అందల‘మెక్కి’స్తున్నారు! | Corrupted officials in the RTC | Sakshi
Sakshi News home page

అందల‘మెక్కి’స్తున్నారు!

Published Sun, Dec 13 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

అందల‘మెక్కి’స్తున్నారు!

అందల‘మెక్కి’స్తున్నారు!

♦ ఆర్టీసీలో అవినీతి అధికారులకు పట్టం
♦ దుకాణాల అద్దెలు మింగిన అధికారికి ఉన్నత పోస్టు
♦ అద్దె బస్సు నిధులు గోల్‌మాల్ చేసిన వ్యక్తికి డిపో మేనేజర్ పదవి
♦ రికవరీ నిధులు తిన్నా చర్యలు శూన్యం
 
 సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎలుకలు ఉంటే ఏం చేస్తారు.. వాటికి మందుపెడతారు.. కలుగుల న్నింటిని మూసేస్తారు. కానీ మరిన్ని ఎలుకలు లోనికి చేరేలా కొత్త కలుగులు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఆర్టీసీలో యాజమాన్యం తీరు ఇలాగే ఉంది. రోజురోజుకు పెరుగుతున్న నష్టాలతో దివాలా దిశగా సాగుతున్న సంస్థను సరిదిద్దాల్సిందిపోయి.. తిన్నింటికే కన్నం వేస్తున్న అధికారులను అందలమెక్కిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా మంచి పోస్టింగులు ఇస్తూ పరోక్షంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. ఆర్టీసీకి వివిధ డిపోల పరిధిలో సొంత దుకాణాలున్నాయి. వాటి  నుంచి వసూలయ్యే అద్దెలను ఆర్టీసీ ఖజానాకు జమ చేయాలి.

ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గతంలో రిటైర్డ్ సిబ్బందిని నియమించారు. 2006 నుంచి 2013 వరకు వివిధ డిపోల పరిధిలో దాదాపు రూ.2 కోట్లు బ్యాంకుల్లో జమకాలేదు. ఇది 2013లో వెలుగుచూడటంతో నాటి ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ సిబ్బందిపై వేటు వేయటంతోపాటు దాదాపు 15 మంది అధికారులు, సిబ్బందిపై అభియోగాలు నమోదు చేశారు. ఆ మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేయాలని కూడా ఆదేశించారు. రికవరీ దేవుడెరుగు.. అభియోగాల జాబితాలో ఉన్న అధికారుల పేర్లు తొలగించి వారికి మంచి పోస్టింగులు ఇచ్చారు. రిటైర్డ్ సిబ్బందిని తొలగించి రూ.2 కోట్ల కుంభకోణానికి తెరలేపిన అధికారులకు క్లీన్‌చిట్ ఇచ్చేశారు.

 అద్దె బస్సుల కుంభకోణంలో...
 ఇటీవల పలు జిల్లాల్లో అద్దె బస్సు నిర్వాహకులతో అధికారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారు. వరంగల్ జిల్లాలో స్వయంగా విజిలెన్స్ అధికారులు ఆధారాలతోసహా బట్టబయలు చేశారు. పాత బస్సులకు తక్కువ అద్దె చెల్లించాల్సి ఉన్నప్పటికీ... వాటికీ ఎక్కువ అద్దె చెల్లించి రూ.కోటి వరకు పక్కదారి పట్టించారు. ఇందులో క్లర్క్ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్న యాజమాన్యం పెద్ద అధికారులను మాత్రం కాపాడింది. ఈ కుంభకోణంలో వాటా ఉన్నట్టు తొలుత పేరు నమోదైన ఓ అధికారిని మరో జిల్లాలో డిపో మేనేజర్‌గా నియమించారు. ఇప్పుడా అధికారి దర్జాగా డీఎం హోదాలో తనదైన ‘శైలి’లో పనిచేసుకుపోతున్నారు.

 డ్రైవర్ల రికవరీ నిధులు భోంచేసినా..
 టికెట్ల లెక్కల్లో రూ.5 తేడా వచ్చినా కండక్టర్లను సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయి. అలాగే చిన్నచిన్న ప్రమాదాలతో బస్సులకు నష్టం చేసిన డ్రైవర్ల నుంచి వసూలు చేసిన నష్టపరిహారాన్ని స్వాహా చేసిన అధికారులకు మాత్రం పట్టం కడుతున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాలో లైట్లు, అద్దాలు పగిలిన బస్సులకు సంబంధిత డ్రైవర్ల నుంచి నష్టాన్ని రికవరీ చేశారు. ఈ మొత్తాన్ని సంస్థకు చెల్లించకుండా ఓ అధికారి జేబులో వేసుకున్నాడు. దీనిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించారు. కానీ ఆ అధికారిని కాపాడేందుకు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విజిలెన్స్ నివేదిక సరిగాలేదంటూ మరో విచారణను తెరపైకి తెచ్చారు. చివరకు కేసును నీరుగార్చి ఆ అధికారికి కనీసం చార్జిమెమో కూడా ఇవ్వకుండా కాపాడారు. త్వరలో ఆ అధికారికి పదోన్నతి కల్పించే పనుల్లో ఉండటం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement