ఏమిటో ఈ మాయ! | Storm Victims Ration Depot Contribution two Banner differences | Sakshi
Sakshi News home page

ఏమిటో ఈ మాయ!

Published Mon, Oct 27 2014 2:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ఏమిటో ఈ మాయ! - Sakshi

ఏమిటో ఈ మాయ!

 శ్రీకాకుళం:ఈ ఫొటోల్లోని బ్యాన ర్లు చూశారా?..
 ఒక దాంట్లో 25 కేజీల బియ్యం, మరో దాంట్లో 10 కేజీల బియ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
 అలాగే ఒక దాంట్లో కందిపప్పు, కారంపొడి ఉంటే.. మరో దాంట్లో ఉల్లి, బంగాళదుంపలు ఉన్నాయి.
 మొదటిది శ్రీకాకుళం పట్టణంలోని ఫాజుల్‌బాగ్‌పేట రేషన్ డిపో వద్ద ఏర్పాటు చేయగా.. రెండోదాన్ని ఇదే పట్టణంలోని శివాలయం వీధి రేషన్ డిపో వద్ద ఏర్పాటు చేశారు.
 
 ఈ రెండూ తుపాను, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలే. అందువల్ల ఈ రెండు డిపోల పరిధిలో ఒకేరీతిలో తుపాను సహాయ నిత్యావసరాలు అందాలి. కానీ బ్యానర్లలో అన్ని తేడాలు ఎందుకున్నట్లు?..
 బ్యానర్లే కాదు. నిత్యావసర సరుకుల పంపిణీ మొత్తం ఇలాగే అస్తవ్యస్తంగా ఉంది. బాధితులకు అందాల్సిన సరుకులు పక్కదారి పడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌కి తరలిపోతున్నాయి. బాధితులందరికీ ఒకేరీతిలో సాయం అందడం లేదు. కొందరికి క ందిపప్పు, కారంపొడి అందడం లేదు. ఇంకొందరికి ఉల్లి, బంగాళ దుంపలు అందడం లేదు. బియ్యం కొందరికి 25 కేజీలు ఇస్తే.. మరికొందరికి 10 కేజీలే ఇస్తున్నారు.
 
 తుపాను బాధిత ప్రాంతాల్లో తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికే సరుకులు ఇవ్వాలని మొదట ఆదేశించిన ప్రభుత్వం ఆ తర్వాత గులాబీ కార్డుదారులకు కూడా అందజేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో 25 కేజీలు మిగిలిన ప్రాంతాల్లో 10 కేజీల బియ్యం ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ తేడాను డీలర్లు, పంపిణీ బాధ్యత తీసుకున్న కమిటీల సభ్యులు వినియోగించుకుంటున్నారు. ఇష్టానుసారం సరుకులు పంపిణీ చేస్తూ.. మిగిలిన వాటిని మార్కెట్‌కు తరలిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో పంపిణీ తీరును పరిశీలిస్తే ఫాజుల్‌బేగ్‌పేటలో 25 కేజీలు బియ్యం ఇస్తుండగా, శివాలయం వీధిలో 10 కేజీలు ఇస్తున్నారు. వాస్తవానికి ఫాజుల్‌బాగ్‌పేట కంటే ముందు శివాలయం వీధి ముంపునకు గురవుతుంది.
 
 ఈసారి కూడా అదే జరిగింది. కానీ అధికారులు మాత్రం ఈ వీధికి బియ్యం తగ్గించారన్నది స్థానికులకు అర్థం కావడం లేదు. రేషన్ డిపోల్లో సరుకుల పంపిణీలో కూడా వ్యత్యాసం ఉంటోంది. ఓ చోట ఉల్లిపాయలు, బంగాళదుంపలు, బియ్యం, పంచదార మాత్రమే ఇస్తుండగా, మరికొన్ని చోట్ల నూనె, ఉప్పు, కారం ఇస్తున్నారు. కొన్ని డిపోల్లో మాత్రమే కందిపప్పు అందజేస్తున్నారు. అక్కడ పంచదార ఇవ్వడం లేదు. అధికారులు మాత్రం అన్ని డిపోలకు సమానంగా సరుకులు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారు. మరి ఆ సరుకులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో అంతుచిక్కడం లేదు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు మాత్రం బహిరంగ మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. కొందరు డీలర్లు, టీడీపీ కమిటీల సభ్యులు సరుకులను విపణి వీధికి తరలిస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. జన్మభూమి కమిటీల సభ్యులే రేషన్ సరుకుల పంపిణీలో హవా చలాయిస్తుండగా వీరిలో కొందరు సరుకులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
 
  చేనేతలకు అందని 50 కేజీల బియ్యం
 జిల్లాలోని చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో బాదుర్లపేట మినహా మిగిలిన ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వలేదు. బాదుర్లపేటలో కూడా ఈ నెల 23న ముఖ్యమంత్రి వస్తున్నారని తెలియడంతో వేకువజామున ఇంటింటికి పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ముఖ్యమంత్రి బాదుర్లపేటలో పర్యటిస్తారని తొలుత ప్రచారం కావడంతో ఆగమేఘాల మీద పంపిణీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లోని చేనేత కార్మికులు తమ మాటేమిటని ప్రశ్నిస్తే మీరున్నట్టు ముందుగా తమకు ఎవ్వరూ చెప్పలేదని అధికారులు, ప్రజాప్రతినిధులు అంటుండడం విడ్డూరం. ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అలా జరగనప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా న్యాయం చేయాల్సిన ఇద్దరూ ఒకే మాట చెబుతుండడంతో చేనేత కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement