చంద్రబాబు హయాంలో అడ్డ‘దారి’ దోపీడి | TDP Govt corruption has taken place in the work of valuable cement roads | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హయాంలో అడ్డ‘దారి’ దోపీడి

Published Mon, Aug 2 2021 2:33 AM | Last Updated on Mon, Aug 2 2021 12:27 PM

TDP Govt corruption has taken place in the work of valuable cement roads - Sakshi

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం కొత్త జెడ్డవారిపాలెంలో అసెంబ్లీ ఎన్నికల ముందు రూ. 12.17 లక్షలతో నిర్మించిన సిమెంట్‌ రోడ్డు ఇదీ.. పూర్తి నాసిరకం మెటీరియల్‌ వాడటంతో పూర్తిగా కొట్టుకుపోయి రాళ్లు లేచి ఉన్న రహదారి.

సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఎన్నికల ముందు ఉపాధి హామీ ద్వారా రాష్ట్రమంతటా పలు గ్రామాల్లో చేపట్టిన రూ.1,795.31 కోట్ల విలువైన సిమెంట్‌ రోడ్ల పనుల్లో పక్కా అవినీతి జరిగినట్లు స్పష్టమవుతోంది. సరిగ్గా ఎన్నికలకు 7 – 8 నెలల ముందు నిధులు అందుబాటులో లేకపోయినా గత సర్కారు టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు నామినేషన్‌ పద్ధతిలో పనులు కట్టబెట్టింది. సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తయిన తరువాత 2018 అక్టోబరు – 2019 మే మధ్య ఈ పనులు జరిగాయి. విజిలెన్స్‌ విచారణలో ఈ అక్రమాలను విజిలెన్స్‌ శాఖ నిగ్గు తేల్చడంతో బిల్లుల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. 

7,326 చోట్ల అక్రమాలే.. 
గత ఏడాదిన్నరగా కరోనా పరిస్థితులే నెలకొని ఉన్నందున లక్షల సంఖ్యలో జరిగిన రోడ్ల పనులపై విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అయినప్పటికీ ఇప్పటివరకు 11,573 పనులపై తనిఖీలు పూర్తి చేయగా 7,326 పనులలో వివిధ స్థాయిల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. ప్రతి మూడు పనుల్లో రెండింటిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. 1,644 పనులను పూర్తి నాసిరకంగా నిర్థారిస్తూ ఆ రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన ఖర్చును వంద శాతం సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి రికవరీ చేయాలని, ఒకవేళ ఇంకా బిల్లులు చెల్లించకుంటే వెంటనే నిలిపివేయాలని విజిలెన్స్‌ సిఫార్సు చేసింది.  

ఎలా తేల్చారంటే... 
విజిలెన్స్‌ అధికారులు రెండు రకాల పరీక్షల ఆధారంగా సిమెంట్‌ రోడ్లకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం సిమెంట్‌ రోడ్డును తగినంత మందంతో నిర్మించారా? సిమెంట్, ఇసుక సమపాళ్లలో కలిపారా? అనే అంశాల ఆధారంగా రోడ్ల నాణ్యతను నిర్ధారించారు. నేల స్వభావం మేరకు నిబంధనలు మారుతుంటాయని అధికారులు చెప్పారు.  

రోడ్డు మందం ఆధారంగా.. 
ఇంజనీరింగ్‌ శాఖ అధికారుల ప్రమాణాల ప్రకారం.. నిర్ణయించిన పరిమాణం (రోడ్డు మందం)లో 20 శాతం కంటే అధికంగా నిబంధనల ఉల్లంఘన జరిగితే పూర్తి స్థాయి నాసిరకంగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు సిమెంట్‌ రోడ్డు పది సెంటీమీటర్ల మందం మేర నిర్మించాల్సి ఉండగా 7.99 సెంటీమీటర్ల మేర మాత్రమే చేపడితే పూర్తి నాసిరకంగా నిర్ధారించి సంబంధిత ఖర్చును కాంట్రాక్టరు నుంచి రికవరీ లేదా బిల్లుల చెల్లింపు నిలిపివేత లాంటి చర్యలు చేపడతారు. ఒకవేళ 8 సెంటీమీటర్ల  నుంచి 9.99 సెంటీ మీటర్ల మందంతో రోడ్డు నిర్మాణం చేపడితే ఆ పరిమాణం స్థాయిని బట్టి అక్రమాలను నిర్ధారించి తగినవిధంగా రికవరీకి సిఫారసు చేస్తారు.  

గత అసెంబ్లీ ఎన్నికల ముందు గుంటూరు జిల్లా నూజెండ్లలో రామిశెట్టి హనుమంతరావు ఇంటి నుంచి ఎస్‌కే బడే నివాసం వరకు ఉపాధి హామీ నిధులతో రూ.13.29 లక్షల ఖర్చుతో సిమెంట్‌ రోడ్డు వేశారు. ఇటీవల ఆ రోడ్డును పరిశీలించిన విజిలెన్స్‌ అధికారులు పూర్తి నాసిరకంగా నిర్మించినట్లు నిర్ధారించారు. ఆ పనులు చేసిన వారి నుంచి వందకు 100% రికవరీ చేయాలని సిఫార్సు చేశారు. విచిత్రం ఏమిటంటే అంత నాసిరకంగా రోడ్డు పనులు ఎవరు చేయించారన్నది ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా లేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు అర్నెల్ల ముందు నూజెండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో హడావుడిగా రూ. 25.62 కోట్లతో మొత్తం 253 సిమెంట్‌ రోడ్ల నిర్మాణం జరిగింది. అందులో 213 రోడ్లను విజిలెన్స్‌ అధికారులు పరిశీలించగా 196 రోడ్లు నాసిరకమైనవని తేల్చారు. 17 రోడ్లు మాత్రమే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. రోడ్లన్నీ పంచాయతీల పేర్లతోనే నిర్మాణం జరిగినట్లు చూపడం గమనార్హం.

నూజెండ్ల మండలం పుచ్చనూతల పంచాయతీ పరిధిలోని పాతరెడ్డిపాలెం గ్రామంలో రూ.13.85 లక్షలతో చేపట్టిన సిమెంట్‌ రోడ్డుదీ అదే పరిస్థితి. ఆ రోడ్డు నిర్మాణ ఖర్చును 100% సంబంధిత వ్యక్తుల నుంచి రాబట్టాలని విజిలెన్స్‌ పేర్కొంది. ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ పేరుతోనే పనులు కానిచ్చేశారు! 

నూజెండ్ల మండలం పువ్వాడ గ్రామ పంచాయతీ పరిధిలో రూ.6.96 లక్షలతో ఏ.వెంకట నరసయ్య ఇంటి నుంచి ఆంజనేయస్వామి గుడి దాకా నిర్మించిన సిమెంట్‌ రోడ్డు వ్యవహారం కూడా ఇంతే. అదే మండలం మక్కెళ్లపాడులో రూ.12.17 లక్షలతో నిర్మించిన సిమెంట్‌ రోడ్డు కథ కూడా ఇదే బాపతు.

మిక్సింగ్‌ ఎలా ఉంది? 
నిర్ణీత కాలం పాటు సిమెంట్‌ రోడ్డు మన్నికగా ఉండాలంటే సిమెంట్, ఇసుక, కంకరను తగిన నిష్పత్తుల మేరకు మేళవించాలి. నేల స్వభావాన్ని బట్టి దీన్ని నిర్ణయిస్తారు. ఉదాహరణకు  ఒక రకమైన నేలలు ఉన్న చోట బస్తా సిమెంట్‌కు రెండు బస్తాల ఇసుక, 4 బస్తాల కంకర కలపాల్సి ఉంటుందని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. దీని ఆధారంగా సిమెంట్‌ రోడ్డు సామర్థ్యాన్ని నిర్ధా్దరిస్తారు. మూడింటి కలయిక ఆధారంగానే ఒక చదరపు మీటరు రోడ్డు ఎంత బరువును మోయగలదన్నది అంచనా వేస్తారు. నిర్దేశిత బరువులో కనీసం 75 % భారాన్ని రోడ్డు భరించాలి. అంతకంటే తక్కువ బరువు మోసే పరిస్థితిలో రోడ్డు ఉంటే పూర్తి నాసిరకమైనదిగా తేల్చి 100% రికవరీకి ఆదేశాలిస్తారు. 75–99.99 శాతం మధ్య బరువు భరించే స్థాయిలో రోడ్డు ఉంటే ఆ మేరకు నిర్ణీత స్థాయిలో రికవరీకి సిఫార్సు చేస్తారు. ఉదాహరణకు  రోడ్డు 30 టన్నుల బరువు భరించాల్సి ఉండగా 22.5 టన్నుల కంటే తక్కువ మాత్రమే భరించేలా నిర్మాణం చేపడితే వంద శాతం డబ్బులు రికవరీకి సిఫార్సు చేస్తారు. 

సర్పంచులు లేని సమయంలో... 
ఉపాధి హామీ పథకంలో ఏ పనులు చేపట్టినా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే జరగాలి. ఈ పథకంలో కాంట్రాక్టర్లకు తావులేదు. సాధారణంగా ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో చేపట్టే సిమెంట్‌ రోడ్లు, ఇతర భవన నిర్మాణాల పనులు సర్పంచ్‌ల ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అయితే రాష్ట్రంలో 2018 ఆగస్టు నాటికి సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఆ సమయంలో 2018 అక్టోబరు – 2019 మే నెలల మధ్య రూ.1,795 కోట్ల విలువైన సిమెంట్‌ రోడ్డు పనులు జరిగినట్లు బిల్లులు తయారు చేశారు.

ఆ పనులన్నీ పంచాయతీల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంటూ వాటి పేరుతోనే బిల్లులు సిద్ధం చేశారు. అప్పటి గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి నుంచి తీర్మానాలు తీసుకొని ఆయా పనులు చేశారు. అయితే పనులు ఎవరు చేశారు? ఆ వ్యక్తులు ఎవరు? అనే వివరాలను గ్రామ పంచాయతీల వద్ద గానీ చివరకు ఇంజనీరింగ్‌ అధికారుల వద్ద ఎలాంటి రికార్డులు లేకుండా గుట్టుగా వ్యవహరించారు. గ్రామాల్లో టీడీపీ నేతలే ఆ పనులన్నీ అనధికారికంగా చేశారని అధికారులు పేర్కొంటున్నారు. 

రికార్డుల్లో లేకున్నా కోర్టులో మాత్రం కేసులు.. 
రోడ్ల పనులు ఎవరు చేశారన్నది రికార్డుల్లో ఎక్కడా సమాచారం లేదు. అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ తనిఖీల్లో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో బిల్లుల చెల్లింపులలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒత్తిళ్లకు తలొగ్గి బిల్లులు చెల్లిస్తే తరువాత ఎవరి నుంచి రికవరీ చేయాలో అంతుబట్టక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గతంలో జరిగిన నాసిరకం పనులకు బిల్లులు చెల్లించాలంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడం, రికార్డుల్లో వివరాలు ఏవీ లేకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది. అప్పట్లో జరిగిన ఈ పనులకు సంబంధించి దాదాపు 50 వరకు హైకోర్టులో కేసులు దాఖలైనట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement