బాలారిష్టాలు దాటని బయోమెట్రిక్
కాకినాడ/కాకినాడ సిటీ :జిల్లాలోని కొన్ని చౌకడిపోల్లో ఆర్భాటంగా ప్రారంభించిన బయో మెట్రిక్ విధానం ఆచరణలో విఫలమవుతోంది. తరచూ మొరాయిస్తున్న పరికరాలతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే తొలిసారిగా 2012 అక్టోబర్ 20న రాజస్థాన్‌లోని డూడూ గ్రామం నుంచి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆన్ లైన్‌లో ప్రారంభించిన కాకినాడ గొడారిగుంటలోని 87వ నంబరు రేషన్ డిపోలోని బయోమెట్రిక్ పరికరమూ ఇప్పుడు పనిచేయడం లేదు. ఆధార్‌తో అనుసంధానం ద్వారా బోగస్ కార్డులను నియంత్రించే లక్ష్యంతో బయోమెట్రిక్ విధానానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అయితే తరచూ బయోమెట్రిక్ పరికరాలు మొరాయించడం, సర్వర్ పనిచేయకపోవడం, నెట్‌వర్క్ సహకరించకపోవడ ంతో ప్రతి నెలా కార్డుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. కార్డుదారు వేలిముద్రకు బయోమెట్రిక్ పరికరం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తప్ప సరుకులు పొందే అవకాశం లేకపోవడంతో అది పని చేసేదాకా పడిగాపులు పడాల్సి వస్తోంది. డీలర్లు ఒక్కోసారి గంటకు ముగ్గురు లేక నలుగురికి మించి సరుకులు ఇవ్వలేకపోతున్నారు. వృద్ధుల వేళ్ళు ముడతలుపడి అరిగిపోవడంతో ఒక్కోసారి బయోమెట్రిక్ పరికరం వారి వేలి ముద్రలను తిరస్కరించడం వల్ల కూడా ఇబ్బందులు తప్పడం లేదు.
కాకినాడలో
జిల్లాలో కాకినాడలోలోని ఆరు దుకాణాల్లో ఈ విధానాన్ని తొలుత ప్రారంభించి ఆ తరువాత దశల వారీగా వంద చౌకడిపోలకు విస్తరించారు. అధికారుల లెక్కల ప్రకారమే ప్రస్తుతం పాతికకు పైగా రేషన్ డిపోల్లో బయోమెట్రిక్ పరికరాలు మూలనపడ్డాయి. కార్డుదారులైతే సగానికి పైగా డిపోల్లో ఆ పరికరాలు సరిగా పనిచేయడం లేదంటున్నారు. వీటి నిర్వహణ చూసే సంస్థ నుంచి గానీ, అధికారుల నుంచి గానీ స్పందన ఉండడంలేదని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. బయోమెట్రిక్ అమలులో ఉన్న డిపోల్లో నేరుగా సరుకులు పంపిణీ చేసే అవకాశం లేదు.
దీంతో ఓ డిపోలోని పరికరం పాడైతే సమీపంలోని మరో డిపో నుంచి ఆ పరికరాన్ని తెచ్చి పంపిణీ చేయాల్సి వస్తోంది. దీంతో రెండు దుకాణాల పరిధిలోని కార్డుదారులు పడిగాపులు తప్పడంలేదు. ప్రధాని ప్రారంభించిన 87వ నెంబర్ రేషన్‌షాపులోని పరికరం కాలిపోవడంతో సమీపంలోని మరో షాపు నుంచి పరికరాన్ని తెచ్చి రెండు షాపులకు కలిపి సరుకులు పంపిణీ చేశారు. కార్డుదారుల ఒత్తిడితో కొద్దిరోజుల క్రితమే తాత్కాలికంగా మరో పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఈ పద్ధతికి శ్రీకారం చుట్టిన రోజున కాకినాడలో ప్రారంభించిన ఆరు షాపుల్లో మూడింట్లో ఆ పరికరాలు పనిచేయడం లేదు.
పాత పద్ధతిలోనే ఇవ్వండి..
బయోమెట్రిక్ పరికరాలను సమకూర్చిన కంపెనీ గతంలో నెలకు రెండుసార్లు వచ్చి సర్వీసింగ్ చేసేదని, ప్రస్తుతం కాంట్రాక్టు కాలపరిమితి ముగియడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని డీలర్లు అంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ప్రయోజనంలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విధానంలో ఎదురైన బాలారిష్టాలను అధిగమించకుండా దశలవారీగా జిల్లాలోని 2,560 చౌకడిపోల్లో అమలు చేయబోతే.. పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. నాణ్యమైన పరికరాలను ఏర్పాటు చేసేవరకూ పాతపద్ధతిలోనే సరుకులు ఇవ్వాలని కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారు.
15 రోజుల్లో కొత్తవి సమకూరుస్తాం : డీఎస్‌ఓ
కొన్ని చౌకడిపోల్లో బయోమెట్రిక్ పరికరాలు పాడైన విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి స్థానంలో కొత్తవాటి కోసం ప్రతిపాదనలు పంపామని డీఎస్‌ఓ రవికిరణ్ చెప్పారు. 15 రోజుల్లో కొత్తవి అమరుస్తామన్నారు.
గంటలకొద్దీ నిలబడాల్సి వస్తోంది
గతంలో వెళ్ళిన వెంటనే సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు గంటల కొద్దీ ఉండాల్సి వస్తోంది. లేకపోతే ఒకటికి రెండుసార్లు డిపో చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పద్ధతిని మార్చి ఇదివరకటి లాగే సరుకులు ఇవ్వాలి.
- యేసారపు మహాలక్ష్మమ్మ,
కార్డుదారు, గొడారిగుంట, కాకినాడ
మొరాయిస్తున్న మెషీన్లు
చౌకడిపోలకు అందజేసిన బయోమెట్రిక్ మెషీన్లు తరచు మొరాయిస్తున్నాయి. కార్డుదారులకు సకాలంలో సరుకులు అందజేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి
- కె.వీరభద్రరావు, డీలర్,
72వ నంబరు చౌకడిపో, కాకినాడ