ration depot
-
ఖర్చు సొసైటీది.. ఆదాయం టీడీపీది
సాక్షి, పశ్చిమగోదావరి(పెరవలి) : అన్నవరప్పాడు రేషన్ డిపో వ్యవహారంలో తవ్వేకొలదీ అనేక నిజాలు వెలుగుచూస్తున్నాయి. టీడీపీ పాలనలో ఎలా దోచుకున్నదీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సొసైటీ ముసుగులో రేషన్ డిపోను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టి ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ఇటీవల సొసైటీ కమిటీ అధ్యక్షుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది. దాంతో గత టీడీపీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రేషన్ డిపోద్వారా ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ద్వారా నెలకు రూ.29 వేలు వస్తుంటే ఒక్కరూపాయి కూడా సొసైటీ నిధులకు జమచేయకుండా మొత్తం టీడీపీ నాయకులు బొక్కేశారు. రేషన్ డిపో నిర్వహణ అంతా సొసైటీ భవనాల్లో సిబ్బందిని వినియోగించి చేసినా కేవలం సొసైటీ భవనానికి అద్దె రూపంగా కేవలం నెలకు రూ.100 మాత్రమే జమ చేశారంటే దోపిడీ ఏస్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సరుకుల పంపిణీ కోసం ఈ ఐదేళ్లలో సిబ్బందికి జీతాల రూపేణా రూ.9 లక్షలు ఇస్తే, సొసైటీకి కేవలం రూ.6 వేలు అద్దె రూపేణా జమచేశారు. ఒక రేషన్ డిపోకు కమీషన్‌గా ఐదేళ్లకు రూ.17.40 లక్షల ఆదాయం వచ్చింది. దీనిలో కేవలం అద్దె రూపేణా రూ. 6వేలు సొసైటీకి జమచేసి మిగిలినదంతా టీడీపీ నేతలు స్వాహా చేశారు. 2014లో సొసైటీ చేతిలోకి రేషన్ డిపో అన్నవరప్పాడులో రేషన్ డిపో 2014 వరకు ప్రైవేట్ రేషన్ డీలర్ అధీనంలో ఉండేది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నాయకులే డీలర్ అవకతవకలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసి అతనిని తొలగించి మల్లేశ్వరం సొసైటీకి బాధ్యతలు అప్పగించారు. వీరు అన్నవరప్పాడు సొసైటీలో డిపో ఏర్పాటు చేసి అప్పటి నుంచి 2017వరకు కొనసాగించారు. అనంతరం తాము నిర్వహించలేమని మల్లేశ్వరం సొసైటీ లిఖిత పూర్వకంగా అధికారులకు తెల్పడంతో ఆ తరువాత పిట్టల వేమవరం, ఖండవల్లి డీలర్లకు అప్పగించారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి తమకు తాత్కలికంగా డిపోను అప్పగించాలని కోరారు. ఎమ్మెల్యే ఆర్డీఓపై ఒత్తిడి తేవడంతో గ్రామానికి చెందిన బళ్ల లీలాకృష్ణ పేరున 2018 ఏప్రిల్‌లో తాత్కాలిక పర్మిట్ ఒక ఏడాదికి అనుమతులు ఇచ్చారు. ఈ గడువు 2019 మార్చితో ముగిసినా నేటికీ ముగిసిన పర్మిట్‌తోనే టీడీపీ నేతలు దోచేస్తున్నారు. మామూళ్లమత్తులో అధికారులు ఈ రేషన్ డిపోకి 2019 మార్చి నెలాఖరుతో పర్మిషన్ ముగిసినా కాసులకు కక్కుర్తి పడిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆ పర్మిషన్‌తోనే నేటికీ డిపోను నడుపుతున్నారు. ఇందుకు సివిల్ సప్లయ్ అధికారికి భారీ స్థాయిలో ముడుపులు అందడం వల్లే గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. నష్టాలో ఊబిలో సొసైటీ ఈ రేషన్ డిపో ద్వారా సొసైటీకి ఆదాయం రూ.6 వేలు ఉంటే రేషన్ డిపోను నిర్వహించిన సిబ్బందికి జీతాల కింద రూ.9 లక్షలు ఖర్చయింది. దీంతో సొసైటీపై ఆర్థిక భారం పడి నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఈ సొసైటీకి 2014 వరకు ఎరువుల అమ్మకాలతో ఎంతో కోలాహలంగా ఉండేది. టీడీపీ హయాంలో ఎరువుల అమ్మకాలు పూర్తిగా మాని వేయడంతో సిబ్బందికి పనిలేకపోయినా జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త పాలకవర్గం రావడంతో వెలుగులోకి ఈ రేషన్ డిపో సొసైటీలో ఏర్పాటు చేసి దీనిని సొసైటీ సిబ్బందితో నిర్వహించడంతో గ్రామంలో ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఈ దోపిడీ వ్యవహారం కొనసాగింది. ఇటీవల సొసైటీ అధ్యక్షుల పదవీ కాలం పూర్తవ్వడంతో ప్రభుత్వం నూతన కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో కొత్త అధ్యక్షులు బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈడిపో పేరిట దోచేసిన వైనాన్ని ఎమ్మెల్యే దృష్టికి, అక్కడ నుండి మండల, జిల్లా సివిల్ సప్లయ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై సొసైటీ అధ్యక్షుడు పంతం నాగేశ్వరరావుని వివరణ కోరగా తాను సొసైటీ అధ్యక్షుడిగా జూలై 31న బాధ్యతలు చేపట్టానని, సెప్టెంబర్‌లో రేషన్ డిపోకి సంబంధించిన సరుకులకు డీడీ కట్టాలని కార్యదర్శిని అడిగితే డిపోకు, మనకు సంబంధం లేదని చెప్పినట్టు వివరించారు. సంబంధం లేనప్పుడు మన సిబ్బంది ఎలా పనిచేస్తారని నిలదీయడంతో పాటు జీతాలు ఎవరు ఇచ్చారని ప్రశ్నించడంతో అప్పటి అధ్యక్షుడు చెప్పింది చేశామని తెల్పడంతో వ్యవహారం బయటపడిందన్నారు. ఈఐదేళ్లలో సిబ్బందికి నెలకు రూ.15 వేలు చొప్పున జీతం ఇచ్చారని తెలిపారు. -
అందని రేషన్ కంది
కందిపప్పు ధర భారీగా పెంపు కార్డుహోల్డర్లకు శిరోభారం రూ.4.50కోట్లు భారం సర్వర్లకు చేరని కొత్తరేటు ఆదిలోనే నిలిచిన సరఫరా విశాఖపట్నం : కందిపప్పు ధర బయటమార్కెట్లో హడలెత్తిస్తోంది. దీంతో ధర సాకుగా చూపి రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేసే కందిపప్పు ధరను ప్రభుత్వం కూడా పెంచేసింది. పోనీ పెరిగిన ధరకైనా తీసుకుందామనుకుంటే ఈపాస్ యంత్రాల్లో కందిధర చేర్చలేదంటూ సరఫరా నిలిపివేశారు. దీంతో ధర పెరిగినా సరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం జిల్లాలో 10,10,770 తెల్లకార్డులు, 77,167 అంత్యోదయ అన్న యోజన కార్డులు, 1035 అన్నపూర్ణ కార్డులున్నాయి. గతంలో ఈ కార్డులకు బియ్యం, కిరోసిన్‌తో పాటు తొమ్మిది రకాల నిత్యావసరాలను రూ.185 లకే సరఫరా చేసేవారు. ఎప్పటి నుంచో ఇస్తున్న కందిపప్పు, గోధుమ పిండి, గోదాముల సరఫరాలను గతేడాది నుంచి నిలిపివేశారు. కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్‌లకే పరిమితం చేశారు. అది కూడా అరకిలో పంచదార, లీటర్ కిరోసిన్‌కు కుదించేశారు. బహిరంగ మార్కెట్లో ధర ఎంత ఉన్నా సంబంధం లేకుండా మూడేళ్లుగా ఒకే రీతిలో కిలో రూ.50లకే రేషన్ డిపోలద్వారా బీపీఎల్ కార్డుదారులకు సరఫరా చేసేవారు. టెండర్లు ఖరారు కాలేదంటూ ఆర్నెల్లుగా నిలిపివేసిన కందిపప్పు సరఫరా గత నెలలోనే పునరుద్ధరించారు. ప్రస్తుతం కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ.200లకు చేరింది. సబ్సిడీ కందిపప్పు ధర కూడా ప్రభుత్వం పెంచేసింది. ఈ నెల నుంచి కార్డుకు కిలో రూ.90లకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు కిలో రూ.50ల చొప్పున జిల్లా లోని రేషన్‌కార్డుదారులు రూ.5.34కోట్ల భారం పడేది. నవంబర్ నుంచి కిలోరూ.90కు పెంచడంతో కిలోపై రూ.40ల మేర అదనపు భారంపడింది. బహిరంగమార్కెట్లో బెంబేలెత్తిస్తున్నధరతో రేషన్ కార్డు దారులు విధిగా రేషన్‌డిపోల ద్వారా సరఫరాచేసే కందిపప్పు ఎలా ఉన్నా తీసుకుంటున్నారు. పెరిగినధర పుణ్యమాని కార్డుదారులపై అదనంగా రూ.4.50 కోట్ల మేర భారం పడుతుండడం పట్ల సామాన్యులు గగ్గోలు పెడుతు న్నారు. కందిపప్పు ధర ఈపాస్ యంత్రాల్లో చేర్చలేదేనే సాకుతో నవంబర్ 2 నుంచి అర్ధాతరంగా సరఫరా నిలిపివేశారు. దీనికి తోడు సర్వర్లు డౌన్ కావడంతో ఈపాస్ యంత్రాలు సరిగా పనిచేయడం లేదు. కందిపప్పే కాదు.. చివరకు బియ్యం, ఇతర నిత్యావసరాల సరఫరాలో కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. జిల్లాలో ఈపాస్ అమలు చేస్తున్న షాపులకు ప్రతీరోజూ వచ్చే కార్డుదారుల్ల్లో కనీసం 15 శాతానికి మించి పంపిణీ జరగకపోవడంతో వచ్చే లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. -
డీలర్లతో పరేషన్
వీరఘట్టం: రాష్ట్ర ప్రభుత్వం తీరుపై రేషన్ డీలర్లు గుర్రుమంటున్నారు. కనీస వేతనం ఇవ్వకుండా తమచే అధికంగా పనిచేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతంతమాత్రంగా శిక్షణ ఇచ్చి ఈ-పాస్ యంత్రాలతో సరుకులు పంపిణీ చేయమనడంతో సతమతమవుతున్నారు. జిల్లాలో 1990 రేషన్ డిపోలు ఉన్నాయి. వీటి ద్వారా 7,57,499 తెలుపు, ర్యాప్, ట్యాప్, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుదారులకు ప్రతినెల రేషన్ సరుకులు పంపిణీ చేయాలి. ప్రతి కార్డుదారునికి సక్రమంగా సరుకులు అందాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ-పాస్ యంత్రాలను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా లబ్ధిదారులకు మేలు జరగగా, మిగులు సరుకుల వల్ల సర్కారుకు ఆదాయం చేకూరుతుంది. ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినప్పటికీ రేషన్ డీలర్లకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ-పాస్ విధానమే డీలర్లను సమ్మెకు పురిగొల్పిందని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. ఈ-పాస్ మిషన్లు మొరాయించడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. నెలనెలా సరుకులు ఇచ్చేందుకు సర్వర్ పనిచేయకపోవటంతో వినియోగదారులతో పాటు డీలర్లు విసుగుచెందుతున్నారు. తమ సమయం వృథా అవుతుందని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనం రూ. 15 వేలు ఇవ్వాలి ప్రతి డీలర్‌కు నెలకు రూ. 15 వేలు వేతనాన్ని సర్కారు ఇవ్వకపోతే ఉద్యమం తప్పదు. ఈ-పాస్ యంత్రాలతో సరుకుల అమ్మకంలో పర్సంటేజ్ ఇవ్వాల్సిందే. బియ్యంలో తరుగు శాతం కేటాయింపును అమలు చేయాలి. మా కుటుంబాలకు గ్రూప్ బీమా చేయించాలి. - కె.వెంకటరావు, డీలర్ల సంఘ నాయకుడు, తలవరం సమస్యలు పరిష్కరించండి ఈ-పాస్ యంత్రాలతో రేషన్ సరుకులను ఇవ్వటం ప్రారంభించాక రేయింబవళ్లు పనిచేస్తున్నాం. షాపు అద్దె, సహాయకుని జీతం, కరెంటు బిల్లులతో చేతిచమురు వదులుతోంది. సమస్యలు అధికమవుతున్నాయి. వీటి పరిష్కారానికి చొరవ చూపాలి. - నత్తల దాలయ్య, డీలర్ల సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ఇవీ డీలర్ల సమస్యలు 51 కిలోల బస్తాకు బదులు 47-48 కిలోల బస్తాల చొప్పున దిగుమతి చేస్తున్నారు. షుగర్ ప్యాకెట్లు అన్ని పగిలిపోతున్నాయి. ఇవి కాటా ప్రకారం కార్డుదారులకు అప్పగించాల్సిందే. చాలా మంది వినియోగదారుల ఆధార్ నంబర్లు ఈ-పాస్ యంత్రాల్లో కనిపించడం లేదు. మ్యాన్యువల్‌గా రోజుకు 100 మంది వినియోగదారులకు రేషన్ సరుకులు ఇచ్చే డీలరు ఈ-పాస్ యంత్రంతో 30 మందికి కూడా ఇవ ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ-పాస్ యంత్రాల నిర్వహణపై అంతంతమాత్రంగా శిక్షణ ఇవ్వడంతో డీలర్లు వీటిని పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోతున్నారు. -
జూలై నుంచి ఈ-పాస్ విధానం !
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని రేషన్ డిపోల్లో ఈ పాస్ విధానం ద్వారా లబ్ధిదారులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసే ప్రక్రియ జూలై నెల నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 242 డిపోల్లో ఈ-పాస్ విధానం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి సరుకులను అందజేస్తున్నారు. అయితే ఈ విధానం ఇంకా పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదు. వేలుముద్రలు సక్రమంగా పడకపోవడం, నెట్వర్క్ సమస్య, ఇతర సమస్యలు వేధించాయి. వాటిని తాత్కాలికంగా సరిచేసినా సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. దీంతో పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియను వచ్చే నెల నుంచి అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం మరో 1721 ఈ-పాస్ మిషన్లు జిల్లాకు వచ్చాయి. వీటికి సంబంధించిన నెట్‌వర్క్‌ను ఏపీ ఆన్లైన్ ద్వారా సిద్ధం చేసి అమల్లోకి తీసుకురానున్నారు. అయితే ఈ విధానం పూర్తిగా సక్సెస్ కావాలంటే శతశాతం రేషన్ కార్డులు, అందులోని అన్ని యూనిట్లకి ఆధార్ ఆనుసంధానం కావాలి. అయితే వివిధ కారణాలతో ఇప్పటికీ ఆధార్ అనుసంధానం కొన్నిప్రాంతాల్లో శత శాతం జరగలేదు. జిలాల్లో 1961 రేషన్ డిపోలు ఉండగా, వచ్చేనెల నుంచి అన్ని డిపోల్లోనూ ఈ పాస్ మిషన్లు అమలులోకి రానున్నాయి. 4,36,052 యూనిట్లు గల్లంతు! జిల్లాలోని రేషన్‌కార్డులకు సంబంధించి 4,36,052 యూనిట్లు గల్లంతాయ్యాయి. వివిధ కారణాలతో వీటికి సంబంధించిన రేషన్ సరుకులు విడుదలయ్యే పరిస్థితి లేదు. ఈ-పాస్ విధానంలో వీరంతా ఈ ప్రయోజనాన్ని సష్టపోతున్నారు. జిల్లాలో 7,81,448 కార్డులు ఉండగా, వీటిలో 26,99,613 యూనిట్లు ఉన్నాయి. వీటిలో 22,92,803 యూనిట్లకి ఆధార్ అనుసంధానం చేశారు. అన్ సీడెడ్ యూనిట్లు 21,950 ఉండగా, ఆధార్ నిర్థారణ లేక 53,000 యూనిట్లు పెండింగ్‌లో ఉండగా, పూర్తిగా తిరస్కరించిన యూనిట్లు 3,62,102 ఉన్నాయి. వీరికి రేషన్ విడుదల అయ్యే అవకాశం లేదు, 96 శాతం ఆధార్ అనుసంధానం జిల్లా వ్యాప్తంగా సగటునా 96.79 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం జరిగింది. సారవకోట, ఎల్‌ఎన్‌పేట, పొందూరు, హిరమండలం, సరుబుజ్జిలిలో 94 శాతం అనుసంధానం జరగ్గా, పాలకొండలో 93 శాతం ఉంది. -
పౌరసరఫరాల శాఖలో కొత్త విధానాలు
విజయనగరం కంటోన్మెంట్:పౌరసరఫరాల శాఖలో కొత్త విధానాలను అమలు చేయనున్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. రేషన్ డిపోలకు తూకం సరిగా అప్పగించడంతో పాటు కొత్త రేషన్ కార్డులకు తహశీల్దార్లకు లాగిన్లు ఇవ్వనున్నా రు. అస్తవ్యస్తంగా ఉన్న రేషన్ విధానాన్ని సమూలంగా మా ర్చేం దుకు సివిల్ సప్లైస్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలమేరకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,05,592 రేషన్ కార్డులున్నాయి. ఇందులో 44,296 పింక్ కారు ్డలు, 6,61,296 తెల్లకార్డులున్నాయి. అయితే చాలా తెల్లకార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నాయి. జిల్లాలో పలువురు భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, రోజుకు లక్షలాది రూపాయల లావాదేవీలు నడిపే వ్యాపారస్తులు తెల్లరేషన్ కార్డులను కలిగిఉన్నారు. ఇందులో కొంత మంది స్వతహాగా ధనికులు, మరికొంత మంది తెల్ల రేషన్ కార్డులు పొందాక బాగా అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. అయితే తెల్ల రేషన్ కార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే పరిస్థితి లేదు. దీంతో అనర్హులు స్వచ్ఛందంగా రేషన్‌కార్డులు అప్పంగించేలా ఈ ఏడాది కొత్తగా అధికారులు డ్రాప్ బాక్స్ విధానాన్ని అమలుచేయనున్నారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఈ డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తారు. తెల్ల రేషన్ కార్డులను సరెండర్ చేసే వారు వచ్చి ఈ బాక్స్‌లో తమ కార్డు వేస్తే, ఆ కార్డులను రద్దు చేసి అదేస్థానంలో వారికి పింక్ కార్డులు ఇస్తారు. దీంతో చాలా వరకూ బోగస్ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉండొచ్చని సివిల్ సప్లై అధికారులు భావిస్తున్నారు. మరో పక్క కొత్తగా తెల్ల రేషన్ కార్డులు మంజూరు కోసం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ విధానానికి సంబంధించి తహశీల్దార్లకు త్వరలో లాగిన్లు ఇవ్వనున్నారు. తెల్ల రేషన్ కార్డుకు అర్హత ఉందని భావిస్తే తహశీల్దార్ బాధ్యునిగా ఆ లాగిన్‌లో నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ డిపోలు, ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలో ఉన్న వేబ్రిడ్జిల వద్ద సరుకులను తూకం వేయించి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ పాయింట్ల ద్వారా బస్తాలనే లెక్కవేసి ఇచ్చేవారు. దీని వల్ల తరుగు ఎక్కువగా వచ్చేది. ఇప్పుడా విధానానికి స్వస్తి చెప్పి ఇక నుంచి తూకం వేసి సరుకులను ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్ల సమీపంలో ఉన్న వే బ్రిడ్జిలను గుర్తించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ సమర్పించినప్పటికీ సరైన వివరాలు లేకపోవడం వల్ల పలు రేషన్ షాపులకు వాటి పరిధిలోని కార్డులకు సరిపడా సరుకులు ఇవ్వడం లేదు. వీటిని సవరించి, రేషన్ కార్డుల వివరాలను ఆధార్‌తో సహా అందజేస్తే అన్ని రేషన్ షాపుల పరిధిలో ఉన్న కార్డులకు పూర్తి సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గిరిజన కుటుంబాలకూ ఏఏవై కార్డులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గిరిజన కుటుంబాలకు ఊరట లభించనుంది. జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్న బీపీఎల్ కుటుంబాలన్నింటికీ ఏఏవై కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఆయా కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఇప్పటికే కొన్ని కుటుంబాలకు ఏఏవై కార్డులున్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా అన్ని గిరిజన తెగల కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఈ కార్డుల ద్వారా వారికి 35కిలోల బియ్యం అందజేస్తారు. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహశీల్దార్ల ద్వారా అర్హులను గుర్తించనున్నారు. నేడు డిప్యూటీ తహశీల్దార్లతో సమావేశం : జిల్లాలో రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కొత్త విధివిధానాలను తెలియచేసేందుకు డీఎస్ఓ ఆధ్వర్యంలో గురువారం ఉదయం సివిల్‌సప్లైస్ డీటీలతో సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టరేట్లోని డీఎస్ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నామని డీఎస్ఓ కె నిర్మలాబాయి తెలిపారు. 17వేల రేషన్ కార్డులు రద్దు ! జిల్లాలో 17వేల రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. ఇంత వరకూ వినియోగంలో ఉన్న ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్సమర్పించాలని పలుమార్లు అధికారులు సీఎస్డీటీలను కోరారు. అయితే ఈ 17 వేల కార్డులకు సంబంధించి అటు వినియోగదారులు కానీ, ఇటు సీఎస్డీటీలు గానీ ఆధార్‌కార్డులు ఇవ్వకపోవడంతో వీటిని రద్దు చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈపాస్ విధానాన్ని అమలు చేయనుండడంతో తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలి. అధార్ ఇవ్వని పక్షంలో ఈ 17వేల రేషన్ కార్డులను రద్దు చే స్తారు. ప్రస్తుతం ఈ కార్డులు ఇన్ఏక్టివ్లో ఉన్నట్టు డీఎస్ఓ కె నిర్మలాబాయి తెలిపారు. -
డిపోలపై తమ్ముళ్ల దృష్టి!
పాలకొండ రూరల్:అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక ప్రయోజనం కల్పించే అన్ని రకాల పదవుల, పోస్టులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తాజాగా రేషన్ డిపోలను దక్కించుకోవడంపై దృష్టి సారించారు. త్వరలో భర్తీ కానున్న డీలర్ పోస్టులను తమ అనుయాయులకు ఇప్పించుకునేందుకు ఆయా ప్రాంతాల నాయకులు పావులు కదుపుతున్నారు. జిల్లాలో పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల పరిధిలో 85 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని కారుణ్య నియామకాల కింద గత డీలర్ కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి ఉంది. అవి పోగా మిగిలిన పోస్టుల నియామక ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. టెక్కలి డివిజన్ పరిధిలో ఉన్న రెండు రెగ్యులర్ ఖాళీలకు సంబంధించి ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. వాటిని దక్కించుకునేందుకు స్థానిక టీడీపీ నేతలు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని తెలిసింది. శ్రీకాకుళం డివిజన్లో రోస్టరైజేషన్ పూర్తి చేసి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పాలకొండ డివిజన్‌కు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు పౌరసరఫరా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వీటిని తమ వారికి కట్టబెట్టేందుకు ఇప్పటికే స్థానిక చోటా నాయకులు మొదలుకుని బడా నేతలు వరకు పైరవీలు మొదలుపెట్టారు. కొత్త డిపోలకు అవకాశం ఇదిలా ఉండగా 300 నుంచి 400 కార్డులున్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా నిర్థారించి కొత్త రేషన్ డిపోల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. ఆ ప్రకారం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1989 డిపోలకు తోడు మరో 500 డిపోలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇది కూడా టీడీపీ నేతల అవకాశాలను పెంచనుంది. కాగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిపోలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న నేతలు కొన్ని ప్రాంతాల్లో వీటికి రేట్లు కూడా నిర్ణయించేశారని తెలిసింది. 11న ఉప ముఖ్యమంత్రి జిల్లాకు రాక శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ నెల 11వ తేదీన జిల్లాకు రానున్నారని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం శనివారం తెలిపారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లాకు చేరుకొని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. 10 గంటలకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తనయుని వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. -
రేషన్‌కూ ఈ-పాస్!
శ్రీకాకుళం పాతబస్టాండ్:ప్రజాపంపిణీ విధానాన్ని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయడం ద్వారా పేదలకు సరుకులను ఈ-పాస్ విధానంలోనే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి పెలైట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. వీటిలో శ్రీకాకుళం జిల్లా కూడా ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ విధానం అమలుకు జిల్లాకు 1919 ఈ-పాస్, ఎలక్ట్రానికి కాటాల సెట్లు మంజూరు చేసింది. వీటిని రేషన్ డీలర్లకు అందజేస్తారు. ఈ యంత్రాలను సరఫరా చేసే టెండరును ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. త్వరలో ఈ యంత్రాలు జిల్లాకు చేరనుండగా.. రెండు మూడు నెలల్లో పూర్తిగా ఆధునిక విధానంలోనే సరుకులు సరఫరా చేయనున్నారు. జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 7.90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 1989 రేషన్ డిపోల పరిధిలో ఉన్న ఈ కార్డుదారులకు ప్రస్తుతం మాన్యువల్ విధానంలో సరుకులు సరఫరా చేస్తున్నారు. పంపిణీ ప్రక్రియను ఇప్పటికే ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయడం దాదాపు పూర్తి కావచ్చింది. కొత్త ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. తొలిదశలో ఈ పథకాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.49,710 విలువ చేసే ఈ పాస్, ఎలక్ట్రానిక్ కాటాల సెట్‌ను ప్రతి డీలరుకు అందజేస్తారు. పని చేసే విధానం ఈ-పాస్ యంత్రాల్లో రేషన్‌కార్డుల నెంబర్లు, కార్డుదారుల కుటుంబంలోని ఒకరి బొటనవేలి ముద్ర ముందుగానే నిక్షిప్తం చేస్తారు. సరుకుల పంపిణీ సమయంలో లబ్ధిదారుని రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయడంతోపాటు, బొటనవేలి ముద్ర తీసుకుంటారు. యంత్రంలో నిక్షిప్తమైన వాటితో అవి సరిపోలితే ఆ కార్డుకు అందజేయాల్సిన సరుకుల వివరాలతో ఒక స్లిప్ వస్తుంది. దాని ఆధారంగా ఎలక్రాటనిక్ కాటాలో సరుకులు తూచి లబ్ధిదారుడికి అందజేస్తారు. లబ్ధిదారులకు కష్టం ఈ-పాస్ విధానం అమల్లోకి వస్తే లబ్ధిదారులతో పాటు డీలర్లు కూడా గురికాక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలామంది డీలర్లపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే 500 కంటే ఎక్కువ రేషన్ కార్డులున్న డిపోలను విభజించి కొత్తవారికి డిపోలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. వీటికి తోడు ఈ-పాస్ విధానం అమల్లోకి వస్తే సరుకుల పంపిణీలో ఇబ్బందులు తప్పవంటున్నారు. కాగా పేద లబ్ధిదారులు ఉపాధి కోసం నెలల తరబడి వలస వెళుతుంటారు. వారి తరఫున కుటుంబ సభ్యుల్లో ఎవరికి వీలుంటే వారు వెళ్లి సరుకులు తీసుకుంటుంటారు. కానీ ఈ-పాస్ విధానంలో ఎవరో ఒకరి వేలిముద్ర మాత్రమే నమోదై ఉంటుంది. అందువల్ల ప్రతి నెలా ఆ వ్యక్తి మాత్రమే వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. వలస వెళ్లిన వారికి, కూలి పనులకు వెళ్లేవారికి ఇది ఇబ్బందికరమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
రేషన్ షాపులపై రాజకీయ పెత్తనం !
పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే రేషన్ షాపులపై పెద్దల పెత్తనం పెరుగుతోంది. రాజకీయనాయకులు తమ అనుచరులను బినామీ డీలర్లుగా నియమిస్తున్నారు. దీంతో జిల్లాలో రేషన్ డిపోల డీలర్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. చాలా రేషన్ షాపులను ఇన్‌చార్జ్‌లతో నిర్వహిస్తుండడం, ఇన్‌చార్జ్‌లకు బదులు బినామీలు షాపులను నడుపుతుండడంతో కార్డుదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. చాలా చోట్ల సస్పెండ్ అయిన వారే డీలర్లుగా కొనసాగుతున్నారు. జిల్లాలో 79 డీలర్ పోస్టులు ఖాళీగా ఉండగా, మరో 70 షాపులు ఇన్‌చార్జ్‌లతో నడుస్తున్నాయి. రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో వారి బినామీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. విజయనగరం కంటోన్మెంట్: ప్రతినెలా పేద ప్రజలకు నిత్యావసరాలను సబ్సిడీ ధరలకు అందించాల్సిన రేషన్ షాపుల్లో ఇన్చార్జ్ డీలర్ల నియామకాలు వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇన్చార్జిలను నియమించాల్సిన అవసరం లేకుండా స్థానిక మహిళా గ్రూపులకు బాధ్యతలు తాత్కాలికంగా అప్పగించాలన్న ప్రభుత్వ నిబంధనలను అధికారులు పక్కన పెడుతున్నారు. ఏ రేషన్ షాపులోనైనా అక్రమాలు జరిగినపుడు ఆ డీలర్‌పై సస్పెన్షన్ వేటువేసి, పక్క గ్రామానికి, వార్డుకు చెందిన డీలర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు రాజకీయ నాయకులు తమకు ఆ రేషన్ షాపును అప్పగించాలని అటు ఇన్చార్జ్ డీలరుతో పాటు అధికారులపైనా ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు కూడా చూసీ చూడనట్టు తలూపడంతో జిల్లాలోని కొన్ని రేషన్ షాపులకు రాజకీయ నాయకులు తమ వారిని బినామీలుగా నియమించుకుంటున్నారు. ఇక వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. వారికి నచ్చినట్టు రేషన్ షాపులను నిర్వహిస్తున్నారు. వీరు నిర్వహిస్తున్న షాపులు మరో డీలర్ పేరిట ఇన్చార్జ్గా నమోదయి ఉండటంతో బినామీలు చేస్తున్న తప్పులకు అసలు డీలర్లు బలవుతున్నారు. అధికారికంగా ఉన్న ఇన్చార్జిపై కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల డెంకాడ మండలంలోని గొడిపాలెంలో బినామీ డీలర్ నిర్వహిస్తున్న రేషన్ షాపును విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఇదే షాపుపై గతంలో కూడా విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. షాపులకు ఇన్చార్జ్ ఒకరే... నిర్వహిస్తున్న బినామీలు మారుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కారణంగా ఇన్చార్జీలు ఈ షా పులను బినామీలకు అప్పగించవలసి వస్తోంది. బుధవారం కేసు నమోదయిన ఈ షాపునకు ఇన్చార్జిగా పేడాడ గ్రామ డీలర్ వ్యవహరిస్తున్నారు. ఈయనే పినతాడివాడ షాపునకు కూడా ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇన్‌చార్జీలున్న అన్ని చోట్లా ఇదే తరహాలో అవకతవకలు జరుగుతుండడంతో ఎవరిపై కేసు నమోదు చేయాలన్న విషయంలో అధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి వస్తోంది. సస్పెండయిన వారే డీలర్లుగా చలామణి పార్వతీపురం డివిజన్లో సస్పెండయిన డీలర్లే రేషన్ షాపులు నడుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అసలు డీలర్లు తప్పులు చేస్తే తొలగించడమో, లేక వెంటనే విచారణచేసి మరో డీలర్‌ను నియమించడమో చేయాల్సి ఉంది. కానీ డీలర్ల నియామకాలు చేపట్టవద్దని ఆదేశాలు రావడంతో అధికారులు నియామకాలు చేపట్టడం లేదు. జిల్లాలో ఉన్న 1,362 రేషన్ షాపుల్లో ఇప్పటికే 79 డీలరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో పక్క అక్రమ రవాణా, తూనికల్లో వ్యత్యాసాలున్న కారణంగా సస్పెన్షన్‌లో మరో 62 షాపులున్నాయి. వాటి స్థానంలో ఆయా గ్రామాలు, వార్డుల్లోని మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. కానీ వీటిలో కూడా పక్క డీలర్లకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. 6ఏ కేసులు నమోదైతూనికలు, కొలతల వ్యత్యాసాలకు విజిలెన్స్ లేదా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, అధికారులు సస్పెండ్ చేసిన డీలర్లు కూడా డిపోలు నడపడం విశేషం. సస్పెండయిన డీల రు స్థానంలో పక్క గ్రామానికి చెందిన డీలరుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం వల్ల వారి మధ్య సయోధ్య కారణంగా రేషన్ షాపును సస్పెండయిన వ్యక్తే నడిపిస్తున్న వైనాలపై గతంలో కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లోనూ ఫిర్యాదులు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పెండింగ్‌లో కేసులు పౌరసరఫరాలు, లేదా ఇతర ఆహార పదార్థాల విక్రయా ల్లో అక్రమాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటువంటి కేసులు జి ల్లాలో చాలా వరకూ పెండింగ్‌లో ఉంటున్నాయి. జిల్లాలో రేషన్ డీలర్ల వద్ద సరుకుల వ్యత్యాసం ఉన్న కేసులతో పాటు అక్రమంగా సరుకుల తరలింపు వంటి 119 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్కొక్క డీలర్‌కూ రెండు నుంచి నాలుగేసి రేషన్ డిపోలున్నట్టు అధికారులకూ తెలుసు. అయినా పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఏదైనా అంశం వెలుగులోకి వస్తే తప్ప అధికారులు స్పందించడం లేదు. గత కొన్నేళ్లుగా నమోదైన కేసుల వివరాలు సంవత్సరం నమోదైనవి పరిష్కారమైనవి పెండింగ్ 2008 150 150 0 2009 77 77 0 2010 78 76 2 2011 84 84 0 2012 70 68 2 2013 43 28 15 2014 138 38 100స -
ఏమిటో ఈ మాయ!
శ్రీకాకుళం:ఈ ఫొటోల్లోని బ్యాన ర్లు చూశారా?.. ఒక దాంట్లో 25 కేజీల బియ్యం, మరో దాంట్లో 10 కేజీల బియ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఒక దాంట్లో కందిపప్పు, కారంపొడి ఉంటే.. మరో దాంట్లో ఉల్లి, బంగాళదుంపలు ఉన్నాయి. మొదటిది శ్రీకాకుళం పట్టణంలోని ఫాజుల్‌బాగ్‌పేట రేషన్ డిపో వద్ద ఏర్పాటు చేయగా.. రెండోదాన్ని ఇదే పట్టణంలోని శివాలయం వీధి రేషన్ డిపో వద్ద ఏర్పాటు చేశారు. ఈ రెండూ తుపాను, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలే. అందువల్ల ఈ రెండు డిపోల పరిధిలో ఒకేరీతిలో తుపాను సహాయ నిత్యావసరాలు అందాలి. కానీ బ్యానర్లలో అన్ని తేడాలు ఎందుకున్నట్లు?.. బ్యానర్లే కాదు. నిత్యావసర సరుకుల పంపిణీ మొత్తం ఇలాగే అస్తవ్యస్తంగా ఉంది. బాధితులకు అందాల్సిన సరుకులు పక్కదారి పడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌కి తరలిపోతున్నాయి. బాధితులందరికీ ఒకేరీతిలో సాయం అందడం లేదు. కొందరికి క ందిపప్పు, కారంపొడి అందడం లేదు. ఇంకొందరికి ఉల్లి, బంగాళ దుంపలు అందడం లేదు. బియ్యం కొందరికి 25 కేజీలు ఇస్తే.. మరికొందరికి 10 కేజీలే ఇస్తున్నారు. తుపాను బాధిత ప్రాంతాల్లో తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికే సరుకులు ఇవ్వాలని మొదట ఆదేశించిన ప్రభుత్వం ఆ తర్వాత గులాబీ కార్డుదారులకు కూడా అందజేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో 25 కేజీలు మిగిలిన ప్రాంతాల్లో 10 కేజీల బియ్యం ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ తేడాను డీలర్లు, పంపిణీ బాధ్యత తీసుకున్న కమిటీల సభ్యులు వినియోగించుకుంటున్నారు. ఇష్టానుసారం సరుకులు పంపిణీ చేస్తూ.. మిగిలిన వాటిని మార్కెట్‌కు తరలిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో పంపిణీ తీరును పరిశీలిస్తే ఫాజుల్‌బేగ్‌పేటలో 25 కేజీలు బియ్యం ఇస్తుండగా, శివాలయం వీధిలో 10 కేజీలు ఇస్తున్నారు. వాస్తవానికి ఫాజుల్‌బాగ్‌పేట కంటే ముందు శివాలయం వీధి ముంపునకు గురవుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. కానీ అధికారులు మాత్రం ఈ వీధికి బియ్యం తగ్గించారన్నది స్థానికులకు అర్థం కావడం లేదు. రేషన్ డిపోల్లో సరుకుల పంపిణీలో కూడా వ్యత్యాసం ఉంటోంది. ఓ చోట ఉల్లిపాయలు, బంగాళదుంపలు, బియ్యం, పంచదార మాత్రమే ఇస్తుండగా, మరికొన్ని చోట్ల నూనె, ఉప్పు, కారం ఇస్తున్నారు. కొన్ని డిపోల్లో మాత్రమే కందిపప్పు అందజేస్తున్నారు. అక్కడ పంచదార ఇవ్వడం లేదు. అధికారులు మాత్రం అన్ని డిపోలకు సమానంగా సరుకులు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారు. మరి ఆ సరుకులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో అంతుచిక్కడం లేదు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు మాత్రం బహిరంగ మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. కొందరు డీలర్లు, టీడీపీ కమిటీల సభ్యులు సరుకులను విపణి వీధికి తరలిస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. జన్మభూమి కమిటీల సభ్యులే రేషన్ సరుకుల పంపిణీలో హవా చలాయిస్తుండగా వీరిలో కొందరు సరుకులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చేనేతలకు అందని 50 కేజీల బియ్యం జిల్లాలోని చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో బాదుర్లపేట మినహా మిగిలిన ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వలేదు. బాదుర్లపేటలో కూడా ఈ నెల 23న ముఖ్యమంత్రి వస్తున్నారని తెలియడంతో వేకువజామున ఇంటింటికి పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ముఖ్యమంత్రి బాదుర్లపేటలో పర్యటిస్తారని తొలుత ప్రచారం కావడంతో ఆగమేఘాల మీద పంపిణీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లోని చేనేత కార్మికులు తమ మాటేమిటని ప్రశ్నిస్తే మీరున్నట్టు ముందుగా తమకు ఎవ్వరూ చెప్పలేదని అధికారులు, ప్రజాప్రతినిధులు అంటుండడం విడ్డూరం. ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అలా జరగనప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా న్యాయం చేయాల్సిన ఇద్దరూ ఒకే మాట చెబుతుండడంతో చేనేత కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. -
మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యం
తెర్లాం రూరల్: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలకు నాణ్యమైన బియ్యాన్నే పంపిణీ చేస్తున్నామని, గోదాముల ద్వారా సరఫరా చేసే బియ్యంలో ఎటువంటి తేడాలు లేవని పౌర సరఫరాల శాఖ జిల్లా సహాయ మేనేజర్(టెక్నికల్) జె.భాస్కర శర్మ స్పష్టం చేశారు. తెర్లాంలోని పౌర సరఫరాల గోదాములో సరుకుల నిల్వలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే బియ్యం నాసిరకంగా ఉంటున్నాయని, పురుగులు ఉంటున్నాయని ఇటీవల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్టేజ్-1, స్టేజ్ గోదాములను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఏ గోదాములో కూడా బియ్యం పురుగులు పట్టడం గానీ, నాసిరకమైన బియ్యంగానీ లేవన్నారు. ప్రతి నెలా స్టేజ్-1కు వచ్చే బియ్యాన్ని స్టేజ్-2 గోదాములకు పంపిణీ చేస్తామని, అక్కడ నుంచి రేషన్ డిపోలకు, వసతి గృహాలకు, పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు. పౌర సరఫరాల గోదాముల నుంచి పంపిణీ చేస్తున్న బియ్యంలో తేడాలు లేవన్నారు. అయితే గోదాము నుంచి పాఠశాలలకు బియ్యం తీసుకువెళ్లినపుడు వచ్చే నెల వరకు నిల్వ ఉంచడం, నిల్వలను కింద ఉంచడం వల్ల బియ్యం ముక్కిపోవడం, పురుగులు పట్టడం జరుగుతుందన్నారు. పాఠశాలలకు, వసతి గృహాలకు సంబంధించి ఉపాధ్యాయులు, వార్డెన్లు గోదాములకు వచ్చి బియ్యం బస్తాలను ఎంచుకొని తీసుకువెళ్లే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. పాఠశాలలకు, వసతి గృహాలకు పంపిణీ చేసే బియ్యం బాగా లేకపోయినా వాటిని మార్చాలని గోదాము ఇన్చార్జిలకు సూచించామన్నారు. కార్యక్రమంలో తెర్లాం గోదాము ఇన్చార్జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెమలాం ఉన్నత పాఠశాల బియ్యం పరిశీలన నెమలాం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం బియ్యం బాగాలేవని పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో పౌర సరఫరా శాఖ జిల్లా సహాయ మేనేజరు(టెక్నికల్) భాస్కరశర్మ, తెర్లాం గోదాము ఇన్చార్జి నాగేశ్వరరావులు పాఠశాలకు వెళ్లి బియ్యం పరిశీలించారు. బియ్యాన్ని నెలల తరబడి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు వినియోగిస్తే పురుగులు పట్టే అవకాశం ఉండదన్నారు. -
బాలారిష్టాలు దాటని బయోమెట్రిక్
కాకినాడ/కాకినాడ సిటీ :జిల్లాలోని కొన్ని చౌకడిపోల్లో ఆర్భాటంగా ప్రారంభించిన బయో మెట్రిక్ విధానం ఆచరణలో విఫలమవుతోంది. తరచూ మొరాయిస్తున్న పరికరాలతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే తొలిసారిగా 2012 అక్టోబర్ 20న రాజస్థాన్‌లోని డూడూ గ్రామం నుంచి అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఆన్ లైన్లో ప్రారంభించిన కాకినాడ గొడారిగుంటలోని 87వ నంబరు రేషన్ డిపోలోని బయోమెట్రిక్ పరికరమూ ఇప్పుడు పనిచేయడం లేదు. ఆధార్‌తో అనుసంధానం ద్వారా బోగస్ కార్డులను నియంత్రించే లక్ష్యంతో బయోమెట్రిక్ విధానానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే తరచూ బయోమెట్రిక్ పరికరాలు మొరాయించడం, సర్వర్ పనిచేయకపోవడం, నెట్వర్క్ సహకరించకపోవడ ంతో ప్రతి నెలా కార్డుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. కార్డుదారు వేలిముద్రకు బయోమెట్రిక్ పరికరం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తప్ప సరుకులు పొందే అవకాశం లేకపోవడంతో అది పని చేసేదాకా పడిగాపులు పడాల్సి వస్తోంది. డీలర్లు ఒక్కోసారి గంటకు ముగ్గురు లేక నలుగురికి మించి సరుకులు ఇవ్వలేకపోతున్నారు. వృద్ధుల వేళ్ళు ముడతలుపడి అరిగిపోవడంతో ఒక్కోసారి బయోమెట్రిక్ పరికరం వారి వేలి ముద్రలను తిరస్కరించడం వల్ల కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కాకినాడలో జిల్లాలో కాకినాడలోలోని ఆరు దుకాణాల్లో ఈ విధానాన్ని తొలుత ప్రారంభించి ఆ తరువాత దశల వారీగా వంద చౌకడిపోలకు విస్తరించారు. అధికారుల లెక్కల ప్రకారమే ప్రస్తుతం పాతికకు పైగా రేషన్ డిపోల్లో బయోమెట్రిక్ పరికరాలు మూలనపడ్డాయి. కార్డుదారులైతే సగానికి పైగా డిపోల్లో ఆ పరికరాలు సరిగా పనిచేయడం లేదంటున్నారు. వీటి నిర్వహణ చూసే సంస్థ నుంచి గానీ, అధికారుల నుంచి గానీ స్పందన ఉండడంలేదని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. బయోమెట్రిక్ అమలులో ఉన్న డిపోల్లో నేరుగా సరుకులు పంపిణీ చేసే అవకాశం లేదు. దీంతో ఓ డిపోలోని పరికరం పాడైతే సమీపంలోని మరో డిపో నుంచి ఆ పరికరాన్ని తెచ్చి పంపిణీ చేయాల్సి వస్తోంది. దీంతో రెండు దుకాణాల పరిధిలోని కార్డుదారులు పడిగాపులు తప్పడంలేదు. ప్రధాని ప్రారంభించిన 87వ నెంబర్ రేషన్షాపులోని పరికరం కాలిపోవడంతో సమీపంలోని మరో షాపు నుంచి పరికరాన్ని తెచ్చి రెండు షాపులకు కలిపి సరుకులు పంపిణీ చేశారు. కార్డుదారుల ఒత్తిడితో కొద్దిరోజుల క్రితమే తాత్కాలికంగా మరో పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఈ పద్ధతికి శ్రీకారం చుట్టిన రోజున కాకినాడలో ప్రారంభించిన ఆరు షాపుల్లో మూడింట్లో ఆ పరికరాలు పనిచేయడం లేదు. పాత పద్ధతిలోనే ఇవ్వండి.. బయోమెట్రిక్ పరికరాలను సమకూర్చిన కంపెనీ గతంలో నెలకు రెండుసార్లు వచ్చి సర్వీసింగ్ చేసేదని, ప్రస్తుతం కాంట్రాక్టు కాలపరిమితి ముగియడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని డీలర్లు అంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ప్రయోజనంలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విధానంలో ఎదురైన బాలారిష్టాలను అధిగమించకుండా దశలవారీగా జిల్లాలోని 2,560 చౌకడిపోల్లో అమలు చేయబోతే.. పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. నాణ్యమైన పరికరాలను ఏర్పాటు చేసేవరకూ పాతపద్ధతిలోనే సరుకులు ఇవ్వాలని కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారు. 15 రోజుల్లో కొత్తవి సమకూరుస్తాం : డీఎస్ఓ కొన్ని చౌకడిపోల్లో బయోమెట్రిక్ పరికరాలు పాడైన విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి స్థానంలో కొత్తవాటి కోసం ప్రతిపాదనలు పంపామని డీఎస్ఓ రవికిరణ్ చెప్పారు. 15 రోజుల్లో కొత్తవి అమరుస్తామన్నారు. గంటలకొద్దీ నిలబడాల్సి వస్తోంది గతంలో వెళ్ళిన వెంటనే సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు గంటల కొద్దీ ఉండాల్సి వస్తోంది. లేకపోతే ఒకటికి రెండుసార్లు డిపో చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పద్ధతిని మార్చి ఇదివరకటి లాగే సరుకులు ఇవ్వాలి. - యేసారపు మహాలక్ష్మమ్మ, కార్డుదారు, గొడారిగుంట, కాకినాడ మొరాయిస్తున్న మెషీన్లు చౌకడిపోలకు అందజేసిన బయోమెట్రిక్ మెషీన్లు తరచు మొరాయిస్తున్నాయి. కార్డుదారులకు సకాలంలో సరుకులు అందజేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి - కె.వీరభద్రరావు, డీలర్, 72వ నంబరు చౌకడిపో, కాకినాడ -
డీలర్లకు టీడీపీ ప‘రేషాన్’
సాక్షి, గుంటూరు : టీడీపీ నేతలు కొత్త దందాకు తెర తీశారు. తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రేషన్ డిపోల డీలర్లపై దృష్టి సారించారు. తమ పార్టీకి చెందని, సానుభూతిపరులు కాని డీలర్లను ఏదో విధంగా తప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. లక్ష్య సాధన కోసం అధికారులపై తీవ్ర స్థారుులో ఒత్తిళ్లు తెస్తున్నారు. ‘మేం చెప్పిందే శాసనం.. మేమివ్వమన్న వారికే రేషన్ షాపులు ఇవ్వాలి.. చెప్పింది వింటే ఉంటావ్.. లేదంటే ఎక్కడికి బదిలీ అవుతావో తెలియదు.. నిబంధనలు, గిబంధనలు జాంతానై.. చెప్పింది చెయ్ అంతే..’ అంటూ అధికారులను బెదిరిస్తున్నారు. విచక్షణ కోల్పోరుు.. జిల్లాలోని అధికశాతం నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు రేషన్ డిపోలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో కూడా టీడీపీ కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా రేషన్ డిపోలు నిర్వహించిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే పదేళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకున్న టీడీపీ నేతలు విచక్షణ కోల్పోతున్నారు. అధికారులు, రేషన్ డీలర్లపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. డీలర్ పోస్టుకు రాజీనామా చేయాలని, లేదంటే కేసులు పెట్టించి ఆర్ధికంగా నష్టపరచడంతోపాటు ఇబ్బందులకు గురిచేస్తామని పర్మినెంట్ డీలర్లను బెదిరిస్తున్నారు. ఇక డ్వాక్రా సంఘాల పేరుతో నడుస్తున్న రేషన్ దుకాణాలను ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు బలంవంతంగా లాగేసుకుని డీడీలు తీసేందుకు సైతం సిద్ధమైపోయారు. నిబంధనలకు విరుద్ధంగా డీలర్లను మార్చడం ఎలాగో తెలియక రెవెన్యూ అధికారులు తలపట్టుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ప్రతి నెలా 18వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా రేషన్ డీలర్లకు సరుకుల అలాట్మెంట్ చేయాల్సిన అధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా బుధవారం వరకు ఆ పని చేయలేదు. రేషన్ షాపులకు అలాట్మెంట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ మంగళవారం స్వయంగా ఆదేశించారు. అరుుతే టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతర్ చేశారు. ఎలాగైనా రేషన్ డీలర్ల పేర్లు మార్చి 26న డీడీలు తీయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఈ గందరగోళంతో సరుకులు అందుతాయో లేదోనని పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నరసరావుపేట, గురజాల డివిజన్లలోనే అధిక మార్పులు జిల్లాలో అత్యంత సమస్యాత్మక గ్రామాలు అధికంగా ఉన్న నరసరావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లలోనే రేషన్ డీలర్ల మార్పులు అధికంగా జరుగుతున్నట్లు సమాచారం. గురజాల, నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో రేషన్ షాపుల నిర్వాహకులను బెదిరించి రాజీనామాలు చేయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో మళ్లీ గొడవలు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని బాధితులు కోరుతున్నారు. -
పక్కదారి పడుతున్న రేషన్ కిరోసిన్
వీరఘట్టం, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు రేషన్ డిపోల ద్వారా రాయితీపై అందించాల్సిన నీలి కిరోసిన్ పక్కదారి పడుతోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిరోసిన్‌ను డీలర్లు కొద్దిమంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేసి, మిగిలిన దాన్ని నల్లబజారుకు తరలించేస్తున్నారు. ముం దుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు స్టాకు రాగానే అక్రమ వ్యాపారులతో లాలూచీ పడుతున్నారు. కిరోసిన్ అందని లబ్ధిదారులు దీనిపై ప్రశ్నిస్తే లేనిపోని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. సకాలంలో వచ్చి తీసుకోకపోతే తామేం చేస్తామంటూ తిరగబడుతున్నారు. అంతేకాకుండా రెండు నెలలకు ఒకసారి మాత్రమే కిరోసిన్ ఇస్తామని ఖరాఖండీగా చెబుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవటం లేదు. వేసవి, విద్యుత్ కోతలతో పెరిగిన డిమాండ్ అసలే వేసవి కాలం.. పైగా వేళాపాళా లేని విద్యుత్ కోతల కారణంగా కిరోసిన్‌కి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గ్రామీణులు చాలామంది కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు. కొందరు వంట కోసం కూడా కిరోసిన్‌నే వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితి అటు రేషన్ డీలర్లకు, ఇటు అక్రమ వ్యాపారులకు వరంగా మారింది. కిరోసిన్ లోడ్ వ స్తోందని తెలిసిన వెంటనే అక్రమ వ్యాపారులు డీలర్ల వద్ద వాలిపోతున్నారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో మొత్తం 1987 రేషన్ డిపోలు ఉన్నా యి. వీటి పరిధిలో మొత్తం 7,77,875 మంది రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,81,940 తెలుపు రేషన్‌కార్డులు కాగా, రచ్చబండ-2లో ఇచ్చిన కార్డులు 41,892, ఏఏవై కార్డులు 52,722, ఏపీ కార్డులు 1321 ఉన్నాయి. వీరి కోసం ప్రతి నెలా 1,320 కిలోలీటర్ల కిరోసిన్ విడుదల చేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన కార్డుదారునికి నెలకు 2 లీటర్ల చొప్పున కిరోసిన్ అందజేయాలి. అయితే డీలర్లు అలా ఇవ్వటం లేదు. కొందరు డీలర్లు లీటరు చొప్పున, మరికొందరు లీటరున్నర చొప్పున ఇస్తున్నారు. ఇదేంటని కార్డుదారులు ప్రశ్నిస్తే ఇంతే వచ్చింది ఏంచేయమంటారని దబాయిస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ పౌరసరఫరాల శాఖాధికారులు రేషన్ సరుకులను డీలర్లకు చేర్చేందుకు రూట్ అధికారులను నియమించారు. వీరితో డీలర్లు అవగాహన కుదుర్చుకుని కిరోసిన్నురాత్రి వేళ తరలిస్త్తున్నారు. దీంతో కిరోసిన్ తరలింపుపై ఎలాంటి పర్యవేక్షణ ఉండటం లేదు. మరో వైపు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసినపుడు కిరోసిన్ కూడా అందుకున్నట్టు సంతకాలు చేయించుకుని జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు ఈ అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిర్యాదులు వస్తే చర్యలు: డీఎస్వో ఆనందకుమార్ కిరోసిన్ అక్రమ తరలింపుపై జిల్లా పౌరసరఫరాల అధికారి ఆనందకుమార్‌ను న్యూస్‌లైన్ ప్రశ్నించగా కిరోసిన్ పంపిణీపై ఇప్పటి వరకు తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ఫిర్యాదులేమైనా వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కిరోసిన్ సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.