money demand
-
పోటీ చేయాలంటే 20 లక్షలు కట్టాలి.. కూటమి ఎమ్మెల్యేల కొత్త దందా
-
అధికార మదం.. ఆర్యవైశ్యులపై ప్రతాపం డబ్బులివ్వలేదని మూసేశారు
తిరుపతి రూరల్: టీడీపీ కూటమి నేతల దృష్టి ఆర్యవైశ్యుల వ్యాపారాలపై పడింది. కష్టనష్టాలకోర్చి వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయాని్నవ్వడమే కాకుండా, పది మందికి ఉపాధి చూపిస్తున్న ఆర్యవైశ్యులను టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే అధికారులతో వ్యాపారాలను సీజ్ చేయిస్తున్నారు. వ్యాపారులతో పాటు వందలాది కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా పలువురు వ్యాపారులను బెదిరించి, డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.తాజాగా చంద్రగిరి నియోజకవర్గం కుంట్రపాకంలో ఆర్యవైశ్యుల సంఘం నాయకుడు కిషోర్‌కు చెందిన ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించారు. గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ మిల్లులో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి ఎంతో మంది రైతులు ధాన్యాన్ని ఈ మిల్లులో బియ్యం చేసుకుని వెళుతుంటారు. ఇటు కార్మికులకు, అటు అన్నదాతలకు బాసటగా నిలిచిన ఈ రైస్ మిల్లుపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కన్ను పడింది.తన బంధువులు, తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నేతలు అమిలినేని మధు, చెరుకూరి మధు, శ్రీధర్ నాయుడును రైస్ మిల్లు యజమాని కిషోర్ వద్దకు పంపినట్లు సమాచారం. వారు ముగ్గురూ కిషోర్ దగ్గరకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంత ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే అధికారులను రంగంలోకి దించి, అన్ని రకాల అనుమతులతో నడుస్తున్న రైస్ మిల్లుకు బుధవారం అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సీజ్ చేయించినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.దీంతో రైసు మిల్లు మూతపడింది. 200 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మిల్లు యజమాని కిషోర్ రెండుసార్లు ఎమ్మెల్యే పులివర్తి నాని వద్దకు వెళ్లి వేడుకోగా, ఆయన తీవ్రంగా దుర్భాషలాడినట్లు తెలిసింది. తాను లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడినని, తన మాట వినకుంటే జిల్లాలో ఎక్కడా నిన్ను వ్యాపారం చేయనీయను అంటూ కిషోర్‌ను భయపెట్టినట్లు సమాచారం. దీంతో కిషోర్ కంట నీరు పెట్టుకొని బయటకు వచ్చినట్లు వ్యాపారవర్గాలు తెలిపాయి.వ్యాపారుల ఆగ్రహంవ్యాపారుల్లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఆర్యవైశ్యుల సంక్షేమ సంఘం నాయకుడు, చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్, తిరుపతి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన కిషోర్‌నే వేధించి, ఆయన మిల్లును మూసివేయించడంపై వ్యాపారవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకొనేందుకు వ్యాపారులంతా సంఘటితమవుతున్నారు.తమ నేత కిషోర్‌కు న్యాయం జరిగేంత వరకు బాసటగా నిలుస్తామని చెబుతున్నారు. వ్యాపార సంస్థలను మూసివేయిస్తే ఎంత మంది జీవితాలు రోడ్డున పడతాయన్నది ఆలోచించని ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన బంధువుల తీరును ప్రజలకు వివరించడంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకై వారు నిర్ణయించినట్లు సమాచారం.అధికారుల అత్యుత్సాహంఅధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన బంధువుల ఒత్తిడితో ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించడంలో అధికారులు అత్యుత్సాహం చూపించారు. సాధారణంగా ఏ వ్యాపార సంస్థనైనా సీజ్ చేయాల్సి వస్తే ముందుగా నోటీసు ఇచ్చి, మూడు నెలలు సమయం ఇవ్వాలి. నోటీసుకు యజమాని నుంచి వచ్చే సమాధానంతో పాటు మరికొన్ని నియమాలు పాటించాలి. ఈ నిబంధనలేమీ పాటించకుండానే విద్యుత్తు సరఫరా నిలిపివేసి, మిల్లును సీజ్ చేసేశారు. అందులో పనిచేసే కార్మికుల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించాలి్సన కనీస బాధ్యతను కూడా విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. -
చంపేస్తాం..! హైకోర్టు జడ్జిలకు బెదిరింపులు
బెంగళూరు: గుర్తు తెలియని వ్యక్లి నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జీలకు బెదిరింపులు అందాయి. హైకోర్టులోని ఓ ఉద్యోగితోపాటు పలువురు న్యాయమూర్తులను చంపేస్తామని ఓ పలు నెంబర్ల నుంచి వాట్సాప్ మెసెజ్‌లు వచ్చాయి. దీనిపై హైకోర్టు ప్రెస్ రిలేషన్స్ అధికారి(పీఆర్ఓ) కే మురళీధరన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా జూలై 12న రాత్రి 7 గంటలకు ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి మురళీ ధరన్ వాట్సాప్‌కు మెసెజ్ వచ్చిన్నట్లు పోలీసులు తెలిపారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన ఈ మెసెజ్‌లో తనతోపాటు హైకోర్టులోని ఆరుగురు జడ్జిలను చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఆరుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ మహ్మద్ నవాజ్, జస్టిస్ హెచ్‌టి నరేంద్ర ప్రసాద్, జస్టిస్ అశోక్ జి నిజగన్నవర్ (రిటైర్డ్), జస్టిస్ హెచ్‌పి సందేశ్, జస్టిస్ కె నటరాజన్, జస్టిస్ బి వీరప్ప (రిటైర్డ్) ఉన్నారు. కాగా బెదిరింపులు వచ్చిన నెంబర్‌ను మురళీధరన్‌కు హైకోర్టు అధికారికంగా అందించిందని తెలిపారు. పాకిస్థాన్‌లోని బ్యాంకు ఖాతాకు ₹ 50 లక్షలు చెల్లించాలని లేదంటే.. ఈ లిస్ట్‌లో పేర్కొన్న వారిని దుబాయ్ గ్యాంగ్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసెజ్‌లో ఐదు అనుమానాస్పద మొబైల్ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని చెప్పారు. మురళీధరన్ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 506, 507, 504, ఐటీ చట్టంలోని 75, 66(ఎఫ్) సెక్షన్ల కింద సెంట్రల్ CEN పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు .. నన్ను సీమాతో పోల్చకండి! -
పోలీసులమంటూ కిడ్నాప్‌లు
కృష్ణరాజపురం: డబ్బున్న వారిని చూసి కిడ్నాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఘరానా ముఠాను బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్, మహారాష్ట్రకు చెందిన సిద్దార్థ, నాగురావు, కిరణ్, బానుదాస్. వీరు పోలీస్ అధికారులమని చెప్పుకుంటూ ధనవంతులను అపహరించే దందాకు పాల్పడుతున్నారు. శివారెడ్డిని కిడ్నాప్ చేసి.. వివరాలు.. ఇటీవల ఈ ముఠా శివారెడ్డి అనే రియల్టర్‌ను కిడ్నాప్ చేసి డబ్బు వసూలు చేయడంతో బాధితుడు బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి ఇటీవల నిందితులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని క్లబ్లో ఉండగా అరెస్టు చేశారు. శివారెడ్డి, అతని స్నేహితురాలు పనిమీద హైదరాబాద్‌కు వెళ్ళిన సమయంలో హరీష్ ద్వారా వీరు పరిచయం అయ్యారు. తరువాత బెంగళూరులో భూమి కొనాలని వచ్చి శివారెడ్డిని పిలిపించి కిడ్నాప్ చేశారు. వసంతకు ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇస్తేనే శివారెడ్డిని వదిలివేస్తామన్నారు. దీంతో వసంత రూ. 11 లక్షలు తీసుకెళ్లి ఈ ముఠాకు ఇవ్వగా అతన్ని విడిచిపెట్టారు. తరువాత బాధితులు వచ్చి బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు. హరీష్ పరారీలో ఉన్నాడు. ఈ ముఠా బెంగళూరు, హైదరాబాద్‌లలో పలు నేరాలకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. (చదవండి: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం... నడిరోడ్డుపై పల్టీ కొట్టి..) -
బెదిరించానని చెబితే ఖతం చేస్తా...
సాక్షి, బంజారాహిల్స్: మద్యం మత్తులో దారికాచి ఓ స్కూటరిస్ట్‌ను బ్లేడ్‌తో బెదిరించి బలవంతంగా డబ్బులు లాక్కున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని హైలైన్ కాంప్లెక్స్‌లో నివసించే ముస్తఫా హష్మి అనే వ్యాపారి ఆదివారం అర్ధరాత్రి విధులు ముగించుకొని తన బైక్‌పై బంజారాహిల్స్ రోడ్ నం. 12 ఎన్బీటీ నగర్ కమాన్ మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. ఎన్బీటీ నగర్ కల్లు కంపౌండ్ వద్దకు రాగానే మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు హష్మిని బలవంతంగా ఆపాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. లేవని చెప్పగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకరంగా దూషిస్తూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా బ్లేడ్‌తో మెడ కోస్తానంటూ బెదిరించి బలవంతంగా జేబులో ఉన్న రూ. 5 వేలు లాక్కున్నాడు. డబ్బులు లాక్కున్నట్లు ఎవరికైనా చెబితే నిన్ను ఖతం చేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత బెదిరించిన వ్యక్తి కోసం ఆరా తీయగా బంజారాహిల్స్‌రోడ్ నం. 12లోని భోలానగర్‌కు చెందిన అఫ్రిది అహ్మద్ అలియాస్ అజహర్గా తేలింది. ఈ మేరకు అఫ్రిది అహ్మద్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 341, 384, 506, 504ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ.. భరించలేక..) -
ప్రభుత్వ ఆసుపత్రి దందా.. లంచం ఇస్తేనే ప్రసవం..
సాక్షి, నాగార్జునసాగర్ (నల్లగొండ): సాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కాన్సుల కోసం ఆస్పత్రికి వచ్చేవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. కాసులు సమర్పిస్తేనే కాన్పులు చేస్తున్నారని లేకుంటే.. మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ గర్భిణికి ప్రసవం చేసేందుకు రూ. 5వేలు డిమాండ్ చేసి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో.. డాక్టర్ అరవింద్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ నాగేశ్వర్రావుపై డీఎంఈ రమేశ్‌రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. తదుపరి విచారణకు ఉన్నతాధికారులను ఆదేశించారు. సిజేరియన్‌కు రూ.5 వేలు! సాగర్ ఏరియా ఆస్పత్రికి తిరుమలగిరి(సాగర్), పెద్దవూర, పీఏపల్లి, అనుముల మండలాల నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా.. గిరిజనులు, పేదలు ఉండడం వల్ల వారంతా ఈ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ కోసం వస్తారు. వారిని కొంతమంది డాక్టర్లు కాసులిస్తేనే కాన్పు చేస్తామని, సిజేరియన్ చేయాలంటే ఐదువేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. తిరుమలగిరి(సాగర్)మండలం రంగుండ్లకు చెందిన హరిత ఐదురోజుల క్రితం కాన్పుకోసం ఆస్పత్రికి వచ్చింది. జనరల్ సర్జన్ డాక్టర్ అరవింద్ రూ.ఐదువేలు డిమాండ్ చేసి తీసుకున్నట్లు ఆమె ఆరోపించింది. వడ్డీకి తెచ్చి డబ్బులిచ్చాను డబులిస్తేనే కాన్పు చేస్తామనడంతో వెయ్యికి రూ.20 వడ్డీకి తెచ్చి ఐదువేలు ఇచ్చాం. లేదంటే బీపీ ఉంది వేరేచోటకు పొమ్మన్నారు. ప్రాణమంటే భయం కావడంతో డాక్టర్ల డిమాండ్ మేరకు ఇవ్వాల్సి వచ్చింది. – హరితకాన్పుల సంఖ్య పెంచాం ఆస్పత్రి కొత్త భవనం ప్రారంభమయ్యాక ఆరు నెలల వరకు గర్భిణులు రాక మెటర్నిటీ వార్డు మూతపడే ఉంది. తర్వాత ఒకటి రెండు కాన్పులే అయ్యేవి. జీరో నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు నెలకు 50 నుంచి 70 వరకు సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి. మేం కష్టపడి కాన్పుల సంఖ్యను పెంచాం. గిట్టని వారు ఏదో ప్రచారం చేస్తున్నారు. నేనెవరినీ డబ్బులు అడగలేదు. తీసుకోలేదు. – డాక్టర్ అరవింద్ -
డాక్టర్ కిడ్నాప్..రూ. 5 లక్షలు వసూలు
కర్ణాటక, యశవంతపుర : అయుర్వేద డాక్టర్‌ను కారులో అపహరించి, చిత్రహింసలకు గురిచేసి అతని వద్ద నగదు, బంగారు ఉంగరాలు దోచుకెళ్లిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... అగ్రహర దాసరహళ్లికి చెందిన డాక్టర్ రవికుమార్ సుంకదకట్ట శ్రీనివాస నగరలో క్లినిక్ నడుపుతున్నారు. ఈ నెల 18న రాత్రి 10 గంటలకు విధులు ముగించుకోని బైక్‌లో వెళ్తుండగా మాగడి రోడ్డు కేహెచ్‌బీ కాలనీ అండర్‌పాస్ వద్ద అడ్డగించిన ముగ్గురు దుండగులు చాకుతో బెదిరించి కారులో అపహరించారు. నిన్ను హత్య చేయడానికి మరో డాక్టర్ రూ. 5 లక్షల సుపారీ ఇచ్చాడని రవికి చెప్పారు. నీవు రూ. 6 లక్షలు ఇస్తే వదిలేస్తామని చెప్పడంతో తీవ్ర భయాందోళనకు గురైన రవికుమార్ తనకు తెలిసిన మరో డాక్టర్‌కు వారి నుంచి ఫోన్ చేయించి నగదు తీసుకురమ్మని చెప్పాడు. దీంతో సదరు డాక్టర్, రవి కుమార్ ఇంటికి వెళ్లి విషయం వివరించి రవి సోదరి నుంచి రూ. 5 లక్షలు తీసుకుని కిడ్నాపర్లు చెప్పిన ప్రాంతానికి వచ్చి నగదు ముట్టజెప్పాడు. ఈ క్రమంలో డాక్టర్ రవికుమార్ సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడాన్ని కిడ్నాపర్లు పసిగట్టి రవి కుమార్‌ను తీవ్ర హెచ్చరించారు. అనంతరం దుండగులు రవిని నాగరబావి సర్కిల్లో దించి వెళ్లిపోయారు. తనకు పరిచయం ఉన్న వ్యక్తులే సుపారీ ఇచ్చి ఉంటారని రవికుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కామాక్షిపాళ్య పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ఇన్స్పెక్టర్కు రూ.కోటి ఇవ్వాలట
కర్ణాటక, శివాజీనగర: సీసీబీ పోలీస్ అధికారి ఒకరు రూ.1 కోటికి పైగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తనపై 3 తప్పుడు కేసులను నమోదు చేసి అమానుషంగా దాడి జరిపారని, తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలని నగరానికి చెందిన స్పందనా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జీ.టీ.వీణా డిమాండ్ చేశారు. సోమవారం ఆమె ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ సీసీబీ ఇన్స్పెక్టర్ షరీఫ్.. డబ్బు ఇవ్వాలని తనను బెదిరింపులకు గురిచేయటమే కాకుండా మానసిక వేధింపులకు గురిచేశారని తెలిపారు. ఆ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోమ్‌శాఖ మంత్రికి, పోలీసు అధికారులకు విన్నవించినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం రాలేదని ఆమె వాపోయారు. ఖాళీపత్రాలు, చెక్కులపై సంతకాలు పెద్ద నోట్ల రద్దు సమయంలో తన ట్రస్ట్‌కు అక్రమంగా రూ.4 కోట్ల నిధులు వచ్చాయని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌కు పిలిపించి 7 రోజుల పాటు కస్టడీలో పెట్టి అసభ్యకరమైన పదజాలంతో దూషించటమే కాకుండా తీవ్రంగా దాడి జరిపారని వీణా చెప్పారు. ఆ సందర్భంలో పలు పత్రాలు, 10 ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. ఈ విషయాన్ని లోకాయుక్త, పోలీసు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశానని పేర్కొన్నారు. డబ్బు ఇవ్వాలని వేధిస్తున్న ఇన్స్పెక్టర్ షరీఫ్‌ను సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో న్యాయం లభించేవరకు పోరాటం చేపడుతానని చెప్పారు. వీణా కుమార్తె మేఘనా మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ షరీఫ్ బెదిరింపులు తట్టుకోలేక మిత్రుల నుంచి రూ.1 లక్ష సరిచేసి ఆగస్టు 22న షరీఫ్‌కు ఇచ్చామన్నారు. అతనిపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన వల్ల తాము మానసికంగా, శారీరకంగా నలిగి పోయామని, ఈ విషయంలో న్యాయస్థానానికి మొరపెట్టుకొంటామని తెలిపారు. -
అమృత్సర్ ప్రమాదం : డబ్బులు అడుగుతున్న వైద్యులు
అమృతసర్ : దసరా పండుగ నాడు రావణ దహనం సందర్భంగా పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రైలు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వ ఆదేశించినప్పటికి లాభం లేకుండా పోయింది. రైలు ప్రమాద బాధితుల పట్ల ప్రైవేట్ ఆస్పత్రుల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామంటూ ప్రైవేట్ ఆస్పత్రులు బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఆగ్రహించిన జనాలు ప్రమాదం చోటు చేసుకున్న జోడా ఫాటక్ రైల్వే ట్రాక్ మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారుల వచ్చి నిరసనకారులను శాంతింపచేసి అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అంతేకాక ఎవరైనా బాధితుని వద్ద నుంచి ప్రైవేట్ ఆస్పత్రి వారు డబ్బు వసూలు చేస్తే, దాన్ని తిరిగి ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. శుక్రవారం నుంచి వైద్యం పొందుతున్న రైలు ప్రమాద బాధితుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆస్పత్రి అధికారులు తెలిపారు. -
శ్రుతిమించుతున్న హిజ్రాల ఆగడాలు
రాజేంద్రనగర్: హిజ్రాల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఏదైనా శుభకార్యం, దుకాణాల ప్రారంభోత్సవం జరిగితే వచ్చి నజరానా తీసుకోని వెళ్లేవారు. కానీ ఇప్పుడు గ్యాంగులుగా ఏర్పడి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిపై దాడులు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. రెండు రోజుల క్రితం నలుగురు హిజ్రాలు నార్సింగి సబ్‌రోడ్డులో దారిగూండా వెళ్తున్నవారిని అడ్డగించి అందిన కాడికి దోచుకున్నారు. మంచిరేవులకు చెందిన సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కొందరు హిజ్రాలు ఉన్నప్పటికీ ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గుంపులు గుంపులుగా.. హిజ్రాలు గ్యాంగులుగా ఏర్పడి నానా హడావిడి సృష్టిస్తున్నారు. ఒకొక్క గ్యాంగులో నాలుగు నుంచి 10 మంది సభ్యులు ఉంటున్నారు. ఆటోల్లో తిరుగుతూ ఎక్కడ శుభకార్యం జరిగిన వాలిపోతున్నారు. ఒకరు మాట్లాడుతుండగా మరొకరు వెలికి చేష్టలు చేస్తూ ఇబ్బందులు సృష్టిసుంటారు. వారు అడిగిన డబ్బు ఇచ్చేంత వరకు విడవడం లేదు. దీంతో నయానో.. బయానో సముదాయించి డబ్బును అందజేస్తున్నారు. పెళ్లి చేసేవారి వారి స్థాయిని బట్టి రూ. 5 నుంచి రూ. 25 వేల వరకు, గృహప్రవేశాలకు రూ. 5 నుంచి రూ.10 వేలు, ఇతర ఏ శుభకార్యాలు చేపట్టిన రూ. 5 వేల వరకు డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే.. అసభ్యకరపదజాలంతో తిడుతూ శాపనార్థాలు పెడుతూ రోడ్లపై హంగామా చేస్తారు. -
మీడియా పేరుతో బెదిరింపులు
విజయవాడ: జర్నలిస్టు అసోసియేషన్ నేత, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి(సాక్షి టీవీ కాదు) ఓ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యాన్ని బెదిరించి భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఓ సివిల్ వివాదానికి సంబంధించి ఆ చానల్ ప్రతినిధి రూ.20లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. కార్పొరేట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. కమిషనరేట్‌లో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదుపై విచారణకు ఏసీపీ స్థాయి అధికారిని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న జర్నలిస్టు అసోసియేషన్ నేత జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఆశ్రయించాడు. ఆయన ఆస్పత్రి యాజమాన్యం ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. మంత్రి జోక్యం చేసుకోవటంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతానికి కేసు నమోదు చేయకుండా ఇరుపక్షాలతో రాజీ చర్చలు జరుపుతున్నారు. ఇటీవల హనుమాన్‌జంక్షన్ వద్ద కొందరు గ్రామీణ జర్నలిస్టులు బెదిరింపులకు పాల్పడితే పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. విజయవాడలో ఓ జర్నలిస్టు నేత దందాపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విలేకరిపై పోలీసులకు ఫిర్యాదు జగ్గయ్యపేటఅర్బన్(జగ్గయ్యపేట): సింగిల్ సిటింగ్‌తో ఉన్నత చదువులకు సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడని స్థానిక సన్‌ప్లవర్ విలేకరి వల్లాపురం వెంకన్న బాబుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఈమేరకు బుధవారం వత్సవాయి మండలం, దేచుపాలేనికి చెందిన అన్నెపాక రాధ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. వివరాలు.. రెండేళ్ల నుంచి ఒక ప్రైవేటు సంస్థ పేరుతో సింగిల్ సిట్టింగ్‌తో ఇంటర్, డిగ్రీలకు సర్టిఫికెట్లు ఇప్పిస్తామని ప్రచారం చేసి తమ వంటి యువత నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిగ్రీ కోసం రూ.40 వేలు చెల్లించి 20 నెలలు అవుతున్నా సర్టిఫికెట్ ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. తనతో పాటు మరొక విద్యార్థిని మాధవి వద్ద నుంచి ఇలాగే డబ్బులు తీసుకుని సర్టిఫికెట్ ఇవ్వటం లేదని ఫిర్యాదులో తెలిపింది. -
హలో..
నాకో సమస్య ఉంది... మీరే తీర్చాలిఅపరిచిత మహిళ నుంచి ఫోన్ కాల్గంటల తరబడి మాటల ప్రవాహంకొన్నాళ్లు వరుసగా ఫోన్లలో సంభాషణఆపై భర్తను అంటూ మరో వ్యక్తి ఫోన్నా భార్యను ట్రాప్ చేశావంటూ ఆరోపణపంచాయితీకి రావాలని బెదిరింపునష్టపరిహారం పేరుతో డబ్బుల డిమాండ్బయటకు చెప్పుకోలేకపోతున్న బాధితులు సాక్షి ప్రతినిధి, వరంగల్: నగరంలో నయా మోసాలు జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లను ఆసరాగా చేసుకుని మొదట మాటలు కలుపుతూ.. ఆ తర్వాత బెదిరింపులకు దిగుతూ అందినకాడికి దోచుకునే ముఠా నగరంలో వరుసగా మోసాలకు పాల్పడుతోంది. ఈ ముఠా వేసే ట్రాప్‌లో చిక్కుకున్న పురుషులు.. జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ట్రాప్‌లో నుంచి బయట పడేందుకు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం. మోసం తీరు ఇలా.. తెలియని నంబరు నుంచి మొబైల్ ఫోన్‌కి కాల్ వస్తుంది. అవతలి వైపు ఓ మహిళ అమాయకంగా, ఆందోళనతో ‘హాలో సార్ నమసే’ అంటూ మాటలు కలుపుతోంది. తను సమస్యల్లో ఉన్నానని చెబుతోంది. ‘ఇబ్బందికర పరిస్థితుల్లో నుంచి బయటపడేందుకు తోచిన పది నంబర్లతో ఫోన్ చేస్తే మీకు కలిసిందది’ అంటూ పరిచయం చేసుకుంటోంది. తన సమస్యను చెప్పుకుంటున్నట్లుగా గంటల తరబడి సంభాషణ కొనసాగిస్తోంది. ఆ తర్వాత పదేపదే ఆమె కాల్ చేస్తూ తన సమస్యల నుంచి ఎలా బయటపడాలో చెప్పాలంటూ మాటల వల విసురుతోంది. ఈ మాటల తీరుకు ఆకర్షితులై ... ఈ సంభాషణల పరంపర కొన్నాళ్ల పాటు ఫోన్లో కొనసాగుతోంది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే .. హఠాత్తుగా ఓ పురుషుడి నుంచి ఫోన్ వస్తోంది. ‘హలో ఎలా ఉన్నారు సార్ అంటూ వ్యంగమైన ప్రశ్నతో సంభాషణ మొదలవుతోంది. మీరెవరు అని అడిగితే...‘ రోజు మీరు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతున్న మహిళను అంటూ కోపంగా మాట్లాడుతాడు. ‘నీ వల్ల నా కుటుంబం నాశనమైంది’ అంటూ శాపనార్థాలు.. ఆ తర్వాత బెదిరింపులు మొదలవుతున్నాయి. పంచాయితీకి రా.. ‘నా భార్యతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నావ్. నా భార్యను ట్రాప్ చేశావ్ . ఇద్దరు కలిసి బయట తిరుగుతున్నారు. ఈ విషయం నలుగురిలో మాట్లాడి పంచాయితీ పెడితే తప్ప పరిష్కారం ఉండదు. కాబట్టి ఎప్పుడు పంచాయతీ పెడదాం’ అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. స్పందించకుంటే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులం అంటూ మరికొందరు రంగంలోకి దిగుతున్నారు. మహిళతో ఫోన్లో మాట్లాడిన కాల్‌లిస్ట్, సంభాషణ రికార్డులతో పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటూ ఒత్తిడిని తీవ్రం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసా.. లేక పంచాయితీలో మాట్లాడుకుందామా అంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బయటకు పొక్కితే పరువు పోతుందనే భయాన్ని అపరిచిత మహిళతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తికి కలిగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ముఠా సభ్యులే పోలీసు అధికారుల్లా ఫోన్లో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ఒత్తిడిలో ఆ వ్యక్తి ఉండగానే కేసు వద్దు.. పంచాయితీ వద్దు.. నష్టపరిహారం చెల్లించుకుని సమస్యను పరిష్కరించుకో.. అనే డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నారు. బాధిత వ్యక్తి హోదా, కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి ఓ రేటు దగ్గర పంచాయతీ డీల్ కుదురుతోంది. దీంతో ఎవరికీ చెప్పుకోలేక వారు అడిగినంత ముట్టచెప్పి ఊరుకుంటున్నారు. కాజీపేట స్టేషన్ పరిధిలో ఐదుగురు.. ఇటీవల కాజీపేటలో ఓ వ్యక్తిని ఇలా బెదిరించారు. విషయం ఇంట్లో తెలిసి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులే కేసు పెట్టారు. దీంతో పంచాయితీ అంటూ బెదిరించిన వ్యక్తులు ముఖం చాటేశారు. ఒక్క కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఐదుగురు వ్యక్తులు మోసపోయినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఖరీదైన ప్లాటు రాసి ఇవ్వగా, మరో ఇద్దరు వరుసగా రూ. 6 లక్షలు, రూ. 3 లక్షలు చెల్లించినట్లు సమాచారం. మిగిలిన వారి నుంచి సుమారు రూ. 5 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు ఫిర్యాదు చేశారు.. అపరిచిత మహిళ ఫోన్ బాధితులు ఇప్పటివరకు ఇద్దరు ఫిర్యాదు చేశారు. పరువుకు భయపడి ఎవరూ కేసు పెట్టడం లేదు. అపరిచిత మహిళలు ఫోన్ చేసి మాట్లాడితే జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రలోభాలకు లోనైతే మోసపోతారు. కొత్త రకం ట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. ఇలా మోసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే పోలీసులను ఆశ్రయించండి. – అజయ్, కాజీపేట ఇన్స్పెక్టర్ -
ప్రణాళిక ప్రకారమే హత్య
సబ్బవరం(పెందుర్తి): డబ్బులు కోసం డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడని ఒకరు... తన తమ్ముడిని కొట్టాడని కక్షతో ఒకరు... కలిసి ప్రణాళిక రచించి ఓ పాత నేరస్తుడిని హతమార్చారు. గత నెల 29న రాత్రి మెగలిపురం సమీపంలోని టెరాకాన్ లే అవుట్ వద్ద రోడ్డు పక్కన సబ్బవరంలోని దుర్గానగర్ కాలనీకి చెందిన కోన చంద్రశేఖర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుని సోదరి మంగళగిరి ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సబ్బవరం పోలీస్ స్టేషన్లో అనకాపల్లి రూరల్ సీఐ జి.రామచంద్రరావు, ఎస్ఐ ఎన్.ప్రభాకర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం వెల్లడించారు. సబ్బవరంలోని దుర్గానగర్ కాలనీకి చెందిన కోన చంద్రశేఖర్, బాటజంగాలపాలెంకు చెందిన సిలారపు కుమార్(25), నాగేంద్ర కలిసి దొంగతనాలు చేస్తుండేవారు. వీరు ముగ్గురు పెందుర్తి, సబ్బవరం, పరవాడ, గాజువాక మండలాల్లో 2013, 2014వ సంవత్సరాలలో పలు దొంగతనాలకు పాల్పడడంతో 8 కేసులు నమోదయ్యాయి. అప్పట్లో వీరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో 2014లో బెయిల్‌పై వచ్చారు. దొంగగా మారిన తమ్ముడు కోన చంద్రశేఖర్‌ను అతని అక్కలు ఇంటికి రానివ్వలేదు. అప్పటి నుంచి పాతరోడ్డు సమీపంలోని షకీలా దాబాలో ఆశ్రయం పొందాడు. డబ్బులు కోసం వేధిస్తుండడంతో... జైలు నుంచి వచ్చిన తర్వాత సబ్బవరం ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని సిలారపు కుమార్ తీసుకుని విజయవాడ వెళ్లిపోయాడు. ఆమె గర్భవతి కావడంతో కొన్ని నెలల కిందట తీసుకుని సబ్బవరం వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న కోన చంద్రశేఖర్... మన ఇద్దరిపై పలు స్టేషన్లలో ఉన్న కేసులు కొట్టించేశానని, అందుకు అయిన ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే తను మరలా దొంగతనాలు చేస్తానని, కేసులన్నీ నీపైకి వస్తాయని కుమార్‌ను చంద్రశేఖర్ బెదిరించాడు. దీంతో అప్పట్లో రూ.6వేలు కుమార్ ఇచ్చాడు. అయినప్పటికీ ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధించడంతో ఎలాడైనా చంద్రశేఖర్‌ను అడ్డు తొలగించుకోవాలని కుమార్ ఆలోచన చేశాడు. అందుకోసం బీహార్ నుంచి 15 సంవత్సరాల కిందట నరవ వచ్చి టైర్లు పంక్చర్లు వేసుకుంటూ జీవిస్తున్న మహ్మద్ అలంగేర్అలియాస్ చంద్‌తో చేతులు కలిపాడు. గతంలో తన తమ్ముడు సాజిత్‌ను చంద్రశేఖర్ కొట్టడంతో కక్ష పెంచుకున్న మహ్మద్ అలంగేర్ వెంటనే అందుకు అంగీకరించాడు. వీరిద్దరూ కలిసి కోన చంద్రశేఖర్ అడ్డు తొలగించుకోవాలని నెల రోజుల కిందట ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా గతంలో తాను దొంగలించిన ఫోన్‌తో చంద్రశేఖర్‌కు మహ్మద్ గత నెల 29న ఫోన్ చేశాడు. కుమార్ డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడని, రావాలని కోరాడు. అదే రోజు రాత్రి నరవలో ఆటో బుక్ చేసుకుని సబ్బవరం కాంప్లెక్స్‌లో శేఖర్‌ను ఎక్కించుకుని రెండు బీర్లు తీసుకుని మొగలిపురంలోని టెరాకాన్ లే అవుట్ సమీపానికి చేరుకున్నారు. ముందే అనుకున్న ప్రకారం శేఖర్ మత్తులోకి జారుకున్నాక కుమార్, మహ్మద్ కలిసి రాడ్డుతో మోది, కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారైపోయారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీర్ బాటిళ్లపై ఉన్న వేలి ముద్రల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఏ1 సిలారపు కుమార్, ఏ2 మహ్మద్ అలంగెర్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. -
ప్రియుడి నగ్న ఫొటోలతో రూ. కోటి డిమాండ్
చెన్నై: ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన ఫొటోలను చూపి రూ. కోటి ఇవ్వాలని ఓ యువతి తన ప్రియుడిని డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమిళనాడులోని నామక్కల్ జిల్లా, రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్(26) బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి బెంగళూరుకు చెందిన అర్చన (22) తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. ఇరువురూ కొంతకాలం ఆనందంగా గడిపారు. ఆ సమయంలో ప్రేమ్‌కుమార్ నగ్నంగా ఉన్నపుడు అర్చన ఫొటోలు తీసింది. వాటిని చూపి ప్రియుడి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. అంతటితో ఆగకుండా తనపై ప్రేమ్ కుమార్ అత్యాచారం చేసినట్టు రాశిపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఇరువురి మధ్య ఒప్పందం కుదిర్చిన పోలీసులు ప్రేమ్ నుంచి రూ. 4 లక్షలను అర్చనకు ఇప్పించారు. అయినా అర్చన ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు దిగింది. రూ. కోటి రూపాయలు ఇవ్వకపోతే ఫొటోలు బయటపెడతానంటూ బెదిరించింది. దీంతో ప్రేమ్ కుమార్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో యువతి అరెస్టు చేశారు. -
ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ
మహిళపై కేసు నమోదు గుంటూరు ఈస్ట్ : ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి రూ.10 లక్షలు కాజేసిన మహిళపై కేసు నమోదైంది. పాతగుంటూరు ఎస్హెచ్ఓ బాలమురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసే రవిరెడ్డి శివనాగపార్వతి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించింది. ఈ క్రమంలో ఆర్టీసీ కాలనీ 5వ లైనుకు చెందిన కొనకల్లు శారద 2015 జూన్‌లో మొదటి సారిగా రూ.2 లక్షలు, అనంతరం రూ.8 లక్షలు చొప్పున మొత్తం రూ.10 లక్షలు చెల్లించింది. బ్యాంకులో ఉద్యోగం వస్తుందని నమ్మి డబ్బులు చెల్లించి వేచి చూసింది. ఎంతటికీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో శివనాగపార్వతిని నిలదీసింది. ఆమె డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ లా నటించి దొరికిపోయాడు
చెన్నై : పోలీసులా నటించి దారి దోపిడీకి ప్రయత్నించిన ఎస్ఐ కొడుకు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు మధురై బిబిక్ కులం ముల్లై నగర్‌కు చెందిన కాశిమాయన్ లోడ్మన్ మంగళవారం పనికి వెళుతుండగా... పోలీసు యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడిని తనిఖీ చేసి రూ.3,500లను బలవంతంగా లాక్కున్నారు. ఇదమని ప్రశ్నించగా, తల్లాకులం పోలీసు స్టేషన్‌కు వచ్చి సదరు నగదు తీసుకెళ్లమని బాధితుడికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ చేయగా అలాంటిది ఏదీ జరగలేదని తెలిసింది. ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పోలీసుల దుస్తులు ధరించి వాహన తనిఖీ చేస్తూ నగదు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన సదరు నకిలీ పోలీసులు అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకుని విచారణ చేయగా వారిలో ఒకరు ఎస్ఐ కుమారుడు కాగా, మరొకరు విదేశాల్లో డాక్టర్ కోర్సు చేస్తున్నాడని తెలిసింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'నేను గోషామహల్ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా..'
హైదరాబాద్ : ఎమ్మెల్యే పేరుతో నగల వ్యాపారిని రూ.లక్ష డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ సి.అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం...సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన ముండ్రాయి కృష్ణ(42) జల్సాలకు అలవాటుపడ్డాడు. సులభంగా డబ్బు సంపాదిం చేందుకు అక్రమమార్గం బాట పట్టాడు. ఈ క్రమంలోనే సిద్దిఅంబర్‌బజార్‌లోని రాము జ్యువెలర్స్ యజమాని రామచంద్రయ్య అలియాస్ రాముకు గురువారం రాత్రి 8.45కి ముండ్రాయి కృష్ణ ఫోన్ చేసి.. ‘‘నేను గోషామహల్ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా.. పబ్లిక్ మీటింగ్ నిర్వహించాల్సి ఉంది. మీటింగ్ ఖర్చు కోసం లక్ష రూపాయలు కావాలి’...అని డిమాండ్ చేశాడు. కొద్ది నిమిషాలకే మళ్లీ జ్యువెలరీ యజమానికి ఫోన్ చేసి.. ‘నేను ఎమ్మెల్యే పీఏని మాట్లాడుతున్నా.. మీటింగ్ కోసం శుక్రవారంలోగా రూ. లక్ష ఇవ్వాలి. లేకపోతే ఎమ్మెల్యే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది’ అని బెదిరించాడు. ఎమ్మెల్యేది అని చెప్పి 8686183811 ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఫోన్ చేసిన వ్యక్తిపై అనుమానం కలిగిన జ్యువెలర్స్ యజమాని శుక్రవారం ఉ దయం అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీ సులు ఫోన్ నెంబర్ ఆధారంగా నింది తుడు ముండ్రాయి కృష్ణను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై గతంలో మొగల్పుర, షాయినాయత్‌గంజ్, ముషీరాబాద్, నాంపల్లి పోలీస్స్టేషన్లలో డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడిన కేసులు నమోదైనట్టు ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు. -
రేషన్ డీలర్‌పై దాడి
కోనరావుపేట, న్యూస్‌లైన్ : అటవీ శాఖ అధికారులమని చెబుతూ ఇద్దరు యువకులు రేషన్ డీలర్‌పై దాడి చేశారు. బుధవారం రాత్రి మండలంలోని ఎగ్లాస్పూర్కు చెందిన మహేశ్, సుధాకర్ తాము అటవీ శాఖ అధికారులమని గ్రామ రేషన్ డీలర్ నాగరాజును డబ్బులు డిమాండ్ చేస్తూ దాడి చేశారు. రాత్రి 11 గంటల సమయంలో డీలర్‌ను లేపి డబ్బులు అడిగారు. ఆయన ఇవ్వకపోవడంతో దాడి చేశారు. దీంతో డీలర్ కేకలు వేయడంతో గ్రామస్తులు ఇద్దరు యువకులను పట్టుకొని నిలదీశారు. వారు అదే గ్రామానికి చెందినవారమని చెప్పడంతో చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసుల కన్నుగప్పి వారు పారిపోయారు. గురువారం ఉదయం పోలీసులు నిందితులను వదిలిపెట్టారని ఆరోపిస్తూ సుమారు రెండు వందల మంది గ్రామస్తులు కోనరావుపేట ఠాణాకు చేరుకున్నారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. డీలర్‌పై దాడి చేసిన మహేశ్, సుధాకర్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై అశోక్ చెప్పడంతో ఆందోళన విరమించారు.