అదిరేట్లు | Rates at peeks | Sakshi
Sakshi News home page

అదిరేట్లు

Published Fri, Aug 21 2015 4:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

అదిరేట్లు

అదిరేట్లు

♦ ఏం కొనాలన్నా అందుబాటులో లేని ధరలు
♦ కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
♦ పట్టించుకోని విజిలెన్స్ అధికారులు
 
 సత్తెనపల్లి : బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరిగి పోతున్నాయి. ఆ మేరకు సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయ వనరులు పెరగక పోవడంతో సగటు జీవి నెలబడ్జెట్ తలకిందులైంది. పెరిగిన నిత్యావసరాల ధరలతో వంటింటి బడ్జెట్ దాదాపు రెట్టింపు అయింది. సాధారణ, ఇంధన ధరలు అన్ని భారంగా మారుతున్నాయి. నలుగురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబానికి గత ఏడాది వంటింటి బడ్జెట్ సగటున రూ. 5వేలు ఉంటే... ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలతో అది రూ. 9వేలకు పెరిగింది. గత ఏడాది కిలో కంది పప్పు రూ. 75 కాగా... ఇప్పుడు అది రూ. 145కు పెరిగింది. మినపప్పు రూ. 80 నుంచి రూ. 125కు చేరుకుంది. ఇలా అన్ని రకాల నిత్యవసరాల ధరలు పెరిగి సగటు జీవి కంట కన్నీరు పెట్టిస్తున్నాయి.

 విజిలెన్స్ ఎక్కడ?.. మార్కెట్‌లో ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటో తెలుసుకుని నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గోదాముల్లో స్థాయికి మించి అధికంగా నిల్వలు చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్న విజిలెన్స్ అధికారులు ఆదిశగా కన్నెత్తి కూడా చూడడం లేదు.

 బియ్యం ధరలూ అంతే.. జిల్లాలో ఎక్కువగా సన్నరకం బియ్యాన్ని వాడతారు. బీపీటీ బియ్యం విరివిగా వాడుతు న్నారు. సంవత్సర కాలంగా బియ్యం ధరలు కూడా సామాన్యులకు అందన్నంత  స్థాయిలో పెరిగాయి. మరీ వారం రోజులుగా విపరీతంగా పెరిగాయి. గత ఏడాది కిలో రూ.25 నుంచి రూ.28 వరకు పలికిన బియ్యం ధరలు ప్రస్తుతం రూ. 40 నుంచి రూ. 45ల వరకు పెరిగిపోయాయి. మేలు రకం బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలి పోతుండటం, స్థానికంగా బియ్యం ధరలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే నిత్యవసరాల ధరలు రెట్టింపు అయ్యాయి.

 బడ్జెట్ సరిపోవడం లేదు..
 పెరిగిన నిత్యవసర ధరలతో గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం బడ్జెట్ సరిపోవడం లేదు. ఉద్యోగులకే కష్టంగా ఉంది.ఇక పేద, మధ్యతరగతి ప్రజలు జీవించడం కష్టం. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
              -కె.లక్ష్మీ, ఉపాధ్యాయురాలు

 ధరలు తగ్గించాలి..
 పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర ధరలు తగ్గించాలి. పెరిగిన ధరల కనుగుణంగా ఆదాయ వనరులు పెరగడం లేదు. దీంతో ఎంత కష్టపడుతున్నా పూటగడవని పరిస్థితి. కూరగాయల ధరలు సైతం బాగా పెరిగి పోయాయి. బియ్యం కొనాలన్నా చాలా కష్టంగా ఉంది.              
             - జి.రోజారాణి, అంగన్‌వాడీ కార్యకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement