతులు వచ్చిన అనంతరమే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.
పా్యనెల్ నంబర్ల తేడాతో సమస్య
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి రోస్టర్ కమ్ మెరిట్ పద్ధతి అవలంబిస్తారు. ఈ నియామకాల అనంతరం సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు ప్యానెల్ నంబర్లు ఉంటాయి. గతంలో జిల్లాలో మెరిట్ కమ్ రోస్టర్ బుక్, ప్యానెల్ నంబర్ల నమోదు సక్రమంగా జరగలేదు. డీఈవో మధుసూదనరావు హయాంలో వీటిని నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తయారు చేసిన సీనియార్టీ జాబితాలో ఉపాధ్యాయుల సర్వీసులో చేరిన తేదీలు, ప్యానెల్ నంబర్లు తేడాగా ఉన్నట్లు గుర్తించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు పదోన్నతుల కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్‌సాబ్జీ, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పీ.వెంకటేశ్వరరావు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement