కందిపప్పు ధర భారీగా పెంపు
కార్డుహోల్డర్లకు శిరోభారం
రూ.4.50కోట్లు భారం
సర్వర్లకు చేరని కొత్తరేటు
ఆదిలోనే నిలిచిన సరఫరా
విశాఖపట్నం : కందిపప్పు ధర బయటమార్కెట్లో హడలెత్తిస్తోంది. దీంతో ధర సాకుగా చూపి రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేసే కందిపప్పు ధరను ప్రభుత్వం కూడా పెంచేసింది. పోనీ పెరిగిన ధరకైనా తీసుకుందామనుకుంటే ఈపాస్ యంత్రాల్లో కందిధర చేర్చలేదంటూ సరఫరా నిలిపివేశారు. దీంతో ధర పెరిగినా సరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం జిల్లాలో 10,10,770 తెల్లకార్డులు, 77,167 అంత్యోదయ అన్న యోజన కార్డులు, 1035 అన్నపూర్ణ కార్డులున్నాయి. గతంలో ఈ కార్డులకు బియ్యం, కిరోసిన్‌తో పాటు తొమ్మిది రకాల నిత్యావసరాలను రూ.185 లకే సరఫరా చేసేవారు. ఎప్పటి నుంచో ఇస్తున్న కందిపప్పు, గోధుమ పిండి, గోదాముల సరఫరాలను గతేడాది నుంచి నిలిపివేశారు. కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్‌లకే పరిమితం చేశారు. అది కూడా అరకిలో పంచదార, లీటర్ కిరోసిన్‌కు కుదించేశారు. బహిరంగ మార్కెట్‌లో ధర ఎంత ఉన్నా సంబంధం లేకుండా మూడేళ్లుగా ఒకే రీతిలో కిలో రూ.50లకే రేషన్ డిపోలద్వారా బీపీఎల్ కార్డుదారులకు సరఫరా చేసేవారు.
టెండర్లు ఖరారు కాలేదంటూ ఆర్నెల్లుగా నిలిపివేసిన కందిపప్పు సరఫరా గత నెలలోనే పునరుద్ధరించారు. ప్రస్తుతం కందిపప్పు ధర బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.200లకు చేరింది. సబ్సిడీ కందిపప్పు ధర కూడా ప్రభుత్వం పెంచేసింది. ఈ నెల నుంచి కార్డుకు కిలో రూ.90లకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు కిలో రూ.50ల చొప్పున జిల్లా లోని రేషన్‌కార్డుదారులు రూ.5.34కోట్ల భారం పడేది. నవంబర్ నుంచి కిలోరూ.90కు పెంచడంతో కిలోపై రూ.40ల మేర అదనపు భారంపడింది. బహిరంగమార్కెట్‌లో బెంబేలెత్తిస్తున్నధరతో రేషన్ కార్డు దారులు విధిగా రేషన్‌డిపోల ద్వారా సరఫరాచేసే కందిపప్పు ఎలా ఉన్నా తీసుకుంటున్నారు. పెరిగినధర పుణ్యమాని కార్డుదారులపై అదనంగా రూ.4.50 కోట్ల మేర భారం పడుతుండడం పట్ల సామాన్యులు గగ్గోలు పెడుతు న్నారు. కందిపప్పు ధర ఈపాస్ యంత్రాల్లో చేర్చలేదేనే సాకుతో నవంబర్ 2 నుంచి అర్ధాతరంగా సరఫరా నిలిపివేశారు. దీనికి తోడు సర్వర్లు డౌన్ కావడంతో ఈపాస్ యంత్రాలు సరిగా పనిచేయడం లేదు. కందిపప్పే కాదు.. చివరకు బియ్యం, ఇతర నిత్యావసరాల సరఫరాలో కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. జిల్లాలో ఈపాస్ అమలు చేస్తున్న షాపులకు ప్రతీరోజూ వచ్చే కార్డుదారుల్ల్లో కనీసం 15 శాతానికి మించి పంపిణీ జరగకపోవడంతో వచ్చే లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.
అందని రేషన్ కంది
Published Fri, Nov 6 2015 11:15 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement