మల్లవరం.. సుబ్రహ్మణ్యేశ్వరుడి నిలయం
చాగంటి కోటేశ్వరరావు
గొల్లప్రోలు : ఆలవెల్లి మల్లవరం ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వరుడి నిలయమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మల్లవరంలోని ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన మంగళవారం దర్శించారు. ఆలయ కమిటీ పెద్దలు, పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ముఖద్వారం, కడిమిశెట్టి అప్పారావు, అన్నపూర్ణ దంపతులు జ్ఞాపకార్థం కడిమిశెట్టి కుమారభాస్కరెడ్డి కుటుంబ సభ్యులు నిర్మించిన యాత్రికుల వసతిగృహాన్ని ఆయన ప్రారంభించారు. ఉత్సవానికి తయారు చేసిన తెప్ప, నెమలి వాహనాన్ని పరిశీలించారు. ఆలయంలో హోమశాల నిర్మాణానికి రూ.10,116 విరాళం అందజేశారు. అనంతరం ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. మల్లవరంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడు విభూధితో నిత్యం ప్రకాశిస్తున్నాడన్నారు. ఇక్కడ స్వామివారికి విశేష శక్తి ఉందన్నారు. స్వామివారిని పూజిస్తే సంతానం కలుగుతుందన్నారు. ప్రతిఏటా ఇక్కడ షష్ఠి ఉత్సవాలకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.