రేషన్‌కూ ఈ-పాస్!
శ్రీకాకుళం పాతబస్టాండ్:ప్రజాపంపిణీ విధానాన్ని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయడం ద్వారా పేదలకు సరుకులను ఈ-పాస్ విధానంలోనే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి పెలైట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. వీటిలో శ్రీకాకుళం జిల్లా కూడా ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ విధానం అమలుకు జిల్లాకు 1919 ఈ-పాస్, ఎలక్ట్రానికి కాటాల సెట్లు మంజూరు చేసింది. వీటిని రేషన్ డీలర్లకు అందజేస్తారు. ఈ యంత్రాలను సరఫరా చేసే టెండరును ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు.
త్వరలో ఈ యంత్రాలు జిల్లాకు చేరనుండగా.. రెండు మూడు నెలల్లో పూర్తిగా ఆధునిక విధానంలోనే సరుకులు సరఫరా చేయనున్నారు. జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 7.90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 1989 రేషన్ డిపోల పరిధిలో ఉన్న ఈ కార్డుదారులకు ప్రస్తుతం మాన్యువల్ విధానంలో సరుకులు సరఫరా చేస్తున్నారు. పంపిణీ ప్రక్రియను ఇప్పటికే ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయడం దాదాపు పూర్తి కావచ్చింది. కొత్త ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. తొలిదశలో ఈ పథకాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.49,710 విలువ చేసే ఈ పాస్, ఎలక్ట్రానిక్ కాటాల సెట్‌ను ప్రతి డీలరుకు అందజేస్తారు.
పని చేసే విధానం
ఈ-పాస్ యంత్రాల్లో రేషన్‌కార్డుల నెంబర్లు, కార్డుదారుల కుటుంబంలోని ఒకరి బొటనవేలి ముద్ర ముందుగానే నిక్షిప్తం చేస్తారు. సరుకుల పంపిణీ సమయంలో లబ్ధిదారుని రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయడంతోపాటు, బొటనవేలి ముద్ర తీసుకుంటారు. యంత్రంలో నిక్షిప్తమైన వాటితో అవి సరిపోలితే ఆ కార్డుకు అందజేయాల్సిన సరుకుల వివరాలతో ఒక స్లిప్ వస్తుంది. దాని ఆధారంగా ఎలక్రాటనిక్ కాటాలో సరుకులు తూచి లబ్ధిదారుడికి అందజేస్తారు.
లబ్ధిదారులకు కష్టం
ఈ-పాస్ విధానం అమల్లోకి వస్తే లబ్ధిదారులతో పాటు డీలర్లు కూడా గురికాక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలామంది డీలర్లపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే 500 కంటే ఎక్కువ రేషన్ కార్డులున్న డిపోలను విభజించి కొత్తవారికి డిపోలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. వీటికి తోడు ఈ-పాస్ విధానం అమల్లోకి వస్తే సరుకుల పంపిణీలో ఇబ్బందులు తప్పవంటున్నారు. కాగా పేద లబ్ధిదారులు ఉపాధి కోసం నెలల తరబడి వలస వెళుతుంటారు. వారి తరఫున కుటుంబ సభ్యుల్లో ఎవరికి వీలుంటే వారు వెళ్లి సరుకులు తీసుకుంటుంటారు. కానీ ఈ-పాస్ విధానంలో ఎవరో ఒకరి వేలిముద్ర మాత్రమే నమోదై ఉంటుంది. అందువల్ల ప్రతి నెలా ఆ వ్యక్తి మాత్రమే వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. వలస వెళ్లిన వారికి, కూలి పనులకు వెళ్లేవారికి ఇది ఇబ్బందికరమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.