mallavaram
-
‘కడిమిశెట్టి’కి మల్ల‘వరం’
పిఠాపురం: స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే చాలు.. గ్రామాలు ఒకటే సందడిగా ఉంటాయి. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం ఏపీ మల్లవరం (ఆలవెల్లి పాత మల్లవరం) గ్రామంలో మాత్రం ఏ హడావుడీ ఉండదు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆ గ్రామస్తులందరూ ఒకచోట సమావేశమవుతారు. వచ్చిన రిజర్వేషన్‌కు అనుకూలంగా ఒక వ్యక్తి పేరు సూచిస్తారు. అందరి ఆమోదంతో ఎన్నిక లేకుండా ఊరంతా ఏకగ్రీవంగా ఆ వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఆ పంచాయతీలో సర్పంచ్‌లు మారుతుంటారు. వారి పేర్లు మారతాయి. కానీ ఇంటిపేరు మాత్రం ఒకటే ఉంటుంది. అదే ‘కడిమిశెట్టి’. ఆ గ్రామంలో ఎవరిని కదిపినా కడిమిశెట్టి వారి ఇంటి పేరు మార్మోగుతుంది. గడచిన 11 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పది దఫాలు ఇక్కడ ఏకగ్రీవమే. ఒక్కసారి మాత్రమే ఎన్నిక జరిగింది. ఏపీ మల్లవరం గ్రామం పది దఫాల్లోనూ కడిమిశెట్టి వారి కుటుంబసభ్యులు ఐదుసార్లు సర్పంచ్‌లుగా.. అదీ ఏకగ్రీవం కావడం విశేషం. మిగిలిన ఎన్నికల్లో రిజర్వేషన్ల వలన ఇతరులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు తప్ప అవకాశం ఉంటే చాలు కడిమిశెట్టి వారికే పట్టం కడతామంటున్నారు ఆ గ్రామస్తులు. ఈ దఫా ఎన్నికల్లోనూ అక్కడ సర్పంచ్‌తోపాటు 10 మంది వార్డు సభ్యులను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామం 1965లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. తొలి సర్పంచ్‌గా గ్రామపెద్ద అయిన కడిమిశెట్టి అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కడిమిశెట్టి బుల్లిరాజు, కడిమిశెట్టి పెదరాము, కడిమిశెట్టి వెంకటసత్యనారాయణస్వామి సర్పంచ్‌లయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో కడిమిశెట్టి సుశీలను సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలవెల్లి ఎస్టేట్.. 3 పంచాయతీలు గొల్లప్రోలు మండలంలో 1964కు ముందు ఆలవెల్లి ఎస్టేట్ ఒకే గ్రామంగా ఉండేది. ఈ గ్రామాన్ని ఏపీ మల్లవరం (ఆలవెల్లి పాత మల్లవరం), ఏకే మల్లవరం (ఆలవెల్లి కొత్త మల్లవరం), ఏ విజయనగరం (ఆలవెల్లి విజయనగరం) అనే మూడు గ్రామాలుగా విభజించారు. 1965 నుంచి ఈ మూడు గ్రామాలు పంచాయతీలుగా ఆవిర్భవించాయి. -
మామ చేతిలో అల్లుడి హతం
మామ,చేతిలో,అల్లుడి,హతం,murder,ka,mallavaram కేఏ మల్లవరం (కోటనందూరు) : మామ చేతిలో అల్లుడు హత్యకు గురైన సంఘటన కేఏ మల్లవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సింగంపల్లి బుల్లెబ్బాయి, అడిగర్ల సత్యనారాయణలు వరుసకు మామా అల్లుడు. అల్లుడు సత్యనారాయణ (45) తాగుబోతు. రోజూ తాగి ఇంటికి వచ్చి భార్య, అత్తమామలను వేధిస్తూ ఉండేవాడు. శుక్రవారం ఉదయం భార్య, అత్త పొలం పనులకు బయటకు వెళ్లిన సమయంలో సత్యనారాయణ తాగి వచ్చి ఇంట్లో అన్నం తింటున్న మామను కాలుతో తన్ని దుర్భాషలాడాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో సింగంపల్లి బుల్లబ్బాయి ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయాడు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి తిరిగి ఇంటికి వచ్చే సరికి మద్యం మత్తులో నిద్రిస్తున్న అల్లుడు సత్యనారాయణను మెడ, ముఖం, చేతులపై కత్తితో విచక్షణ రహితంగా నరికి చంపేశాడు. గ్రామ నౌకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటనందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తుని రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై బి.శంకర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
మల్లవరం.. సుబ్రహ్మణ్యేశ్వరుడి నిలయం
చాగంటి కోటేశ్వరరావు గొల్లప్రోలు : ఆలవెల్లి మల్లవరం ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వరుడి నిలయమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మల్లవరంలోని ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన మంగళవారం దర్శించారు. ఆలయ కమిటీ పెద్దలు, పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ముఖద్వారం, కడిమిశెట్టి అప్పారావు, అన్నపూర్ణ దంపతులు జ్ఞాపకార్థం కడిమిశెట్టి కుమారభాస్కరెడ్డి కుటుంబ సభ్యులు నిర్మించిన యాత్రికుల వసతిగృహాన్ని ఆయన ప్రారంభించారు. ఉత్సవానికి తయారు చేసిన తెప్ప, నెమలి వాహనాన్ని పరిశీలించారు. ఆలయంలో హోమశాల నిర్మాణానికి రూ.10,116 విరాళం అందజేశారు. అనంతరం ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. మల్లవరంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడు విభూధితో నిత్యం ప్రకాశిస్తున్నాడన్నారు. ఇక్కడ స్వామివారికి విశేష శక్తి ఉందన్నారు. స్వామివారిని పూజిస్తే సంతానం కలుగుతుందన్నారు. ప్రతిఏటా ఇక్కడ షష్ఠి ఉత్సవాలకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. -
రూ.18లక్షల విలువైన గుట్కాలు దహనం
రెవెన్యూకు రూ. 2.83 లక్షల యంత్రాల అప్పగిత తుని రూరల్ : తుని మండలం కేఓ మల్లవరంలో పట్టబడ్డ రూ.18లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకును దహనం చేశారు. గురువారం విజిలెన్సు సీఐ రామ్మోహనరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజన్న సమక్షంలో ముడిసరుకు, గుట్కాలను దహనం చేసి రూ.2.83లక్షలు విలువ చేసే యంత్రాలను రెవెన్యూశాఖ అధికారులకు అప్పగించారు. నకిలీ గుట్కాలు అక్రమంగా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఆగస్టు ఆరో తేదీన విజిలెన్సు ఎస్పీ టి.రాంప్రసాద్ ఆదేశాల మేరకు డీఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్, సీఐ వి.భాస్కరరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం కేఓ మల్లవరంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దాడుల్లో రూ.20లక్షల విలువైన ముడిసరుకు, గుట్కా ప్యాకెట్లు, యంత్రాలను సీజ్ చేశారు. ఆ ముడి సరుకు, గుట్కాలను దహనం చేసి, యంత్రాలను వేలం వేయాలని రెవెన్యూశాఖకు అప్పగించారు. వర్షం కారణంగా యంత్రాలను కార్యాలయానికి తరలించలేదని, వాతావరణం అనుకూలించిన వెంటనే యంత్రాలను తుని తరలిస్తామన్నారు. అప్పటి వరకు వీఆర్వో ఆధ్వర్యంలో రక్షణ కల్పించామని తెలిపారు.