క్వారీలపై విజి‘లెన్స్’
దేవరపల్లి: దేవరపల్లి మండలం గౌరీపట్నం ప్రాంతంలో విస్తరించి ఉన్న నల్లరాతి క్వారీలపై విజిలెన్స్ అధికారులు దృష్టిపెట్టారు. గత మూడేళ్లుగా క్వారీల్లో జరిగిన కార్యకలాపాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతిలేకుండా తవ్విన క్వారీలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్ సెస్ సక్రమంగా చెల్లించకుండా అక్రమంగా మైనింగ్ వ్యాపారం చేస్తున్న యజమానులపై అధికారులు దృష్టి కేంద్రీకరించినట్టు తెలిసింది. గతేడాది గౌరీపట్నం ప్రాంతంలో తవ్విన క్వారీని విజిలెన్స్ అధికారులు కొలతలు చెల్లించిన మైనింగ్ సెస్ కంటే ఎక్కువ మొత్తంలో మైనింగ్ తవ్వకాలు జరిపినట్టు గుర్తించిన అధికారులు రూ.96 లక్షలు పెనాల్టీ విధించారు.
అంత ఎక్కువ మొత్తంలో సొమ్ము చెల్లించలేనని సదరు క్వారీ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిసింది. ఇటీవల గౌరీపట్నం పంచాయతీ పరిధిలోని కొండగూడెం వద్ద రెండు క్వారీలను అధికారులు కొలతలు వేసి యజమానులకు భారీ మొత్తంలో పెనాల్టీ విధించినట్టు తెలిసింది. ఒక క్వారీకి రూ.19 లక్షలు, మరొక క్వారీ యాజమాన్యానికి రూ. 25 లక్షలు జరిమానా విధించినట్టు సమాచారం. క్వారీ నుంచి రవాణా చేస్తున్న మైనింగ్ లారీకి ప్రభుత్వానికి రూ. 250 సెస్ చె ల్లించాలి. దీనికి సంబంధించిన సొమ్ము ఏలూరులోని మైనింగ్ శాఖ కార్యాలయంలో చెల్లించి యజమానులు రశీదులు తీసుకోవాల్సి ఉంది.
మైనింగ్ రవాణా చేసే సమయంలో రశీదును లారీలో ఉంచాలి. అయితే రెండు, మూడేళ్లుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్ కొంతమంది యజమానులు చె ల్లించకుండా అక్రమంగా తరలించటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. దీంతో పంచాయతీలకు రావలసిన మైనింగ్ ఆదాయం రాకపోవటంతో కొత్తగా పదవులు చేపట్టిన సర్పంచ్‌లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అంతేకాక పలువురు యజమానులు అక్రమంగా మైనింగ్ వ్యాపారం చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు ప్రభుత్వానికి, మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. మైనింగ్ అధికారులకు 10 బిల్లులకు సెస్ కట్టి ఆ బిల్లులపై నెల పొడవునా వ్యాపారం చేస్తున్నారని సర్పంచ్‌లు మంత్రులకు వివరించారు. దీంతో విజిలెన్స్ అధికారులు క్వారీ తవ్వకాలపై నిఘా పెట్టారు. అధికారుల తనిఖీలతో అక్రమ మైనింగ్ వ్యాపారుల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.