రూ.18లక్షల విలువైన గుట్కాలు దహనం
-
రెవెన్యూకు రూ. 2.83 లక్షల యంత్రాల అప్పగిత
తుని రూరల్ :
తుని మండలం కేఓ మల్లవరంలో పట్టబడ్డ రూ.18లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకును దహనం చేశారు. గురువారం విజిలెన్సు సీఐ రామ్మోహనరావు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నం, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజన్న సమక్షంలో ముడిసరుకు, గుట్కాలను దహనం చేసి రూ.2.83లక్షలు విలువ చేసే యంత్రాలను రెవెన్యూశాఖ అధికారులకు అప్పగించారు. నకిలీ గుట్కాలు అక్రమంగా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఆగస్టు ఆరో తేదీన విజిలెన్సు ఎస్పీ టి.రాంప్రసాద్ ఆదేశాల మేరకు డీఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్, సీఐ వి.భాస్కరరావు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నం కేఓ మల్లవరంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దాడుల్లో రూ.20లక్షల విలువైన ముడిసరుకు, గుట్కా ప్యాకెట్లు, యంత్రాలను సీజ్ చేశారు. ఆ ముడి సరుకు, గుట్కాలను దహనం చేసి, యంత్రాలను వేలం వేయాలని రెవెన్యూశాఖకు అప్పగించారు. వర్షం కారణంగా యంత్రాలను కార్యాలయానికి తరలించలేదని, వాతావరణం అనుకూలించిన వెంటనే యంత్రాలను తుని తరలిస్తామన్నారు. అప్పటి వరకు వీఆర్వో ఆధ్వర్యంలో రక్షణ కల్పించామని తెలిపారు.