విజయనగరం కంటోన్మెంట్:పౌరసరఫరాల శాఖలో కొత్త విధానాలను అమలు చేయనున్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. రేషన్ డిపోలకు తూకం సరిగా అప్పగించడంతో పాటు కొత్త రేషన్ కార్డులకు తహశీల్దార్‌లకు లాగిన్లు ఇవ్వనున్నా రు. అస్తవ్యస్తంగా ఉన్న రేషన్ విధానాన్ని సమూలంగా మా ర్చేం దుకు సివిల్ సప్లైస్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలమేరకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,05,592 రేషన్ కార్డులున్నాయి. ఇందులో 44,296 పింక్ కారు ్డలు, 6,61,296 తెల్లకార్డులున్నాయి. అయితే చాలా తెల్లకార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నాయి. జిల్లాలో పలువురు భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, రోజుకు లక్షలాది రూపాయల లావాదేవీలు నడిపే వ్యాపారస్తులు తెల్లరేషన్ కార్డులను కలిగిఉన్నారు. ఇందులో కొంత మంది స్వతహాగా ధనికులు, మరికొంత మంది తెల్ల రేషన్ కార్డులు పొందాక బాగా అభివృద్ధి చెందిన వారు ఉన్నారు.
అయితే తెల్ల రేషన్ కార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే పరిస్థితి లేదు. దీంతో అనర్హులు స్వచ్ఛందంగా రేషన్‌కార్డులు అప్పంగించేలా ఈ ఏడాది కొత్తగా అధికారులు డ్రాప్ బాక్స్ విధానాన్ని అమలుచేయనున్నారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఈ డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తారు. తెల్ల రేషన్ కార్డులను సరెండర్ చేసే వారు వచ్చి ఈ బాక్స్‌లో తమ కార్డు వేస్తే, ఆ కార్డులను రద్దు చేసి అదేస్థానంలో వారికి పింక్ కార్డులు ఇస్తారు. దీంతో చాలా వరకూ బోగస్ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉండొచ్చని సివిల్ సప్లై అధికారులు భావిస్తున్నారు. మరో పక్క కొత్తగా తెల్ల రేషన్ కార్డులు మంజూరు కోసం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ విధానానికి సంబంధించి తహశీల్దార్లకు త్వరలో లాగిన్లు ఇవ్వనున్నారు. తెల్ల రేషన్ కార్డుకు అర్హత ఉందని భావిస్తే తహశీల్దార్ బాధ్యునిగా ఆ లాగిన్‌లో నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
రేషన్ డిపోలు, ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలో ఉన్న వేబ్రిడ్జిల వద్ద సరుకులను తూకం వేయించి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ పాయింట్ల ద్వారా బస్తాలనే లెక్కవేసి ఇచ్చేవారు. దీని వల్ల తరుగు ఎక్కువగా వచ్చేది. ఇప్పుడా విధానానికి స్వస్తి చెప్పి ఇక నుంచి తూకం వేసి సరుకులను ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఎంఎల్‌ఎస్ పాయింట్ల సమీపంలో ఉన్న వే బ్రిడ్జిలను గుర్తించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ సమర్పించినప్పటికీ సరైన వివరాలు లేకపోవడం వల్ల పలు రేషన్ షాపులకు వాటి పరిధిలోని కార్డులకు సరిపడా సరుకులు ఇవ్వడం లేదు. వీటిని సవరించి, రేషన్ కార్డుల వివరాలను ఆధార్‌తో సహా అందజేస్తే అన్ని రేషన్ షాపుల పరిధిలో ఉన్న కార్డులకు పూర్తి సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
గిరిజన కుటుంబాలకూ ఏఏవై కార్డులు
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గిరిజన కుటుంబాలకు ఊరట లభించనుంది. జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్న బీపీఎల్ కుటుంబాలన్నింటికీ ఏఏవై కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఆయా కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఇప్పటికే కొన్ని కుటుంబాలకు ఏఏవై కార్డులున్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా అన్ని గిరిజన తెగల కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఈ కార్డుల ద్వారా వారికి 35కిలోల బియ్యం అందజేస్తారు. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహశీల్దార్ల ద్వారా అర్హులను గుర్తించనున్నారు.
నేడు డిప్యూటీ తహశీల్దార్లతో సమావేశం :
జిల్లాలో రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కొత్త విధివిధానాలను తెలియచేసేందుకు డీఎస్‌ఓ ఆధ్వర్యంలో గురువారం ఉదయం సివిల్‌సప్లైస్ డీటీలతో సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌లోని డీఎస్‌ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నామని డీఎస్‌ఓ కె నిర్మలాబాయి తెలిపారు.
17వేల రేషన్ కార్డులు రద్దు !
జిల్లాలో 17వేల రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. ఇంత వరకూ వినియోగంలో ఉన్న ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్‌సమర్పించాలని పలుమార్లు అధికారులు సీఎస్‌డీటీలను కోరారు. అయితే ఈ 17 వేల కార్డులకు సంబంధించి అటు వినియోగదారులు కానీ, ఇటు సీఎస్‌డీటీలు గానీ ఆధార్‌కార్డులు ఇవ్వకపోవడంతో వీటిని రద్దు చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈపాస్ విధానాన్ని అమలు చేయనుండడంతో తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలి. అధార్ ఇవ్వని పక్షంలో ఈ 17వేల రేషన్ కార్డులను రద్దు చే స్తారు. ప్రస్తుతం ఈ కార్డులు ఇన్‌ఏక్టివ్‌లో ఉన్నట్టు డీఎస్‌ఓ కె నిర్మలాబాయి తెలిపారు.
పౌరసరఫరాల శాఖలో కొత్త విధానాలు
Published Thu, Mar 19 2015 3:13 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
Advertisement
Advertisement