ఎంజీఎంలో చికిత్సకు ముందు.. చిన్నారి రాజు
ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన ఆ చిన్నారిని మృత్యువు వీధి కుక్కల రూపంలో వెంటాడింది. ఆపై గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక.. అక్కడా అయినవాళ్ల నడుమ ఆడుకుంటూ కనిపించాడు. కానీ, విధి మరొకటి తలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూశాడు. ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదించారు. హన్మకొండ జిల్లా పరిధిలో జరిగిన విషాదం.. స్థానికుల చేత కంటతడి పెట్టిస్తోంది.
వీధి కుక్కలు మరో చిన్నారిని బలిగొన్నాయి. కిందటి నెలలో కుక్కల దాడిలో గాయపడి.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రాజు(18 నెలలు) కన్నుమూశాడు. దీంతో కాజీపేట రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాజీవ్ గృహకల్ప కాలనీలో రాజు కుటుంబం ఉంటోంది. గత నెల(జూన్) 17వ తేదీన ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, 18 నెలల రాజుకి తీవ్ర గాయాలయ్యాయి. మొహంపై గాయాలతో పాటు చెంప కొంత వరకు తెగిపోయింది. పిల్లల అరుపులు విన్న స్థానికులు.. ఇళ్లలోంచి వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. ఆపై పిల్లలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఎంజీఎంలో చిన్నారి రాజు ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఆడుకుంటున్న దృశ్యాలను మొబైల్‌లో బంధించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. క్రమక్రమంగా రాజు పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. 25 రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment