ఇదేం కౌన్సెలింగ్..!
ఇదేం కౌన్సెలింగ్..!
Published Fri, Jul 28 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM
ఉపాధ్యాయుల అసహనం
లాంగ్వెజ్ పండిట్‌లకు జరగని కౌన్సెలింగ్
భానుగుడి(కాకినాడ): ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ ప్రహసనంగా సాగుతుంది. ఉపాధ్యాయులను సమిధలను చేసు అధికారులు ఆడుకుంటున్న దుస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉపాధ్యాయులను నీరిక్షింపజేసి చావు కబురు చల్లగా చెప్పినట్లు ఆనక కౌన్సెలింగ్ లేదని చెప్పడంపై లాంగ్వెజ్ పండిట్లు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి వస్తున్న తమకు సరైన సమాచారం ఇవ్వకుండా, కనీసం తాగేందుకు నీటి సదుపాయాన్ని కలిగించకుండా ఒక రకమైన వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనసా...గిన కౌన్సెలింగ్:
ప్రతీ రోజూలానే శుక్రవారం సైతం సర్వర్లు పనిచేయక విద్యాశాఖ సిబ్బంది నానా యాతన అనుభవించారు. గురువారం నిర్వహించాల్సిన సోషల్, ఎన్‌ఎస్ సబ్జెక్టులకు శుక్రవారం కౌన్సెలింగ్‌ను కొనసాగించారు. ఎల్‌పీలకు సంబంధించి శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉన్నా ఉదయం 8 గంటలకే కౌన్సెలింగ్ కేంద్రాలకు రావాలని డీఈఓ వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని అందించి రాత్రి 8 గంటలు దాటినా ఎలాంటి కౌన్సెలింగ్ ఏర్పాటు చేయకపోవడం విచారకరం. శుక్రవారం పీఆర్‌జీలో తెలుగు 186 ఖాళీలకు గానూ 320మందికి, హిందీ 190 ఖాళీలకు సంబంధించి 360 మందికి కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. అయితే సర్వర్ పనిచేయకపోవడం వల్ల రాత్రి 8.30గంటలు దాటినా కౌన్సెలింగ్ జరగలేదు. దీంతో శనివారం జరగాల్సిన ఎస్‌జీటీ కౌన్సెలంగ్‌కు సంబంధించి విద్యాశాఖ స్పష్టతను ఇవ్వలేదు. ఉపాధ్యాయులకు అర్థరాత్రి సమాచారాన్ని అందిస్తామని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా సీఎస్‌ఈ ద్వారా ఈ కౌన్సెలింగ్ జరుగుతున్నందున లింక్ ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తున్నాయని డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. 3 వేలకు పైబడి ఎస్‌జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉందని ఈ ప్రక్రియకు మరికొద్ది రోజుల సమయం అవసరమయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.
Advertisement