ఆలస్యం..నిర్లక్ష్యం..!
ఆలస్యం..నిర్లక్ష్యం..!
Published Tue, Jul 25 2017 11:15 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM
4 గంటలు ఆలస్యంగా ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్
డీఈఓ కార్యాలయం నుంచి వరుస మెసెజ్‌లతో గందరగోళం
భానుగుడి(కాకినాడ): ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో అధికారులు నిర్లక్ష్యవైఖరి ఉపాధ్యాయులకు శాపంగా మారింది. కౌన్సెలింగ్ గంటల తరబడి ఆలస్యంగా నిర్వహించడం, సీనియారిటీ జాబితాను కౌన్సెలింగ్‌కు కొన్ని గంటల మందు మాత్రమే విడుదల చేయడం తదితర కారణాలతో ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.దీనికి సంబంధించి ఉపాధ్యాయులకు సమాచారాన్ని సందేశాల ద్వారా పంపుతున్న జిల్లా విద్యాశాఖ సిబ్బంది సోమవారం రాత్రి మంగళవారం కౌన్సెలింగ్ తాలుకా వివరాలను 4 సార్లు మెసెజ్‌లు పంపి గందరగోళ పరిస్థితికి నెట్టింది. ఉదయం 9గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని, తర్వాత 2 గంటలకు, 12 గంటలకు ఇలా పలుమార్లు కౌన్సెలింగ్ జరిగే సమయాన్ని ఖరారు చేయకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఆఖరు మెసెజ్‌లో మధ్యాహ్నం 12 గంటలుగా తేల్చారు. కౌన్సెలింగ్ 3.30 గంటలకు గానీ ప్రారంభం కాలేదు.
కౌన్సెలింగ్‌కు రెండు కేంద్రాల ఏర్పాటు
మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌కు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్కూల్ అసిస్టెంట్ గణితం, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్‌లకు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహించారు. సోమవారం నిర్వహించాల్సిన లాంగ్వెజ్ పండిట్ హిందీ, పీడీలకు సంబంధించి మంగళవారం ఉదయం కౌన్సెలింగ్ నిర్వహించారు. మంగళవారం ఇంగ్లిష్ 476 ఖాళీలకు సంబంధించి, 720 మందికి, గణితం 702 ఖాళీలకు సంబంధించి 920 మందికి, పీడీ 44 ఖాళీలకు సంబంధించి 20 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. రాత్రి 10గంటలు దాటినా కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగించడం విశేషం.
రెండుసార్లు సీనియారిటీ జాబితాల విడుదల
కౌన్సెలింగ్‌కు సంబంధించి సీనియారిటీ జాబితాను రెండు సార్లు విడుదల చేయడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. కౌన్సెలింగ్‌కు కొన్ని గంటల ముందు మాత్రమే ఈ సీనియారిటీ జాబితా విడుదల కావడంతో ఉపాధ్యాయులు ఖాళీల ఎంచుకునేందుకు సమయం సరిపడక ఇబ్బంది పడ్డారు. రెండోసారి జాబితాలో రేషన్‌లైజేషన్ పోస్టులు వివరాలున్నా కొన్ని ఖాళీలను బ్లాక్ చేసినట్లు సందేహాలున్నాయని, దీనిపై ఉన్నతాధికారుల వివరణ కోరనున్నట్లు సంఘాల నేతలు పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న బదిలీ కౌన్సెలింగ్‌లో ఉపాధ్యాయులకు కనీసం కుర్చేనేందుకు కుర్చీలు, టెంట్‌లు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త్రాగేందుకు కనీసం నీరు ఏర్పాటు చేయలేదని, డిస్‌ప్లే స్క్రీన్లు పూర్తిగా నిలిపివేశారని అసహనం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయ సంఘాలకు అనుమతి:
మూడో రోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలను కౌన్సెలింగ్ హాల్‌లోకి నిలిపివేసిన డీఈఓ ఎస్.అబ్రహాం నాలుగో రోజు అనుమతించారు. ఉపాధ్యాయ నేతలు కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడం తదితర పరిణామాల కారణంగా అధికారులకు సమస్యను విన్నవించామని రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా సమస్య నెలకొనడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలను అనుమతించామని డీఈఓ తెలిపారు.
నేడు 2000 వేల మందికి కౌన్సెలింగ్
నేడు బదిలీ కౌన్సెలింగ్‌లో 2 వేలమంది ఉపాధ్యాయులు పాల్గొననున్నారని డీఈఓ ఎస్.అబ్రహాం అన్నారు. ఇందులో బయలాజికల్ సైన్స్–700, సోషల్ స్టడీస్–500, బయలాజికల్ సైన్స్–470, పీఎస్ హెచ్‌ఎం–300 మంది ఉన్నారన్నారు. ఉపాధ్యా«యులకు రెండు కౌన్సెలింగ్ హాల్‌లను ఏర్పాటు చేశామని, అవసరమనుకుంటే మరో హాల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కౌన్సెలింగ్ సమయం సీఎస్‌ఈ వెబ్‌సైట్ ద్వారా ఉపాధ్యాయులకు మెసెజ్ అందుతుందని వివరించారు. కౌన్సెలింగ్‌లో ప్రత్యేకాధికారి ఎస్వీ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ రాంబాబు, ఉపాధ్యాయ సంఘాల నేతలు టి.కామేశ్వరరావు, బీవీ రాఘవులు, పీఎన్‌వీవీ సత్యనారాయణ, చింతాడ ప్రదీప్‌కుమార్, నీలం వెంకటేశ్వరరావు, పి.సుబ్బరాజు,కేవీ శేఖర్, నక్కా వెంకటేశ్వరరావు, శాస్త్రి, లంక జార్జి, టీవీయస్ రంగారావు, వై.బంగార్రాజు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement