నిలిచిపోయిన పొందుగులలోని పెలైట్ ప్రాజెక్టు
రెండు నెలలుగా సరఫరా కాని తాగునీరు
అడుగంటిన మంచినీటి బావులు
నీరు మోసుకొచ్చేందుకు అగచాట్లు పడుతున్న మహిళలు
దాచేపల్లి మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి
మనిషి మనుగడకు ఆధారం జలం. భూమాత ఒడిలో సేదతీరే జలరాశి రోజురోజుకూ అందనంత దూరంగా జరిగిపోతోంది. మనిషి పెంచిన కాలుష్యం కాలచక్రం గతిని తప్పించడంతో వర్షాకాలంలో కూడా వానజల్లు పలకరించని పరిస్థితులు దాపురించాయి. దీంతో భూగర్భజలాల వినియోగం పెరిగి జలరాశి ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాదికేడాది గంగ పాతాళానికి జారిపోతూ భవిష్యత్తుపై బెంగపెంచుతోంది.
చిలకలూరిపేట : పాతాళగంగ ఉబికి రానంటోంది. జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో తీవ్ర నీటి కష్టాలు ఎదురుకానున్నాయి. భూగర్భ జలాల సంరక్షణకు ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాలతో అరకొర నీటి సరఫరా జరిగినా అవి పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలను తీర్చలేకపోయాయి. నవంబరులోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్నరోజుల్లో పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తగ్గుతున్న భుగర్భ జలాలు..
ఈ ఏడాది అప్పుడప్పుడు మురిపించిన నల్లని మబ్బులు తప్పా సరైన వర్షం కురవలేదు. దీంతో పలు గ్రామాల్లో మంచినీటి చెరువులు ఎండిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో గతంలో కంటే భూగర్భ జలాలు అడుగంటాయన్న నివేదికలు కలవరానికి గురిచేస్తున్నాయి. వర్షం నీరు వృథా కాకుండా ఏ విధంగా భద్రపరచాలన్న విషయంలో స్పష్టమైన ప్రణాళికలు అధికారులు, పాలకుల వద్ద లేవు. కొందరు నిబంధనలు అతిక్రమించి ఇష్టానుసారంగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలోని గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 2014 మేలో 29.80 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉంటే 2015 మే నాటికి 34.62 మీటర్ల లోతుకు వెళ్తే కానీ నీరు లభ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపాలిటీ వారీగా పరిశీలిస్తే నరసరావుపేటలో గతంలో 2.93 మీటర్ల లోతులో లభ్యమయ్యే నీరు 3.34 మీటర్లకు, చిలకలూరిపేటలో 1.50 నుంచి 1.28 మీటర్లకు తగ్గింది. మాచర్లలో అయితే గత ఏడాది 6.78 మీటర్ల లోతులో లభ్యమయ్యే నీరు ఈ ఏదాది 12.92 మీటర్లకు దిగజారింది. వినుకొండలో గతంలో 4.78 మీటర్లుగా ఉన్న నీటి లభ్యత ప్రస్తుతం 10.27 మీటర్ల పెరిగింది.
పొంచిఉన్న ముప్పు..
వర్షాభావ పరిస్థితుల ప్రభావం భూగర్భ జలాలపై పడింది. జిల్లాలో 51,407 వేల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా 1.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో సమీప ప్రాంతాల్లో పొలాల రైతులు కూడా వ్యవసాయ బోర్లపై ఆధారపడే పంటల సాగు చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల వాడటం పెరిగింది. తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితిలో పట్టణాల్లో సైతం విచ్చలవిడిగా వేసిన బోర్లు భూగర్భ జలాలను హరించివేశాయి. వివిధ ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు అనుమతులు లేకుండా వేసినబోర్లు రోజుకు లక్షల లీటర్ల భూగర్భ జలాలను పీల్చివేశాయి. శాస్త్రీయ అంచనాల ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 135 లీటర్ల నీరు అవసరమవుతుంది. వర్షాభావ పరిస్థితులతో నీటి అవసరాల కోసం పూర్తిగా భూగర్భ జలాలపై ఆధారపడటంతో భవిష్యత్తు అంధకారంగా మారనుంది. 50 ఏళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా వాగులు, చెరువులు పూర్తిస్థాయిలో ఎండిపోవడంతో వాటిపై ఆధారపడిన రైతులు, పశువులకు కూడా నీరు అందని పరిస్థితి కొనసాగుతోంది. అధికారులు భూగర్భ జలాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తే తప్ప పొంచిఉన్న ప్రమాదం నుంచి బయటపడే అవకాశం కనిపించటం లేదు.
గ్రామాల గొంతెండుతోంది..!
Published Sat, Nov 28 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM
Advertisement
Advertisement