Drop Boxes
-
ఏం ఇంట్లో చూసినా మందు గోళీలే! పారేస్తే పాతరేసినట్టే! మరేం చేయాలి?
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌కు ముందేమో గాని, తర్వాత ప్రతీ ఇల్లూ చిన్నపాటి క్లినిక్‌లా మారింది. వాడినా, వాడకున్నా రకరకాల మాత్రలు ఇంట్లో పేరుకుంటున్నాయి. అయితే వాడని వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం సరైన పనికాదంటున్నారు వైద్యులు. దానికి బదులుగా వాటిని పడేసేందుకు తొలిసారిగా డ్రాప్ బాక్స్‌లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. జలుబో, జ్వరమో మరొకటో.. చిన్నా చితకా వ్యాధులకు కూడా డాక్టర్ల నుంచి చాంతాడంత మందుల చిట్టీలు తప్పడం లేదు. ఎందుకైనా మంచిదని మనం వాటిని కొనకా తప్పడం లేదు. అయితే సాధారణంగా ఒకటి రెండు రోజులకే స్వస్థత చేకూరిన పరిస్థితిలో మందులు ఆపేసేవారే ఎక్కువ. అలాంటి వాటిలో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా ఉండడం సాధారణమే. వీటిని సరైన పద్ధతిలో నిర్మూలించాలి లేదా గడువు ముగియకపోతే అవసరార్థులకు అందించాలే తప్ప ఎలా పడితే అలా పడేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు. పారేస్తే.. పాతరేసినట్టే.. బెల్జియం లాంటి దేశాల్లో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ విషయంలో కఠినమైన డ్రగ్ పాలసీ ఉంది. అక్కడ వీటిని హానికారక వ్యర్థాల కోవలో లెక్కిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలొస్తాయి. ఉపయోగించనవి, అదనంగా ఉన్నవి నిర్లక్ష్యంగా పారవేయడంతో అవి నీటిలోకి చేరి కెనాల్స్ ద్వారా పంట పొలాల వరకూ చేరుతున్నాయి. దీంతో ఇది అంతిమంగా యాంటీమైక్రోబయాల్ నిరోధకత/యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్)కు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. డ్రాప్ బాక్స్‌ల ఏర్పాటు.. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో నిమ్స్‌కు చెందిన క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ (సీపీటీ) విభాగం ఆస్పత్రి ఆవరణలో రెండు డ్రాప్ బాక్స్‌లను అమర్చింది. అవుట్ పేషెంట్స్ బ్లాక్‌లో, స్పెషాలిటీ బ్లాక్‌లో మరొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. వీటిని చోరుల నుంచి కాపాడే క్రమంలో బాక్స్‌లకు తాళాలు వేశారు. ఆస్పత్రి సిబ్బంది మొదలుకుని, రోగులు, సంబంధీకులు ఎవరైనా సరే ఇంట్లో అనవసరంగా కొనుగోలు చేసిన, ఉపయోగించని లేదా గడువు ముగిసిన యాంటీబయాటిక్స్ ఉన్నట్లయితే ఈ డ్రాప్ బాక్స్‌లో వేయవచ్చని తద్వారా ఈ బాక్స్‌లకు వచ్చే స్పందనను అనుసరించి భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భస్మం.. క్షేమం.. ‘తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే మొదటిది. వీటి ద్వారా హానికారక రసాయనాలు కాలుష్యానికి కారణం కాకుండా నిరోధించవచ్చు’ అని చెప్పారు నిమ్స్ డీన్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.బీరప్ప. ‘డ్రాప్ బాక్స్‌ల ద్వారా పోగుపడిన మందులను సేకరించి వాటిని 1200 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో భస్మం చేయిస్తాం’ అని నిమ్స్ లెర్నింగ్ సెంటర్ ప్రొఫెసర్ సీపీటీ విభాగాధిపతి పి.ఉషారాణి చెప్పారు. -
మీ డాక్యుమెంట్లు భద్రమేనా...
ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనంలో ఆర్థిక లావాదేవీల పాత్ర మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. వ్యక్తుల ఆర్జనా శక్తి పెరిగినందున.. అవసరాలు, ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ప్రాపర్టీలు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు.. లిస్ట్ పెద్దగానే ఉంటుంది. కానీ, వీటికి సంబంధించి డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకుంటున్నామా? తప్పకుండా ఉంచుకోవాలి. వీటికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ఎక్కడ నిల్వ చేస్తున్నారు? సాధారణంగా ఈ డిజిటల్ డాక్యుమెంట్లు మెయిల్ బాక్స్‌లకు వస్తుంటాయి. స్టాక్స్‌లో లావాదేవీలకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఏ రోజుకారోజు మెయిల్ బాక్స్‌కు వస్తుంటాయి. బీమా కంపెనీలు అయితే ప్రస్తుతం ఈ పాలసీ పత్రాలను రిజిస్టర్డ్ ఈ మెయిల్ అడ్రస్‌లకు పంపిస్తున్నాయి. పాలసీ ప్రీమియం సర్టిఫికెట్లను కూడా మెయిల్‌కు పంపిస్తున్నాయి. ఇలా భారీగా వచ్చే డిజిటల్ డాక్యుమెంట్లను ‘డిలీట్’ కొట్టేసేవారూ ఉన్నారు. కానీ, వేటి అవసరం ఎంత మేరకు అన్నది తెలుసుకోకుండా డిలీట్ చేయవద్దు. ప్రతీ డాక్యుమెంట్‌ను ఎంత కాలం పాటు ఉంచుకోవాలన్నది తెలిస్తే.. అప్పుడు వాటి నిర్వహణ సులువవుతుంది. ఐటీ... ఏటా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడంతో పని అయిపోయిందని భావిస్తే అది తప్పే అవుతుంది. ఆదాయపన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయం, పెట్టుబడులు, ఇతరత్రా వనరుల సమాచారానికి సంబంధించిన ఆధారాలు కూడా మీ వద్ద భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ‘‘పన్ను చెల్లింపుదారు తన పన్ను వివరాలను, ఇందుకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు, ఆధారాలను కనీసం ఏడేళ్లపాటు ఉంచుకోవాలి. ఏడేళ్ల వరకు ఏదేనీ ఆసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను తిరిగి విచారించే అధికారం ఆదాయపన్ను శాఖా అధికారులకు ఉంటుంది’’అని ఎన్ఏ షా అసోసియేట్స్ పార్ట్నర్ గోపాల్ బోహ్రా తెలిపారు. ఒకవేళ గత కాలానికి సంబంధించి రిటర్నుల విషయమై ఏదైనా వివాదం ఆదాయపన్ను శాఖతో నెలకొని ఉంటే.. అది పరిష్కారం అయ్యే వరకు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పకుండా ఉంచుకోవాలని సూచించారు. ‘‘పన్ను చెల్లింపుదారుల ప్రాంగణాల్లో ఆదాయపన్ను శాఖా సోదాలు నిర్వహించినట్టయితే.. ఆ సందర్భంగా రూ.50 లక్షలకు మించి ఆస్తి లేదా ఆదాయాన్ని అసెసింగ్ అధికారి గుర్తించితే, అప్పుడు 10 ఏళ్ల నాటి పాత రికార్డులను కూడా తిరిగి విచారించే అధికారం కలిగి ఉంటారు’’ అని బోహ్రా వివరించారు. విదేశీ మార్గంలో ఆదాయాన్ని కలిగి ఉంటే లేదా విదేశీ ఆస్తి కలిగి ఉంటే సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 17 ఏళ్ల పాటు ఆయా ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆదాయాన్ని దాచిపెట్టినట్టు పన్ను అధికారులు భావిస్తే.. సంబంధిత అసెస్మెంట్ను తిరిగి తెరిచేందుకు చట్ట ప్రకారం వారికి 17 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది. ► బ్యాంకు పత్రాలు రుణాలు తీసుకుని, చెల్లింపులు పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ‘‘రుణాన్ని పూర్తిగా చెల్లించేసినప్పటి నుంచి కనీసం ఎనిమిదేళ్ల పాటు డాక్యుమెంట్లను అలాగే ఉంచుకోవాలి. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఆధారంగా ఇంతకాలం పాటు వాటిని భద్రపరుచుకుంటే సరిపోతుంది’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి సూచించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కూడా బ్యాంకులు ఐదు నుంచి ఎనిమిదేళ్ల పాటు పత్రాలను నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక ఇంత కాలం పాటు రుణాన్ని తీర్చివేసిన ఆధారాలను ఉంచుకుంటే సరిపోతుంది. భద్రత ఎక్కడ..? డాక్యుమెంట్లను నిల్వ చేసుకునేందుకు పలు మార్గాలున్నాయి. మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో పదిలపరుచుకోవచ్చు. లేదంటే పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో క్లౌడ్ స్టోరేజీ సదుపాయాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ముఖ్యమైన పత్రాలను తమ ఈ మెయిల్ బాక్స్‌లోనే ఉంచేస్తుంటారు. ‘‘ఈ మెయిల్లో నిల్వ చేయడం అన్నది భద్రతా పరంగా సురక్షితమైనది కాదు. ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు పాస్‌వర్డ్‌తో వాటికి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. బిట్లాకర్ను ఇందుకు వినియోగించుకోవచ్చు’’ అని ఇన్ఫ్రాసాఫ్ట్ టెక్ ప్రొడక్ట్, ఇన్నోవేషన్ హెడ్ మనోజ్ చోప్రా తెలిపారు. బిట్లాకర్లో ఎన్క్రిప్షన్ సదుపాయం ఉంటుంది. దీంతో ఇందులో నిల్వ చేసుకునే డాక్యుమెంట్లకు రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా క్లౌడ్ రూపంలోనూ డాక్యుమెంట్లను భద్రపరచుకునే అవకాశం ఉంది. గూగుల్ డాక్యుమెంట్స్, ఐక్లౌడ్, డ్రాప్‌బాక్స్ ఇటువంటివే. స్కాన్ చేసిన డాక్యుమెంట్లను వీటిల్లో స్టోర్ చేసుకుని ఎక్కడి నుంచి అయినా తిరిగి పొందొచ్చు. ముఖ్యమైన, అవసరమైన డాక్యుమెంట్లను లోకల్‌గా (కంప్యూటర్లు, డిస్క్‌లు) స్టోర్ చేసుకోవడంతోపాటు.. వాటి బ్యాకప్ తీసుకుని కనీసం రెండు క్లౌడ్ వేదికల్లో అయినా పదిలం చేసుకోవాలని చోప్రా సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజీ లాకర్ కూడా ఇందుకు చక్కని వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ బీమా పాలసీ డాక్యుమెంట్‌తోపాటు, కట్టిన ప్రీమియం రసీదులను కూడా భద్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. దీనివల్ల భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా ఎటువంటి సమస్యలు ఎదురైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ‘‘పన్ను మినహాయింపులు పొందాలని భావిస్తే అందుకు ప్రీమియం చెల్లింపుల రసీదులను సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో అవసరమైతే రిటర్నులతోపాటు జత చేయడానికి వీలుంటుంది’’ అని పాలసీఎక్స్ డాట్ కామ్ సీఈవో నావల్ గోయల్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరి, అందుకు అయ్యే చికిత్సా ఖర్చులను తిరిగి పొందినట్టయితే అందుకు సంబంధించిన పత్రాలను, కారు మరమ్మతులకు చేసుకునే బీమా క్లెయిమ్ ఆధారాలను కూడా దీర్ఘకాలం పాటు భద్రంగా ఉంచుకోవడం అవసరమని గోయల్ సూచించారు. పోర్టబిలిటీ సమయంలో ఇవి ఉపయోగపడతాయన్నారు. బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ఇన్సూరెన్స్ అకౌంట్‌ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ‘‘మీ కుటుంబం, మీకు సంబంధించిన బీమా పత్రాలను ఇందులో భద్రంగా నిల్వ చేసుకోవచ్చు’’ అని చెప్పారు. ► మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో మీకున్న పెట్టుబడుల వివరాలన్నింటినీ ఒకే నివేదిక రూపంలో క్రోడీకరించి ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్) పేరుతో ప్రతీ త్రైమాసికానికి ఇస్తుంటాయి. వీటిని కుటుంబ సభ్యుల్లో ఒకరితో పంచుకునేందుకు గాను ఆటో ఫార్వార్డ్‌ను ఎంచుకోవాలి. ఒక్క మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి అయితే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) నుంచి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ను తీసుకుంటే చాలు. వేతన జీవులు అయితే తమ స్టాక్, మ్యూచువల్ ఫండ్ ఖాతాల స్టేట్మెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్వయం ఉపాధిలో ఉన్న వారు అయితే వీటిని కనీసం ఆరేళ్ల వరకు పదిలంగా ఉంచుకోవడం అవసరం. ► ఇవి చాలా కీలకం ఆస్తుల కొనుగోలు, అమ్మకాల పత్రాలను లావాదేవీ జరిగిన నాటి నుంచి కనీసం ఏడేళ్ల వరకు అయినా ఉంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఆదాయపన్ను శాఖ ఏడేళ్లలోపు ఎప్పుడైనా తిరిగి పరిశీలించే చర్య తీసుకోవచ్చు. ‘‘పన్ను చెల్లింపుదారులు తప్పకుండా డాక్యుమెంట్లను అట్టిపెట్టుకోవాల్సిందే. ఆభరణాల కొనుగోళ్ల రసీదులు, అలాగే పెయింటింగ్, ఇళ్ల మరమ్మతులు, నవీకరణకు చేసే ఖర్చులకు సంబంధించిన ఆధారాలను కూడా ఉంచుకోవాలి. దీంతో ఆయా ఆస్తుల విక్రయం తర్వాత పన్ను తగ్గింపులను ఆదాయపన్ను శాఖ తిరస్కరించదు’’ అని బోహ్రా తెలియజేశారు. ► డిజీలాకర్ ఉచితంగా మీ డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునే వేదిక ఇది. దీంతో భౌతికంగా పత్రాలను ఉంచుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఇందులో స్టోర్ చేసే డేటా, డాక్యుమెంట్లు అంతా క్లౌడ్ రూపంలోనే ఉంటాయి కనుక ఎక్కుడి నుంచి అయిన వాటిని పొందే వెసులుబాటు ఉంటుంది. పీడీఎఫ్, జేపీఈజీ, పీఎన్జీ రూపాల్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై ఈసైన్(ఎలక్ట్రానిక్ రూపంలో సంతకం) చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇవి సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలుగా పనికి వస్తాయి. డిజిలాకర్‌లో అకౌంట్ కోసం మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. ఆధార్ డేటా బేస్‌లో నమోదైన మొబైల్ నంబర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలను జ్టి్టpట://ఛీజీజజీ ౌఛిజ్ఛుట.జౌఠి.జీn/ వెబ్ సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. -
15 రోజులు.. 10 నేరాలు.. 40 లక్షలు!
ఏటీఎంల్లోని డ్రాప్‌బాక్సులు టార్గెట్ చేసిన ఉత్తరాది ముఠా ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రూ.11 లక్షలు సీజ్,మరో రూ.16 లక్షలు ఫ్రీజ్ హైదరాబాద్: నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో ఉన్న డ్రాప్బాక్సుల నుంచి చెక్కులు దొంగిలించడం... వాటిపై ఉన్న వివరాలు మార్చి ముందే తెరిచిన బ్యాంకు ఖాతాల్లో వాటిని డిపాజిట్ చేయడం... ఏటీఎం, ఆన్లైన్ ద్వారా కాజేయడం... ఈ పంథాలో రెచ్చిపోతూ 15 రోజుల వ్యవధిలో 10 నేరాలు చేసి రూ.40 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రామ్‌గోపాల్‌పేట పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.11 లక్షలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాల్లో ఉన్న మరో రూ.16.34 లక్షలు ఫ్రీజ్ చేశామని మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. సైఫాబాద్ ఏసీపీ జె.సురేందర్‌రెడ్డితో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనవివరాలు వెల్లడించారు. ముంబైలో ముఠాగా... రాజస్థాన్‌లోని జాలూర్ ప్రాంతానికి చెందిన మనీష్ గేనారామ్ ప్రజాపతి పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ముంబైకి వలసవెళ్లి అక్కడి ఓ హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేశాడు. ఆ సమయంలోనే ఇతడికి ఉత్తరప్రదేశ్ నుంచి ముంబై వలస వచ్చిన పరేష్ విశాల్కుమార్తో పరిచయమైంది. బీసీఏ పూర్తి చేసిన ఇతడు కొంతకాలం వారణాసిలో ఆధార్ కార్డుల ప్రాజెక్టులో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేశాడు. ‘డ్రాప్‌బాక్సు’ల్ని టార్గెట్ చేసుకుంటే తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని ప్రజాపతికి సలహా ఇచ్చాడు. దీంతో రాజస్థాన్, బీహార్, మహారాష్ట్రల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ముంబైలోనే స్థిరపడిన హర్చంద్రామ్, గుల్షన్, చెలారామ్, మనీష్గుప్తాలతో ముఠా ఏర్పాటు చేసిన ప్రజాపతి రంగంలోకి దిగాడు. గుల్షన్ ప్రోద్బలంతో నగరానికి వచ్చిన ముఠా ఓల్డ్ బోయగూడ, విఠల్వాడీల్లో వ్యాపారస్థులమంటూ రెండు ఖరీదైన ఇళ్లను ‘అగ్రిమెంట్’పై అద్దెకు తీసుకుంది. ఈ అగ్రిమెంట్లతో పాటు తమ గుర్తింపుకార్డుల్ని వినియోగించిన విశాల్, మనీష్‌లు నగరంలోని 14 బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వీరు డ్రాప్ బాక్స్‌లు పగులగొట్టి చెక్కులు తస్కరిస్తారు. వీటిలో కంపెనీల పేరుతో ఉన్న వాటిని ఎంచుకుని, ఆ చెక్కులపై సంతకం, నగదు మినహా మిగతా వివరాలను బ్లేడు, ఎరేజర్ సాయంతో తుడిచేస్తారు. రంగు పెన్సిళ్లు, పెన్నులు వినియోగించి చేతి రాత సరిపోలేలా తమ పేర్లు రాసుకుంటారు. ఇవి అకౌంట్ పెయిడ్ చెక్కులు కావడంతో తన ఖాతాల్లోకి డిపాజిట్ చేసి ఏటీఎంల ద్వారా నగదు డ్రా చేయడం, కార్డు ద్వారా బంగారం వంటివి ఖరీదు చేయడం చేసి అంతా పంచుకుంటారు. ఫిర్యాదుతో కదలిక... గత నెల 6న హార్డ్‌వేర్ వ్యాపారి ఎస్.కిరణ్‌కుమార్ సత్యవరపు హార్డ్‌వేర్ సంస్థకు చెల్లించడానికి రూ.2.66 లక్షలు చెక్కు రావ్గోపాల్పేటలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలోని డ్రాప్‌బాక్సులో వేశారు. ఈ చెక్కుకు సంబంధించిన నగదు సికింద్రాబాద్‌లోని ఎంజీరోడ్‌లో ఉన్న యుకో బ్యాంకు నుంచి పరేష్ విశాల్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలోకి వెళ్లిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాటి నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ తరహా కేసులు నగరంలో మరో 9 నమోదయ్యాయి. దీంతో ఆర్ పేట ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్, అదనపు ఇన్స్పెక్టర్ బి.జానయ్య, ఎస్సై ఎస్.సైదులు గౌడ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిఘా పెరిగే అవకాశం ఉందని భావించిన ముఠా... చెన్నై, ముంబైలకు వెళ్లి ఈ తరహా నేరాలు కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈలోపు పోలీసులు మంగళవారం బోయగూడ, విఠల్వాడీల్లోని ఇళ్లతో పాటు మరో డెన్‌లో దాడి చేశారు. ప్రజాపతి, విశాల్, హర్చంద్ చిక్కగా... మిగలినవారు పరారయ్యారు. బాధితులు ఉంటే తమను సంప్రదించాలని డీసీపీ కమలాసన్‌రెడ్డి కోరారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. -
పౌరసరఫరాల శాఖలో కొత్త విధానాలు
విజయనగరం కంటోన్మెంట్:పౌరసరఫరాల శాఖలో కొత్త విధానాలను అమలు చేయనున్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. రేషన్ డిపోలకు తూకం సరిగా అప్పగించడంతో పాటు కొత్త రేషన్ కార్డులకు తహశీల్దార్లకు లాగిన్లు ఇవ్వనున్నా రు. అస్తవ్యస్తంగా ఉన్న రేషన్ విధానాన్ని సమూలంగా మా ర్చేం దుకు సివిల్ సప్లైస్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలమేరకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,05,592 రేషన్ కార్డులున్నాయి. ఇందులో 44,296 పింక్ కారు ్డలు, 6,61,296 తెల్లకార్డులున్నాయి. అయితే చాలా తెల్లకార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నాయి. జిల్లాలో పలువురు భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, రోజుకు లక్షలాది రూపాయల లావాదేవీలు నడిపే వ్యాపారస్తులు తెల్లరేషన్ కార్డులను కలిగిఉన్నారు. ఇందులో కొంత మంది స్వతహాగా ధనికులు, మరికొంత మంది తెల్ల రేషన్ కార్డులు పొందాక బాగా అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. అయితే తెల్ల రేషన్ కార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే పరిస్థితి లేదు. దీంతో అనర్హులు స్వచ్ఛందంగా రేషన్‌కార్డులు అప్పంగించేలా ఈ ఏడాది కొత్తగా అధికారులు డ్రాప్ బాక్స్ విధానాన్ని అమలుచేయనున్నారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఈ డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తారు. తెల్ల రేషన్ కార్డులను సరెండర్ చేసే వారు వచ్చి ఈ బాక్స్‌లో తమ కార్డు వేస్తే, ఆ కార్డులను రద్దు చేసి అదేస్థానంలో వారికి పింక్ కార్డులు ఇస్తారు. దీంతో చాలా వరకూ బోగస్ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉండొచ్చని సివిల్ సప్లై అధికారులు భావిస్తున్నారు. మరో పక్క కొత్తగా తెల్ల రేషన్ కార్డులు మంజూరు కోసం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ విధానానికి సంబంధించి తహశీల్దార్లకు త్వరలో లాగిన్లు ఇవ్వనున్నారు. తెల్ల రేషన్ కార్డుకు అర్హత ఉందని భావిస్తే తహశీల్దార్ బాధ్యునిగా ఆ లాగిన్‌లో నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ డిపోలు, ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలో ఉన్న వేబ్రిడ్జిల వద్ద సరుకులను తూకం వేయించి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ పాయింట్ల ద్వారా బస్తాలనే లెక్కవేసి ఇచ్చేవారు. దీని వల్ల తరుగు ఎక్కువగా వచ్చేది. ఇప్పుడా విధానానికి స్వస్తి చెప్పి ఇక నుంచి తూకం వేసి సరుకులను ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్ల సమీపంలో ఉన్న వే బ్రిడ్జిలను గుర్తించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ సమర్పించినప్పటికీ సరైన వివరాలు లేకపోవడం వల్ల పలు రేషన్ షాపులకు వాటి పరిధిలోని కార్డులకు సరిపడా సరుకులు ఇవ్వడం లేదు. వీటిని సవరించి, రేషన్ కార్డుల వివరాలను ఆధార్‌తో సహా అందజేస్తే అన్ని రేషన్ షాపుల పరిధిలో ఉన్న కార్డులకు పూర్తి సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గిరిజన కుటుంబాలకూ ఏఏవై కార్డులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గిరిజన కుటుంబాలకు ఊరట లభించనుంది. జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్న బీపీఎల్ కుటుంబాలన్నింటికీ ఏఏవై కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఆయా కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఇప్పటికే కొన్ని కుటుంబాలకు ఏఏవై కార్డులున్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా అన్ని గిరిజన తెగల కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఈ కార్డుల ద్వారా వారికి 35కిలోల బియ్యం అందజేస్తారు. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహశీల్దార్ల ద్వారా అర్హులను గుర్తించనున్నారు. నేడు డిప్యూటీ తహశీల్దార్లతో సమావేశం : జిల్లాలో రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కొత్త విధివిధానాలను తెలియచేసేందుకు డీఎస్ఓ ఆధ్వర్యంలో గురువారం ఉదయం సివిల్‌సప్లైస్ డీటీలతో సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టరేట్లోని డీఎస్ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నామని డీఎస్ఓ కె నిర్మలాబాయి తెలిపారు. 17వేల రేషన్ కార్డులు రద్దు ! జిల్లాలో 17వేల రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. ఇంత వరకూ వినియోగంలో ఉన్న ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్సమర్పించాలని పలుమార్లు అధికారులు సీఎస్డీటీలను కోరారు. అయితే ఈ 17 వేల కార్డులకు సంబంధించి అటు వినియోగదారులు కానీ, ఇటు సీఎస్డీటీలు గానీ ఆధార్‌కార్డులు ఇవ్వకపోవడంతో వీటిని రద్దు చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈపాస్ విధానాన్ని అమలు చేయనుండడంతో తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలి. అధార్ ఇవ్వని పక్షంలో ఈ 17వేల రేషన్ కార్డులను రద్దు చే స్తారు. ప్రస్తుతం ఈ కార్డులు ఇన్ఏక్టివ్లో ఉన్నట్టు డీఎస్ఓ కె నిర్మలాబాయి తెలిపారు.