చంద్రగిరిలో ఎమ్మెల్యే దాష్టీకం
ఆర్యవైశ్య సంఘం నేత రైస్ మిల్లుకు మూత
పెద్ద మొత్తంలో డబ్బు కోసం మిల్లు యజమానికి బెదిరింపులు
అడిగినంత ఇవ్వలేనని, కొంత ఇస్తానని అన్న యజమాని
వెంటనే రంగంలోకి అధికారులు
మిల్లుకు కరెంటు సరఫరా నిలిపివేసి, తాళాలు వేసిన అధికారులు
రోడ్డునపడ్డ 200 మంది కార్మికుల కుటుంబాలు
రెండుసార్లు వేడుకొన్నా కనికరించని ఎమ్మెల్యే
దుర్భాషలాడి, భయపెట్టిన ఎమ్మెల్యే
కంట నీరు పెట్టుకొన్న ఆర్యవైశ్య సంఘం నేత కిషోర్
అధికార పార్టీ వేధింపులపై వ్యాపారుల ఆగ్రహం
తిరుపతి రూరల్: టీడీపీ కూటమి నేతల దృష్టి ఆర్యవైశ్యుల వ్యాపారాలపై పడింది. కష్టనష్టాలకోర్చి వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయాని్నవ్వడమే కాకుండా, పది మందికి ఉపాధి చూపిస్తున్న ఆర్యవైశ్యులను టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే అధికారులతో వ్యాపారాలను సీజ్ చేయిస్తున్నారు. వ్యాపారులతో పాటు వందలాది కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా పలువురు వ్యాపారులను బెదిరించి, డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా చంద్రగిరి నియోజకవర్గం కుంట్రపాకంలో ఆర్యవైశ్యుల సంఘం నాయకుడు కిషోర్‌కు చెందిన ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించారు. గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ మిల్లులో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి ఎంతో మంది రైతులు ధాన్యాన్ని ఈ మిల్లులో బియ్యం చేసుకుని వెళుతుంటారు. ఇటు కార్మికులకు, అటు అన్నదాతలకు బాసటగా నిలిచిన ఈ రైస్ మిల్లుపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కన్ను పడింది.
తన బంధువులు, తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నేతలు అమిలినేని మధు, చెరుకూరి మధు, శ్రీధర్ నాయుడును రైస్ మిల్లు యజమాని కిషోర్ వద్దకు పంపినట్లు సమాచారం. వారు ముగ్గురూ కిషోర్ దగ్గరకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంత ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే అధికారులను రంగంలోకి దించి, అన్ని రకాల అనుమతులతో నడుస్తున్న రైస్ మిల్లుకు బుధవారం అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సీజ్ చేయించినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.
దీంతో రైసు మిల్లు మూతపడింది. 200 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మిల్లు యజమాని కిషోర్ రెండుసార్లు ఎమ్మెల్యే పులివర్తి నాని వద్దకు వెళ్లి వేడుకోగా, ఆయన తీవ్రంగా దుర్భాషలాడినట్లు తెలిసింది. తాను లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడినని, తన మాట వినకుంటే జిల్లాలో ఎక్కడా నిన్ను వ్యాపారం చేయనీయను అంటూ కిషోర్‌ను భయపెట్టినట్లు సమాచారం. దీంతో కిషోర్ కంట నీరు పెట్టుకొని బయటకు వచ్చినట్లు వ్యాపారవర్గాలు తెలిపాయి.
వ్యాపారుల ఆగ్రహం
వ్యాపారుల్లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఆర్యవైశ్యుల సంక్షేమ సంఘం నాయకుడు, చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్, తిరుపతి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన కిషోర్‌నే వేధించి, ఆయన మిల్లును మూసివేయించడంపై వ్యాపారవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకొనేందుకు వ్యాపారులంతా సంఘటితమవుతున్నారు.
తమ నేత కిషోర్‌కు న్యాయం జరిగేంత వరకు బాసటగా నిలుస్తామని చెబుతున్నారు. వ్యాపార సంస్థలను మూసివేయిస్తే ఎంత మంది జీవితాలు రోడ్డున పడతాయన్నది ఆలోచించని ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన బంధువుల తీరును ప్రజలకు వివరించడంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకై వారు నిర్ణయించినట్లు సమాచారం.
అధికారుల అత్యుత్సాహం
అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన బంధువుల ఒత్తిడితో ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించడంలో అధికారులు అత్యుత్సాహం చూపించారు. సాధారణంగా ఏ వ్యాపార సంస్థనైనా సీజ్ చేయాల్సి వస్తే ముందుగా నోటీసు ఇచ్చి, మూడు నెలలు సమయం ఇవ్వాలి. నోటీసుకు యజమాని నుంచి వచ్చే సమాధానంతో పాటు మరికొన్ని నియమాలు పాటించాలి. ఈ నిబంధనలేమీ పాటించకుండానే విద్యుత్తు సరఫరా నిలిపివేసి, మిల్లును సీజ్ చేసేశారు. అందులో పనిచేసే కార్మికుల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించాలి్సన కనీస బాధ్యతను కూడా విస్మరించడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment