15 రోజులు.. 10 నేరాలు.. 40 లక్షలు! | 10 .. 40 million crimes in 15 days | Sakshi
Sakshi News home page

15 రోజులు.. 10 నేరాలు.. 40 లక్షలు!

Published Thu, Mar 3 2016 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

15 రోజులు.. 10 నేరాలు.. 40 లక్షలు!

15 రోజులు.. 10 నేరాలు.. 40 లక్షలు!

ఏటీఎంల్లోని డ్రాప్‌బాక్సులు
టార్గెట్ చేసిన ఉత్తరాది ముఠా
ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు  
రూ.11 లక్షలు సీజ్,మరో రూ.16 లక్షలు ఫ్రీజ్  

 
హైదరాబాద్: నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో ఉన్న డ్రాప్‌బాక్సుల నుంచి చెక్కులు దొంగిలించడం... వాటిపై ఉన్న వివరాలు మార్చి ముందే తెరిచిన బ్యాంకు ఖాతాల్లో వాటిని డిపాజిట్ చేయడం... ఏటీఎం, ఆన్‌లైన్ ద్వారా కాజేయడం... ఈ పంథాలో రెచ్చిపోతూ 15 రోజుల వ్యవధిలో 10 నేరాలు చేసి రూ.40 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రామ్‌గోపాల్‌పేట పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.11 లక్షలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాల్లో ఉన్న మరో రూ.16.34 లక్షలు ఫ్రీజ్ చేశామని మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. సైఫాబాద్ ఏసీపీ జె.సురేందర్‌రెడ్డితో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనవివరాలు వెల్లడించారు.

ముంబైలో ముఠాగా...
రాజస్థాన్‌లోని జాలూర్ ప్రాంతానికి చెందిన మనీష్ గేనారామ్ ప్రజాపతి పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ముంబైకి వలసవెళ్లి అక్కడి ఓ హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేశాడు. ఆ సమయంలోనే ఇతడికి ఉత్తరప్రదేశ్ నుంచి ముంబై వలస వచ్చిన పరేష్ విశాల్‌కుమార్‌తో పరిచయమైంది. బీసీఏ పూర్తి చేసిన ఇతడు కొంతకాలం వారణాసిలో ఆధార్ కార్డుల ప్రాజెక్టులో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేశాడు. ‘డ్రాప్‌బాక్సు’ల్ని టార్గెట్ చేసుకుంటే తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని ప్రజాపతికి సలహా ఇచ్చాడు. దీంతో రాజస్థాన్, బీహార్, మహారాష్ట్రల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ముంబైలోనే స్థిరపడిన హర్‌చంద్‌రామ్, గుల్షన్, చెలారామ్, మనీష్‌గుప్తాలతో ముఠా ఏర్పాటు చేసిన ప్రజాపతి రంగంలోకి దిగాడు. గుల్షన్ ప్రోద్బలంతో నగరానికి వచ్చిన ముఠా ఓల్డ్ బోయగూడ, విఠల్‌వాడీల్లో వ్యాపారస్థులమంటూ రెండు ఖరీదైన ఇళ్లను ‘అగ్రిమెంట్’పై అద్దెకు తీసుకుంది. ఈ అగ్రిమెంట్లతో పాటు తమ గుర్తింపుకార్డుల్ని వినియోగించిన విశాల్, మనీష్‌లు నగరంలోని 14 బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు.

వీరు డ్రాప్ బాక్స్‌లు పగులగొట్టి చెక్కులు తస్కరిస్తారు. వీటిలో కంపెనీల పేరుతో ఉన్న వాటిని ఎంచుకుని, ఆ చెక్కులపై సంతకం, నగదు మినహా మిగతా వివరాలను బ్లేడు, ఎరేజర్ సాయంతో తుడిచేస్తారు. రంగు పెన్సిళ్లు, పెన్నులు వినియోగించి చేతి రాత సరిపోలేలా తమ పేర్లు రాసుకుంటారు. ఇవి అకౌంట్ పెయిడ్ చెక్కులు కావడంతో తన ఖాతాల్లోకి డిపాజిట్ చేసి ఏటీఎంల ద్వారా నగదు డ్రా చేయడం, కార్డు ద్వారా బంగారం వంటివి ఖరీదు చేయడం చేసి అంతా పంచుకుంటారు.
 
ఫిర్యాదుతో కదలిక...
గత నెల 6న హార్డ్‌వేర్ వ్యాపారి ఎస్.కిరణ్‌కుమార్ సత్యవరపు హార్డ్‌వేర్ సంస్థకు చెల్లించడానికి రూ.2.66 లక్షలు చెక్కు రావ్‌గోపాల్‌పేటలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలోని డ్రాప్‌బాక్సులో వేశారు. ఈ చెక్కుకు సంబంధించిన నగదు సికింద్రాబాద్‌లోని ఎంజీరోడ్‌లో ఉన్న యుకో బ్యాంకు నుంచి పరేష్ విశాల్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలోకి వెళ్లిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాటి నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ తరహా కేసులు నగరంలో మరో 9 నమోదయ్యాయి. దీంతో ఆర్ పేట ఇన్‌స్పెక్టర్ వహీదుద్దీన్, అదనపు ఇన్‌స్పెక్టర్ బి.జానయ్య, ఎస్సై ఎస్.సైదులు గౌడ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిఘా పెరిగే అవకాశం ఉందని భావించిన ముఠా... చెన్నై, ముంబైలకు వెళ్లి ఈ తరహా నేరాలు కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈలోపు పోలీసులు మంగళవారం బోయగూడ, విఠల్‌వాడీల్లోని ఇళ్లతో పాటు మరో డెన్‌లో దాడి చేశారు. ప్రజాపతి, విశాల్, హర్‌చంద్ చిక్కగా... మిగలినవారు పరారయ్యారు. బాధితులు ఉంటే తమను సంప్రదించాలని డీసీపీ కమలాసన్‌రెడ్డి కోరారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement