సాక్షి, గుంటూరు : టీడీపీ నేతలు కొత్త దందాకు తెర తీశారు. తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రేషన్ డిపోల డీలర్లపై దృష్టి సారించారు. తమ పార్టీకి చెందని, సానుభూతిపరులు కాని డీలర్లను ఏదో విధంగా తప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. లక్ష్య సాధన కోసం అధికారులపై తీవ్ర స్థారుులో ఒత్తిళ్లు తెస్తున్నారు. ‘మేం చెప్పిందే శాసనం.. మేమివ్వమన్న వారికే రేషన్ షాపులు ఇవ్వాలి.. చెప్పింది వింటే ఉంటావ్.. లేదంటే ఎక్కడికి బదిలీ అవుతావో తెలియదు.. నిబంధనలు, గిబంధనలు జాంతానై.. చెప్పింది చెయ్ అంతే..’ అంటూ అధికారులను బెదిరిస్తున్నారు.
విచక్షణ కోల్పోరుు..
జిల్లాలోని అధికశాతం నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు రేషన్ డిపోలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో కూడా టీడీపీ కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా రేషన్ డిపోలు నిర్వహించిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే పదేళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకున్న టీడీపీ నేతలు విచక్షణ కోల్పోతున్నారు. అధికారులు, రేషన్ డీలర్లపై దౌర్జన్యాలకు దిగుతున్నారు.
డీలర్ పోస్టుకు రాజీనామా చేయాలని, లేదంటే కేసులు పెట్టించి ఆర్ధికంగా నష్టపరచడంతోపాటు ఇబ్బందులకు గురిచేస్తామని పర్మినెంట్ డీలర్లను బెదిరిస్తున్నారు. ఇక డ్వాక్రా సంఘాల పేరుతో నడుస్తున్న రేషన్ దుకాణాలను ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు బలంవంతంగా లాగేసుకుని డీడీలు తీసేందుకు సైతం సిద్ధమైపోయారు. నిబంధనలకు విరుద్ధంగా డీలర్లను మార్చడం ఎలాగో తెలియక రెవెన్యూ అధికారులు తలపట్టుకుంటున్నారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్..
ప్రతి నెలా 18వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా రేషన్ డీలర్లకు సరుకుల అలాట్‌మెంట్ చేయాల్సిన అధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా బుధవారం వరకు ఆ పని చేయలేదు. రేషన్ షాపులకు అలాట్‌మెంట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ మంగళవారం స్వయంగా ఆదేశించారు. అరుుతే టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతర్ చేశారు. ఎలాగైనా రేషన్ డీలర్ల పేర్లు మార్చి 26న డీడీలు తీయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఈ గందరగోళంతో సరుకులు అందుతాయో లేదోనని పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నరసరావుపేట, గురజాల డివిజన్లలోనే
అధిక మార్పులు
జిల్లాలో అత్యంత సమస్యాత్మక గ్రామాలు అధికంగా ఉన్న నరసరావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లలోనే రేషన్ డీలర్ల మార్పులు అధికంగా జరుగుతున్నట్లు సమాచారం. గురజాల, నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో రేషన్ షాపుల నిర్వాహకులను బెదిరించి రాజీనామాలు చేయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో మళ్లీ గొడవలు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని బాధితులు కోరుతున్నారు.
డీలర్లకు టీడీపీ ప‘రేషాన్’
Published Thu, Jun 26 2014 12:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement