బోధనాసుపత్రుల పరిధిలోకి దవాఖానాలు
- పెలైట్ ప్రాజెక్ట్‌గా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎంపిక
- వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : బోధనాసుపత్రుల పరిధి కి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. పెలైట్ ప్రాజెక్టు కింద వరంగల్ ఎంజీఎం బోధనాసుపత్రిని ఎంపిక చేశారు. ఆసుపత్రికి 50 కిలోమీటర్ల పరిధిలోని ఆసుపత్రులను దీని పరిధిలోకి తీసుకొస్తారు. ఇక్కడ అమలుతీరు ఆధారంగా రాష్ట్రంలోని ఇతర చోట్ల అమలుచేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులను వ్యవస్థీకరించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ ఈ కార్యక్రమానికి నడుం బిగించింది. బోధనాసుపత్రుల పరిధిలోకి సమీప ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకురావ డం వల్ల ఒకట్రెండు ఆసుపత్రుల మీద పడుతోన్న ఒత్తిడిని తగ్గిస్తారు. ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఉండే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుంది.
సమన్వయం ఇలా..: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి నాలుగైదు జిల్లాలకు వరంగల్ ఎంజీఎం అత్యాధునిక వైద్యాన్ని కల్పిస్తోంది. దీంతో ఆ ఆసుపత్రిపై అధిక భారం పడుతోంది. తాజా నిర్ణయం ప్రకారం ఎంజీఎం కిందకు ఆ జిల్లాలోని ఇత ర ఆసుపత్రులను తీసుకొస్తారు. ఎంజీఎంకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు, 35 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. అలాగే వాటి పరిధిలో గణపురం, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, పస్ర పీహెచ్‌సీలు కూడా ఉన్నాయి. ఆయా పీహెచ్‌సీల పరిధిలో 31 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. వీటన్నింటినీ ఎంజీఎం కిందకు తీసుకురావాలన్నదే సర్కారు ఉద్దేశం.
అలా డీఎంహెచ్‌వో పరిధిలోని పీహెచ్‌సీలు, డీసీహెచ్ పరిధిలోని జిల్లా, ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఎంజీఎం లాంటి బోధనాసుపత్రులన్నీ సమన్వయం అవుతాయి. ఈ ముగ్గురు విభాగాల అధికారులు మొత్తం ఆసుపత్రుల పరిపాలనా వ్యవస్థను చూసేలా ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల అన్ని ఆసుపత్రుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. స్థానికంగా నయం కాని రోగులు ఆపైన పీహెచ్‌సీకి, అక్కడా సాధ్యం కాకపోతే సామాజిక ఆరోగ్య కేంద్రాలకు వస్తారు. అక్కడా నయం కాకుంటే ఎంజీఎంకు వస్తారు. అలా కింది నుంచి పై వరకు రోగులను రిఫర్ చేస్తారు. దీంతో క్రమేణా రోగులు కూడా ఈ పద్ధతికి అలవాటు పడతారు. ఇలా చేయడం వల్ల పడకల కొరత, మందులు లేకపోవడం, వెంటిలేటర్లు దొరకకపోవడం వంటి సమస్యలకు బ్రేక్ పడుతుంది.