మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యం
తెర్లాం రూరల్: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలకు నాణ్యమైన బియ్యాన్నే పంపిణీ చేస్తున్నామని, గోదాముల ద్వారా సరఫరా చేసే బియ్యంలో ఎటువంటి తేడాలు లేవని పౌర సరఫరాల శాఖ జిల్లా సహాయ మేనేజర్(టెక్నికల్) జె.భాస్కర శర్మ స్పష్టం చేశారు. తెర్లాంలోని పౌర సరఫరాల గోదాములో సరుకుల నిల్వలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే బియ్యం నాసిరకంగా ఉంటున్నాయని, పురుగులు ఉంటున్నాయని ఇటీవల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్టేజ్-1, స్టేజ్ గోదాములను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఏ గోదాములో కూడా బియ్యం పురుగులు పట్టడం గానీ, నాసిరకమైన బియ్యంగానీ లేవన్నారు. ప్రతి నెలా స్టేజ్-1కు వచ్చే బియ్యాన్ని స్టేజ్-2 గోదాములకు పంపిణీ చేస్తామని, అక్కడ నుంచి రేషన్ డిపోలకు, వసతి గృహాలకు, పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు.
పౌర సరఫరాల గోదాముల నుంచి పంపిణీ చేస్తున్న బియ్యంలో తేడాలు లేవన్నారు. అయితే గోదాము నుంచి పాఠశాలలకు బియ్యం తీసుకువెళ్లినపుడు వచ్చే నెల వరకు నిల్వ ఉంచడం, నిల్వలను కింద ఉంచడం వల్ల బియ్యం ముక్కిపోవడం, పురుగులు పట్టడం జరుగుతుందన్నారు. పాఠశాలలకు, వసతి గృహాలకు సంబంధించి ఉపాధ్యాయులు, వార్డెన్లు గోదాములకు వచ్చి బియ్యం బస్తాలను ఎంచుకొని తీసుకువెళ్లే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. పాఠశాలలకు, వసతి గృహాలకు పంపిణీ చేసే బియ్యం బాగా లేకపోయినా వాటిని మార్చాలని గోదాము ఇన్‌చార్జిలకు సూచించామన్నారు. కార్యక్రమంలో తెర్లాం గోదాము ఇన్‌చార్జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నెమలాం ఉన్నత పాఠశాల బియ్యం పరిశీలన
నెమలాం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం బియ్యం బాగాలేవని పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో పౌర సరఫరా శాఖ జిల్లా సహాయ మేనేజరు(టెక్నికల్) భాస్కరశర్మ, తెర్లాం గోదాము ఇన్‌చార్జి నాగేశ్వరరావులు పాఠశాలకు వెళ్లి బియ్యం పరిశీలించారు. బియ్యాన్ని నెలల తరబడి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు వినియోగిస్తే పురుగులు పట్టే అవకాశం ఉండదన్నారు.