‘కీర్తిశేషులు’ అంటే మరణించినా జీవించే ఉన్నారని అర్థం. వారి కీర్తి, వారి చరిత్ర ఈ ధరిత్రి ఉన్నంతవరకూ ఉంటుంది. అది ఏ కొద్దిమందికో అంటే రాజశేఖరరెడ్డి లాంటి కారణజన్ములకే సాధ్యం. అది 2009 ఆగస్టు 31. శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరి రోజు. వైఎస్ అసెంబ్లీలో తన చాంబర్లో కూర్చొని ఉన్నారు. వారికి ఎదురు గదిలో నేను పనిచేసుకుంటున్నాను. అంతలో కొందరు మీడియా ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వ కంగా కలుస్తాం అన్నారు. నేను దగ్గరకెళ్లి అడిగాను. ‘ఓకే షార్’ అన్నారు. మూడ్ బాగున్నప్పుడు ‘వాట్ షార్’, ‘ఓకే షార్’ అనటం సారుకు అలవాటు. ఒక విలేఖరి ‘గతంలో మీరు ప్రతిపక్షనాయకుడిగా ఉన్న ప్పుడు 60 ఏళ్లు నిండాక రాజకీయాలలోంచి తప్పుకుంటాను అన్నారు. మొన్న జూలై 8 నాటికి మీకు 60 నిండాయి కదా’ అన్నారు.
‘అవునయ్యా చాలా కాలం క్రితం చెప్పాను, ఇప్పుడు మనిషి సగటు జీవిత కాలం పెరిగిందికదా. నేను కూడ ఎక్కువ కాలం పనిచేయాలనుకుంటున్నాను. ఐనా మీ మీడియాలోనే నాకు మంచి దేహధారుఢ్యం ఉందనీ, చురుకుగా పని చేస్తుంటాననీ రాస్తున్నారు కదా’ అని జవాబిచ్చారు. మరొక విలేఖరి ‘అయితే మీరు శాశ్వతంగా ఈ పదవిలో వుండాలనుకుంటున్నారా?’ అని అడిగారు. ‘వెళ్ళవయ్యా, ఇక్కడెవరైనా అమృతం తాగి ఉన్నారా శాశ్వతంగా బ్రతకడానికి’ అంటూ నవ్వేశారు. మరో 45 గంటల తర్వాత ఆ చిరునవ్వు మాయమైంది.(చదవండి: అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం )
2009లో రెండవసారి సీఎం అయ్యాక వైఎస్సార్ తన పథకాల సరళిని సమీక్షించారు. భూపంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బియ్యం, ఉపకారవేతనాలు, పింఛన్లు వంటి పథకాల ఫలి తాలు ఏమేరకు ప్రజలకు చేరుతున్నాయో తెలుసు కునేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఏరోజు ఏ గ్రామానికి వెళ్లేది రహస్యంగా ఉంచి, ఆ రోజు ఉదయం మాత్రమే ప్రకటించాలని కూడా నిర్ణయించారు. అలా సెప్టెంబర్ 2 నాడు చిత్తూరు అసెంబ్లీ, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి అసెంబ్లీ, ప్రకాశం జిల్లాలొ కొండెపి నియోజకవర్గంలోని ఒక్కో గ్రామంలో రచ్చబండ జరగాలి. ఆ గ్రామాల సమాచారం అడిగారు. మరో విషయం, సెప్టెంబరు 2న చిత్తూరులో ఆ జిల్లా శాసనమండలి సభ్యులు గోపీనాథ్ గారి కుమారుని వివాహానికి వస్తానని మాట ఇచ్చారు.
సెప్టెంబర్ 2 – ఉదయం 4.30. సీఎం ఫోన్ చేశారు. ‘శర్మా, నేను రచ్చబండకి చిత్తూరు జిల్లాలో అనుపల్లి, తరువాత నెల్లూరులో నర్రవాడ, ఆ తరువాత ప్రకాశం జిల్లాలో కనుమళ్ల గ్రామాలకు వెళ్తాను. కలెక్టర్లకు సమాచారం పంపించు’ అని చెప్పారు. మళ్లా 20 నిమిషాలకు సూరీడు ఫోన్ చేసి సీఎంకి కలిపాడు. ‘శర్మా కలెక్టర్లకు వెసులుబాటు ఇద్దాం. ఇందాక చెప్పిన మూడు గ్రామాలకు ప్రత్యా మ్నాయంగా మరో మూడు ఇద్దాం. చిత్తూరులో దిగువమాసుపల్లి, ఉదయగిరి నియోజకవర్గంలో బొడ్డువారిపల్లి, ప్రకాశంలో బింగినపల్లి...’ నేను నోట్ చేసుకున్నానని నిర్ధారించుకున్నాక ఫోన్ పెట్టేశారు.(చదవండి: రైతుల ఖాతాలోకే విద్యుత్ సబ్సిడీ)
5.40కి మళ్లీ ఫోన్ చేశారు. ఏ హెలికాప్ట్టర్ వస్తుంది, మంత్రులు ఎవరు వస్తున్నారు, పిఆర్‌ఓ రవిచంద్ కూడా వస్తున్నాడా అని అడిగారు. ఆ ముందురోజు రాత్రి పైలెట్ భాటియాతో మట్లాడాను. దానిప్రకారం అగస్టా 128 హెలికాప్ట్టర్ తప్పనిసరిగా సర్వీసుకు వెళ్లాల్సి ఉంది. అందుకని భెల్ 430 హెలికాప్టర్‌లో ఈ ప్రోగ్రాం కవర్ చేస్తున్నాం, ప్రయాణ సమయం దాదాపు రెండు గంటల పైన ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ టాంక్ నిండా తీసుకోవాలి, బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి ముగ్గురు మించి వెళ్లడం కష్టం, మిగిలిన వారు రెగ్యులర్ విమానంలో వెళ్లాలి అని పైలెట్ చెప్పారు. సీఎం, ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సెక్యూరిటీ అధికారి వెస్లీ మాత్రం హెలికాప్టర్లో వెళతారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గల్లా అరుణ కుమారి, స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని తిరుపతి విమానంలో ముందుగా వెళ్లమని కోరాను. పీఆర్‌ఓ రవిచంద్ వేరే పని ఉండటంవల్ల వెళ్లలేదు. బేగంపేటలో హెలికాప్టర్ 8 గంటలకు ఎగరాల్సి ఉంటుంది. నేను 7.45కు క్యాంప్ ఆఫీసుకు చేరాను. (చదవండి: మహానేతకు భారతరత్న ఇవ్వాలి)
అక్కడనుంచి సరిగ్గా 7.50కి బయలుదేరి 7.55కి బేగంపేట విమానాశ్రయం చేరాము. అప్పటికే అక్కడ సీఎం ముఖ్య కార్యదర్శి జన్నత్ హుస్సేన్, కార్యదర్శి ప్రభాకరరెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ డి.జి. అరవిందరావు వేచి ఉన్నారు. 8.20కి బయటికి వచ్చి కారిడార్లో నన్ను తదు పరి కార్యక్రమాల గురించి అడిగారు. ప్రధాని మన్మోహన్ తిరుపతి ప్రోగ్రాం, బీహెచ్‌ఈఎల్ మన్నవరం శంకుస్థాపన ఖరారైనాయి. 8.30కి హెలికాప్టర్లో కూర్చున్నారు. ‘శర్మా, హెలికాప్టర్ ఫ్లయింగ్ టైం ఎంత?’ ‘రెండుగంటల 5 నిమిషాలు సర్’ అని చెప్పా. హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. అది ఎగరక ముందు ఆయనతో మాట్లాడిన చివరి వ్యక్తిని నేనే. 1992 నవంబర్ 1 నుంచి సర్‌తో సాగిన నా అను బంధం భౌతికంగా 2009 సెప్టెంబర్ 2తో ముగి సింది. కానీ మానసికంగా అది ముగిసేది కాదు. అలాగే జీవితంలో మొట్టమొదటిసారి సర్ ఇచ్చినమాట నిలుపు కోలేకపొయారు. అదే గోపీనాథ్ కొడుకు వివాహానికి వస్తానని... వెళ్లకుండా... అందర్నీ దుఃఖ సముద్రంలో ముంచి కనిపించని లోకాలకు వెళ్లిపోయారు.
- భాస్కర శర్మ
వైఎస్ అదనపు ఆంతరంగిక కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment