రేషన్ బియ్యం పట్టివేత
► అక్రమంగా తరలిస్తున్న 126 బస్తాల బియ్యం స్వాధీనం
ఎమ్మిగనూరురూరల్: ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను ఆదివారం సాయంత్రం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఏపీ 21 టీయూ 2619, ఏపీ 21 టీఎక్స్ 2149 నంబర్ గల రెండు బొలెరో జీపులను పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ దగ్గర విజిలెన్స్ కానిస్టేబుల్ మధు తనిఖీ చేశారు. వాటిలో 126 బస్తాలలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా వాటిని తరలిస్తుండడంతో జిల్లా విజిలెన్స్ అధికారులకు కానిస్టేబుల్ సమాచారం అందించారు. వెంటనే కర్నూలు నుంచి విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ తహసీల్దార్ రామకృష్ణ ఆదోనికి చేరుకున్నారు.
వారు మాట్లాడుతూ ఆదోని నుంచి పట్టణంలో ముగతి రోడ్డులో ఉండే లక్ష్మీనరసింహ స్వామి రైస్ మిల్లుకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు చెప్పారు. పట్టుకున్న బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించామని తెలిపారు. ఈ బియ్యం ఏ రేషన్ షాప్ నుంచి వచ్చాయి.. ఎన్ని రోజులుగా ఈ తతంగం సాగుతోంది అనే విషయంపై విచారణ చేపట్టినట్లు చెప్పారు. విజిలెన్స్ అధికారులతో పాటు సీఎస్‌డీటీ మల్లేష్, వీఆర్వో స్నేహలత, కానిస్టేబుల్ శేఖర్ తదితరులు ఉన్నారు.