రేషన్ షాపులపై రాజకీయ పెత్తనం !
పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే రేషన్ షాపులపై పెద్దల పెత్తనం పెరుగుతోంది. రాజకీయనాయకులు తమ అనుచరులను బినామీ డీలర్లుగా నియమిస్తున్నారు. దీంతో జిల్లాలో రేషన్ డిపోల డీలర్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. చాలా రేషన్ షాపులను ఇన్‌చార్జ్‌లతో నిర్వహిస్తుండడం, ఇన్‌చార్జ్‌లకు బదులు బినామీలు షాపులను నడుపుతుండడంతో కార్డుదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. చాలా చోట్ల సస్పెండ్ అయిన వారే డీలర్లుగా కొనసాగుతున్నారు. జిల్లాలో 79 డీలర్ పోస్టులు ఖాళీగా ఉండగా, మరో 70 షాపులు ఇన్‌చార్జ్‌లతో నడుస్తున్నాయి. రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో వారి బినామీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు.
విజయనగరం కంటోన్మెంట్: ప్రతినెలా పేద ప్రజలకు నిత్యావసరాలను సబ్సిడీ ధరలకు అందించాల్సిన రేషన్ షాపుల్లో ఇన్‌చార్జ్ డీలర్ల నియామకాలు వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇన్‌చార్జిలను నియమించాల్సిన అవసరం లేకుండా స్థానిక మహిళా గ్రూపులకు బాధ్యతలు తాత్కాలికంగా అప్పగించాలన్న ప్రభుత్వ నిబంధనలను అధికారులు పక్కన పెడుతున్నారు. ఏ రేషన్ షాపులోనైనా అక్రమాలు జరిగినపుడు ఆ డీలర్‌పై సస్పెన్షన్ వేటువేసి, పక్క గ్రామానికి, వార్డుకు చెందిన డీలర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు రాజకీయ నాయకులు తమకు ఆ రేషన్ షాపును అప్పగించాలని అటు ఇన్‌చార్జ్ డీలరుతో పాటు అధికారులపైనా ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు కూడా చూసీ చూడనట్టు తలూపడంతో జిల్లాలోని కొన్ని రేషన్ షాపులకు రాజకీయ నాయకులు తమ వారిని బినామీలుగా నియమించుకుంటున్నారు.
ఇక వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. వారికి నచ్చినట్టు రేషన్ షాపులను నిర్వహిస్తున్నారు. వీరు నిర్వహిస్తున్న షాపులు మరో డీలర్ పేరిట ఇన్‌చార్జ్‌గా నమోదయి ఉండటంతో బినామీలు చేస్తున్న తప్పులకు అసలు డీలర్లు బలవుతున్నారు. అధికారికంగా ఉన్న ఇన్‌చార్జిపై కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల డెంకాడ మండలంలోని గొడిపాలెంలో బినామీ డీలర్ నిర్వహిస్తున్న రేషన్ షాపును విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఇదే షాపుపై గతంలో కూడా విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. షాపులకు ఇన్‌చార్జ్ ఒకరే... నిర్వహిస్తున్న బినామీలు మారుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కారణంగా ఇన్‌చార్జీలు ఈ షా పులను బినామీలకు అప్పగించవలసి వస్తోంది. బుధవారం కేసు నమోదయిన ఈ షాపునకు ఇన్‌చార్జిగా పేడాడ గ్రామ డీలర్ వ్యవహరిస్తున్నారు. ఈయనే పినతాడివాడ షాపునకు కూడా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇన్‌చార్జీలున్న అన్ని చోట్లా ఇదే తరహాలో అవకతవకలు జరుగుతుండడంతో ఎవరిపై కేసు నమోదు చేయాలన్న విషయంలో అధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి వస్తోంది.
సస్పెండయిన వారే డీలర్లుగా చలామణి
పార్వతీపురం డివిజన్‌లో సస్పెండయిన డీలర్లే రేషన్ షాపులు నడుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అసలు డీలర్లు తప్పులు చేస్తే తొలగించడమో, లేక వెంటనే విచారణచేసి మరో డీలర్‌ను నియమించడమో చేయాల్సి ఉంది. కానీ డీలర్ల నియామకాలు చేపట్టవద్దని ఆదేశాలు రావడంతో అధికారులు నియామకాలు చేపట్టడం లేదు. జిల్లాలో ఉన్న 1,362 రేషన్ షాపుల్లో ఇప్పటికే 79 డీలరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో పక్క అక్రమ రవాణా, తూనికల్లో వ్యత్యాసాలున్న కారణంగా సస్పెన్షన్‌లో మరో 62 షాపులున్నాయి. వాటి స్థానంలో ఆయా గ్రామాలు, వార్డుల్లోని మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. కానీ వీటిలో కూడా పక్క డీలర్లకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. 6ఏ కేసులు నమోదైతూనికలు, కొలతల వ్యత్యాసాలకు విజిలెన్స్ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, అధికారులు సస్పెండ్ చేసిన డీలర్లు కూడా డిపోలు నడపడం విశేషం. సస్పెండయిన డీల రు స్థానంలో పక్క గ్రామానికి చెందిన డీలరుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం వల్ల వారి మధ్య సయోధ్య కారణంగా రేషన్ షాపును సస్పెండయిన వ్యక్తే నడిపిస్తున్న వైనాలపై గతంలో కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లోనూ ఫిర్యాదులు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
పెండింగ్‌లో కేసులు
పౌరసరఫరాలు, లేదా ఇతర ఆహార పదార్థాల విక్రయా ల్లో అక్రమాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటువంటి కేసులు జి ల్లాలో చాలా వరకూ పెండింగ్‌లో ఉంటున్నాయి. జిల్లాలో రేషన్ డీలర్ల వద్ద సరుకుల వ్యత్యాసం ఉన్న కేసులతో పాటు అక్రమంగా సరుకుల తరలింపు వంటి 119 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్కొక్క డీలర్‌కూ రెండు నుంచి నాలుగేసి రేషన్ డిపోలున్నట్టు అధికారులకూ తెలుసు. అయినా పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఏదైనా అంశం వెలుగులోకి వస్తే తప్ప అధికారులు స్పందించడం లేదు.
గత కొన్నేళ్లుగా నమోదైన కేసుల వివరాలు
సంవత్సరం నమోదైనవి పరిష్కారమైనవి పెండింగ్
2008 150 150 0
2009 77 77 0
2010 78 76 2
2011 84 84 0
2012 70 68 2
2013 43 28 15
2014 138 38 100స