వీరఘట్టం: రాష్ట్ర ప్రభుత్వం తీరుపై రేషన్ డీలర్లు గుర్రుమంటున్నారు. కనీస వేతనం ఇవ్వకుండా తమచే అధికంగా పనిచేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతంతమాత్రంగా శిక్షణ ఇచ్చి ఈ-పాస్ యంత్రాలతో సరుకులు పంపిణీ చేయమనడంతో సతమతమవుతున్నారు. జిల్లాలో 1990 రేషన్ డిపోలు ఉన్నాయి. వీటి ద్వారా 7,57,499 తెలుపు, ర్యాప్, ట్యాప్, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుదారులకు ప్రతినెల రేషన్ సరుకులు పంపిణీ చేయాలి. ప్రతి కార్డుదారునికి సక్రమంగా సరుకులు అందాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ-పాస్ యంత్రాలను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా లబ్ధిదారులకు మేలు జరగగా, మిగులు సరుకుల వల్ల సర్కారుకు ఆదాయం చేకూరుతుంది. ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినప్పటికీ రేషన్ డీలర్లకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ-పాస్ విధానమే డీలర్లను సమ్మెకు పురిగొల్పిందని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. ఈ-పాస్ మిషన్లు మొరాయించడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. నెలనెలా సరుకులు ఇచ్చేందుకు సర్వర్ పనిచేయకపోవటంతో వినియోగదారులతో పాటు డీలర్లు విసుగుచెందుతున్నారు. తమ సమయం వృథా అవుతుందని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేతనం రూ. 15 వేలు ఇవ్వాలి
ప్రతి డీలర్‌కు నెలకు రూ. 15 వేలు వేతనాన్ని సర్కారు ఇవ్వకపోతే ఉద్యమం తప్పదు. ఈ-పాస్ యంత్రాలతో సరుకుల అమ్మకంలో పర్సంటేజ్ ఇవ్వాల్సిందే. బియ్యంలో తరుగు శాతం కేటాయింపును అమలు చేయాలి. మా కుటుంబాలకు గ్రూప్ బీమా చేయించాలి.
- కె.వెంకటరావు, డీలర్ల సంఘ నాయకుడు, తలవరం
సమస్యలు పరిష్కరించండి
ఈ-పాస్ యంత్రాలతో రేషన్ సరుకులను ఇవ్వటం ప్రారంభించాక రేయింబవళ్లు పనిచేస్తున్నాం. షాపు అద్దె, సహాయకుని జీతం, కరెంటు బిల్లులతో చేతిచమురు వదులుతోంది. సమస్యలు అధికమవుతున్నాయి. వీటి పరిష్కారానికి చొరవ చూపాలి.
- నత్తల దాలయ్య, డీలర్ల సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు
ఇవీ డీలర్ల సమస్యలు
51 కిలోల బస్తాకు బదులు 47-48 కిలోల బస్తాల చొప్పున దిగుమతి చేస్తున్నారు.
షుగర్ ప్యాకెట్లు అన్ని పగిలిపోతున్నాయి. ఇవి కాటా ప్రకారం కార్డుదారులకు అప్పగించాల్సిందే.
చాలా మంది వినియోగదారుల ఆధార్ నంబర్లు ఈ-పాస్ యంత్రాల్లో కనిపించడం లేదు.
మ్యాన్యువల్‌గా రోజుకు 100 మంది వినియోగదారులకు రేషన్ సరుకులు ఇచ్చే డీలరు ఈ-పాస్ యంత్రంతో 30 మందికి కూడా ఇవ ్వలేని పరిస్థితి నెలకొంది.
ఈ-పాస్ యంత్రాల నిర్వహణపై అంతంతమాత్రంగా శిక్షణ ఇవ్వడంతో డీలర్లు వీటిని పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోతున్నారు.
డీలర్లతో పరేషన్
Published Sun, Sep 13 2015 12:00 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement